బొజ్జ గణపయ్య ప్రతిమ చిటికెలో సిద్ధం!

వినాయకచవితి సందర్భంగా ప్రతి ఇంట్లోనూ బొజ్జ గణపయ్య కొలువుదీరుతాడు. ఈ క్రమంలోనే చిన్న చిన్న మట్టి విగ్రహాల్ని ఇంట్లో ఏర్పాటుచేసుకొని పూజించడం ఆనవాయితీ! అయితే వీటిని కొందరు బయటి నుంచి కొనుగోలు చేస్తే.. మరికొందరు ఇంట్లోనే స్వయంగా తయారుచేస్తుంటారు.

Published : 16 Sep 2023 12:46 IST

వినాయకచవితి సందర్భంగా ప్రతి ఇంట్లోనూ బొజ్జ గణపయ్య కొలువుదీరుతాడు. ఈ క్రమంలోనే చిన్న చిన్న మట్టి విగ్రహాల్ని ఇంట్లో ఏర్పాటుచేసుకొని పూజించడం ఆనవాయితీ! అయితే వీటిని కొందరు బయటి నుంచి కొనుగోలు చేస్తే.. మరికొందరు ఇంట్లోనే స్వయంగా తయారుచేస్తుంటారు. నిజానికి ఇలా చేత్తో గణపతి విగ్రహం తయారుచేయడం కాస్త కష్టమే అని చెప్పాలి. అందులోనూ మనం కోరుకున్న రూపాన్ని తీసుకురాలేకపోవచ్చు. ఇలాంటి వారి కోసమే ప్రస్తుతం వివిధ రూపాలతో కూడిన ‘గణేషా మౌల్డ్స్‌/అచ్చులు’ మార్కెట్లో అందుబాటు ధరల్లో దొరుకుతున్నాయి.

బాల గణపతిగా, పన్నగ శయనుడిగా, నృత్యం చేస్తున్నట్లుగా, సింహాసనంపై ఆసీనుడైనట్లుగా, అభయమిస్తున్నట్లుగా, కిరీటధారిగా, నృసింహావతారంలో.. ఇలా వివిధ రూపాల్లో కొలువుదీరిన గణపతి అచ్చులు లభ్యమవుతున్నాయి. ప్లాస్టిక్‌, సిలికాన్‌.. వంటి మెటీరియల్స్‌తో తయారుచేసిన ఈ మౌల్డ్స్‌తో నిమిషాల వ్యవధిలోనే మనకు నచ్చిన రూపంలో గణపతి విగ్రహాన్ని తీర్చిదిద్దుకోవచ్చు. విగ్రహం తయారీ కోసం సిద్ధం చేసిన మట్టి ముద్దను కొద్దికొద్దిగా తీసుకొని.. అచ్చులో ఉంచి బలంగా వత్తాలి. ఇలా మౌల్డ్‌ మొత్తాన్ని మట్టితో నింపాక.. కాసేపు అలాగే వదిలేయాలి. ఈ సమయంలో విగ్రహం కాస్త గట్టిపడుతుంది. ఇప్పుడు మౌల్డ్‌ను బోర్లిస్తే.. మనకు కావాల్సిన రూపంలో వినాయకుడు సిద్ధమైపోతాడు. ఇక్కడ మట్టికి బదులు పసుపు, గోధుమపిండి.. వంటి పదార్థాలనూ ఉపయోగించి గణపతిని సిద్ధం చేయచ్చు.

ఇక ఇలా తయారుచేసిన గణేషుడికి సహజసిద్ధమైన రంగులు వేసి.. ముత్యాలు/కుందన్స్‌/స్టోన్స్‌తో అలంకరించి.. అందమైన తలపాగా పెట్టేస్తే స్వామికి మరింత అందమొస్తుంది. ఇలా గణేషుడినే కాదు.. ఆయన వాహనమైన ఎలుకను తయారుచేయడానికీ మౌల్డ్స్‌ దొరుకుతున్నాయి. మట్టి గణపతినే కాదు.. విత్తన గణపతినీ ఈ అచ్చుల సహాయంతో తయారుచేయచ్చు. ఈ క్రమంలో మధ్యలో విత్తనాల్ని వేస్తే సరిపోతుంది. ఇలా మీ ఒక్కరి కోసమే కాదు.. మీ బంధువులు, ఇరుగుపొరుగు వారు, స్నేహితులకూ ఎకో-ఫ్రెండ్లీ గణపతిని తయారుచేసి అందించచ్చు.. తద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు మట్టి గణపతి ప్రచార కార్యక్రమంలో మీ వంతు పాత్ర పోషించచ్చు.

Photos: Amazon.in

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్