Winter Fashion : శాలువా.. స్టైలిష్‌గా చుట్టేద్దాం!

అసలే చలికాలం.. శరీరానికి నిండుగా ఉంటూనే వెచ్చదనాన్ని పంచే దుస్తుల్ని ఎంచుకోవడానికి ఆసక్తి చూపుతాం.. స్వెట్టర్లు, శాలువాలు ఇదే కోవకు చెందుతాయి. అయితే ఏది ఎంచుకున్నా సౌకర్యానికి తోడు స్టైలిష్‌గా ఉండాలని ఈ కాలపు మగువలు ఆరాటపడుతున్నారు.

Published : 25 Nov 2023 12:54 IST

(Photos: Instagram)

అసలే చలికాలం.. శరీరానికి నిండుగా ఉంటూనే వెచ్చదనాన్ని పంచే దుస్తుల్ని ఎంచుకోవడానికి ఆసక్తి చూపుతాం.. స్వెట్టర్లు, శాలువాలు ఇదే కోవకు చెందుతాయి. అయితే ఏది ఎంచుకున్నా సౌకర్యానికి తోడు స్టైలిష్‌గా ఉండాలని ఈ కాలపు మగువలు ఆరాటపడుతున్నారు. వీళ్ల అభిరుచులకు తగ్గట్లుగానే విభిన్న రకాల వింటర్‌ వేర్‌ ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతోంది. శాలువాలూ ఇందుకు మినహాయింపు కాదు. అయితే చలి నుంచి రక్షణ పొందడానికి నచ్చిన శాలువా ఎంచుకుంటే సరిపోదు.. దాన్ని స్టైలిష్‌గా ధరించినప్పుడే ఫ్యాషనబుల్‌గా కనిపించచ్చంటున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకుందాం రండి..


మ్యాచింగ్‌.. మ్యాచింగ్‌..!

శాలువా అనగానే ఊదా, క్రీమ్‌ రంగుల్లో ఉన్నవే చాలామంది ఎంచుకుంటుంటారు. అందులోనూ ప్లెయిన్‌, చెక్స్‌.. వంటి ప్యాటర్న్స్‌ ఉన్నవి ధరించడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే ఈ వింటర్‌లో కాస్త కొత్తగా ప్రయత్నించాలనుకునే వారు.. మీరు ధరించే దుస్తులకు మ్యాచింగ్‌ రంగుల్లో/ప్యాటర్న్స్‌లో ఉండే శాలువాలు ఎంచుకోవచ్చు. లేదంటే కాంట్రాస్ట్‌ కలర్స్‌నీ ప్రయత్నించచ్చు. ఈ క్రమంలో డ్రస్‌ ప్లెయిన్‌గా ఉంటే ప్రింటెడ్‌ శాలువాను, ప్రింటెడ్‌ డ్రస్‌ అయితే ప్లెయిన్‌ శాలువాను జత చేస్తే లుక్‌ అదిరిపోతుంది. ఇలాంటి కాంబినేషన్‌ ఈవెనింగ్‌ పార్టీలకు బాగా సూటవుతుంది. రాత్రి పూట చలిగా అనిపించకుండా ఉండడంతో పాటు స్టైలిష్‌గానూ కనిపించచ్చు.


బెల్టుతో బంధించేద్దాం!

భుజాల చుట్టూ శాలువాను పూర్తిగా చుట్టేయకుండా.. భుజాలు-చేతులు కవరయ్యేలా వెనక నుంచి ముందుకు ధరించాలనుకుంటారు కొందరు. అయితే ఇలా ధరించడం వల్ల శాలువా పదే పదే జారిపోతుంటుంది. అలా జరగకుండా ఉండాలంటే బెల్టుతో దాన్ని బంధించేస్తే సరి! ఈ క్రమంలో శాలువాకు మెడ వద్ద బెల్టును అమర్చుకోవడం లేదంటే శాలువాను క్రిస్‌ క్రాస్‌గా ధరించి.. నడుం వద్ద బెల్టు పెట్టుకోవడం.. ఇలా మీకు ఎలా సౌకర్యంగా అనిపిస్తే అలా చేయచ్చు. ప్రస్తుతం లెదర్‌, క్లాత్‌, డెనిమ్‌.. వంటి వివిధ రకాల బెల్టులు మార్కెట్లో దొరుకుతున్నాయి. అవి వద్దనుకుంటే శాలువాకు మ్యాచయ్యే క్లాత్‌తోనూ ప్రత్యేకంగా బెల్టును తయారుచేయించుకోవచ్చు.. ఫ్యాషనబుల్‌గా మెరిసిపోవచ్చు.


శారీకి ఇలా జత చేద్దాం!

రోజూ చీరలు ధరించడం కొంతమందికి అలవాటు! ఇలాంటి వారు శాలువాను భుజాల చుట్టూ చుట్టేస్తే చీర హైలైట్‌ కాకపోగా.. కాస్త అసౌకర్యంగానూ అనిపిస్తుంది. అందుకే శాలువానూ ఒకే వైపు వేసుకోమంటున్నారు నిపుణులు. ఓవైపు చీర కొంగుతో కవరైపోతుంది కాబట్టి.. మరో భుజంపై శాలువాను ధరిస్తే.. అటు వెచ్చగానూ ఉంటుంది.. ఇటు ఫ్యాషనబుల్‌గానూ కనిపించచ్చు. ఇందుకోసం చీరకు మ్యాచయ్యే రంగును ఎంచుకోవచ్చు.. లేదంటే కాంట్రాస్ట్‌ కలర్‌లో ఉన్న శాలువానూ ధరించచ్చు. అందులోనూ మఖ్మల్‌, పష్మీనా/కశ్మీర్‌ ఉన్నితో రూపొందించిన ప్రింటెడ్‌ శాలువాలు ఎంచుకుంటే రాయల్‌గా కనిపించచ్చు.


ఎంబ్రాయిడరీ హంగులు!

ఓవైపు చలికాలం.. పెళ్లిళ్ల సీజన్‌. ఇలాంటి తరుణంలో పెళ్లికూతుళ్లు చలి నుంచి రక్షించుకోవాలంటే శాలువానే చక్కటి ప్రత్యామ్నాయం. అలాగని సాధారణ శాలువాను ఎంచుకుంటే సింపుల్‌గా కనిపిస్తాం. అందుకే నవ వధువుల పెళ్లి కళ ఇనుమడించేలా శాలువాలకు ఎంబ్రాయిడరీతో హంగులద్దుతున్నారు డిజైనర్లు. ఈ క్రమంలో చెక్స్‌ మాదిరిగా శాలువాపై ఎంబ్రాయిడరీ చేయడం లేదంటే దానికి ఎంబ్రాయిడరీ బోర్డర్‌ను జతచేయడం.. వంటివి చేస్తున్నారు. ఇవీ వద్దనుకుంటే.. మీ అభిరుచులకు తగినట్లుగా శాలువాను కస్టమైజ్‌ కూడా చేయించుకోవచ్చు. పెళ్లి కూతుళ్లే కాదు.. పెళ్లిళ్లకు హాజరయ్యే అమ్మాయిలూ ఇలాంటి ఎంబ్రాయిడరీ శాలువాలు ఎంచుకుంటే సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా నిలవచ్చు.


హూడెడ్‌ శాలువా!

శరీరంతో పాటు తల భాగం చలి నుంచి రక్షణ పొందడానికి హూడీ జత చేసిన స్వెట్టర్లు ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇవే కాదు.. ఇదే తరహాలో శాలువాలూ లభిస్తు్న్నాయి. చూడ్డానికి కేప్‌ మాదిరిగా ఉండే వీటికి హూడీ జతచేసి ఉంటుంది. దాన్ని తలపై నుంచి ధరించి.. బిగుతుగా అడ్జెస్ట్‌ చేసుకునే అమరిక కూడా దీనికి అనుసంధానమై ఉంటుంది. ఇవి సౌకర్యాన్నే కాదు.. వెచ్చదనాన్నీ పంచుతాయి. ఇక ఇందులోనూ ప్లెయిన్‌, ప్రింటెడ్‌, ఎంబ్రాయిడరీ తరహాలో రూపొందించినవీ లభిస్తున్నాయి. మీ సౌకర్యాన్ని బట్టి స్వెట్‌షర్ట్‌ తరహావి లేదంటే బటన్‌/జిప్‌ తరహా హూడెడ్‌ శాలువాలు ఎంచుకోవచ్చు.

అయితే ఈ శాలువాల్లోనూ కశ్మీర్‌ ఉన్ని, మఖ్మల్‌, పష్మీనా.. వంటి మెటీరియల్స్‌తో రూపొందించినవి ఎంచుకుంటే వెచ్చదనాన్ని సొంతం చేసుకోవచ్చు.. రాయల్‌గానూ కనిపించచ్చు. ఇక అకేషనల్‌గా వీటిని ధరించే వారు.. మ్యాచింగ్‌ టోపీ/క్యాప్‌ను ఎంచుకోవడంతో పాటు.. బ్రూచెస్‌, పిన్స్‌.. వంటి యాక్సెసరీస్‌తో హంగులద్దితే ఫ్యాషనబుల్‌గా మెరిసిపోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్