CEO Radhika: బొమ్మలపై కాదు.. పిల్లల భవిష్యత్తుపై పెట్టుబడి పెట్టండి!

ఇంట్లో చిన్నారులుంటే.. వారు అడిగిందల్లా కొనేస్తుంటాం. వాళ్ల సంతోషాన్ని కళ్లారా చూడాలని ఇల్లంతా బొమ్మలతో నింపేస్తుంటాం.. కానీ ఈ బొమ్మల కంటే వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వడమే తల్లిదండ్రుల అసలు సిసలైన బాధ్యత అంటున్నారు ఎడెల్‌వీస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ సీఈవో రాధికా గుప్తా.

Updated : 03 Apr 2024 20:50 IST

(Photos: Instagram)

ఇంట్లో చిన్నారులుంటే.. వారు అడిగిందల్లా కొనేస్తుంటాం. వాళ్ల సంతోషాన్ని కళ్లారా చూడాలని ఇల్లంతా బొమ్మలతో నింపేస్తుంటాం.. కానీ ఈ బొమ్మల కంటే వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వడమే తల్లిదండ్రుల అసలు సిసలైన బాధ్యత అంటున్నారు ఎడెల్‌వీస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ సీఈవో రాధికా గుప్తా. పిల్లల ఆర్థిక భవిష్యత్తు బాగుండాలంటే చిన్న వయసు నుంచే తగిన ఆర్థిక ప్రణాళిక రచించుకోవడం, పొదుపు-మదుపులపై దృష్టి పెట్టడం అవసరం అంటున్నారామె. ఈ క్రమంలోనే చిన్నారుల ఆర్థిక భవిష్యత్తు కోసం కొన్ని చిట్కాలూ సూచించారామె. తాజాగా ఓ ఎక్స్‌ పోస్ట్‌లో ఆమె పంచుకున్న ఈ చిట్కాలు ఎంతోమంది పేరెంట్స్‌లో స్ఫూర్తి నింపుతున్నాయి. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

మెడ వంకర కారణంగా చిన్నతనం నుంచి ఎన్నో అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నారు రాధిక. వాటిని తట్టుకోలేక ఒకానొక సమయంలో ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసిన ఆమె.. ఆపై రియలైజ్‌ అయ్యి తనను తాను అంగీకరించడం మొదలుపెట్టారు. ఈ స్వీయ ప్రేమే ఆమెను అందలమెక్కించింది. ‘ఎడెల్‌వీస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ’ సీఈవోగా బాధ్యతలప్పగించింది. ప్రస్తుతం దేశంలోనే అసెస్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థల్లో ఏకైక మహిళా సీఈవోగా కొనసాగుతోన్న రాధిక.. ప్రముఖ బిజినెస్‌ రియాల్టీ షో ‘షార్క్‌ ట్యాంక్‌ ఇండియా’ సీజన్‌-3లో షార్క్‌ (న్యాయనిర్ణేత)గానూ అడుగుపెట్టారు. ఆర్థిక అంశాలపై తరచూ స్పందించే ఈ బిజినెస్‌ ఉమన్‌.. తాజాగా పిల్లల ఆర్థిక భవిష్యత్తుకు ఉపయోగపడే పలు చిట్కాలను ఓ ఎక్స్‌ పోస్ట్‌లో పంచుకున్నారు.

ఆ పత్రాలన్నీ పొందాలి!

పిల్లలు పుట్టగానే ఆ ఆనందంలోనే మునిగిపోతుంటారు చాలామంది. వాళ్లకు సంబంధించిన కొన్ని గుర్తింపు కార్డులు తీసుకోవాలన్న విషయం కూడా మర్చిపోతుంటారు కొందరు. ఇక మరికొందరు ఆధార్‌, పాన్‌ వంటి గుర్తింపు కార్డులు చిన్నారులకు అవసరం లేదన్న ఆలోచనతో ఉంటారు. కానీ పెద్దల్లాగే పిల్లలకూ అన్ని రకాల గుర్తింపు కార్డులు తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు రాధిక. ముఖ్యంగా జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌, పాన్‌.. వంటివి ఎంత త్వరగా తీసుకుంటే అంత మేలంటున్నారామె.

‘పుట్టిన వెంటనే జనన ధ్రువీకరణ పత్రం పొందచ్చు. దీని ఆధారంగా ఆధార్‌, ఈ రెండూ ఉంటే పాన్‌ లభిస్తుంది. ఇక మైనర్లకూ బ్యాంక్‌ అకౌంట్‌ తీసుకొనే సదుపాయం బ్యాంకులు మనకు కల్పిస్తున్నాయి. నిజానికి ఈ పత్రాలన్నీ పెద్దల కంటే మైనర్లే సులభంగా, తక్కువ సమయంలో పొందచ్చు..’ అంటారామె.

ఆర్థిక లక్ష్యం పెట్టుకోండి!

పిల్లల భవిష్యత్తు అవసరాల్ని బట్టి ఆర్థిక లక్ష్యాల్ని ఏర్పరచుకోవాలంటున్నారు రాధిక. అన్నింటికంటే ముఖ్యంగా ఉన్నత చదువులకు ప్రాధాన్యమిస్తూనే.. ఇతర అవసరాల కోసమూ పెట్టుబడుల్ని సమానంగా విభజించుకోవాలంటున్నారు.

‘పిల్లలే రేపటి పౌరులు అంటారు. అలాంటి చిన్నారుల భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలంటే వారికి ఆర్థిక భరోసా కల్పించడం ముఖ్యం. ఈ క్రమంలో వారి అవసరాల్ని దృష్టిలో ఉంచుకొని ఆర్థిక లక్ష్యాల్ని ఏర్పరచుకోవాలి. ఆయా లక్ష్యాల్ని చేరుకొనే సమయాల్ని బట్టి ఏటా వాటిలో ఎంత పెట్టుబడి పెట్టాలో నిర్ణయించుకోవాలి. దీనివల్ల పిల్లలు భవిష్యత్తులో ఇబ్బంది పడకుండా.. మీపై అదనపు భారం పడకుండా.. ఇలా రెండు విధాలుగా మేలు జరుగుతుంది..’ అంటున్నారు రాధిక.

‘సిప్‌’ మేలు!

డబ్బును పెట్టుబడి పెట్టే క్రమంలో నష్టభయం లేని ఆప్షన్స్‌ని ఎంచుకుంటాం. వీటిలో ‘సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (SIP)’ అన్నింటికంటే మేలంటున్నారు రాధిక. ఈ క్రమంలో నెలనెలా రెండు, మూడు ఫండ్లలో పెట్టుబడి పెట్టడం వల్ల రెట్టింపు ప్రయోజనాల్ని పొందచ్చంటున్నారు.

మార్కెట్లో విస్తృత అనుభవం కోసం లార్జ్/ మిడ్ ఇండెక్స్ ఫండ్; ఇంకా రిస్క్‌ తీసుకోగలిగితే మిడ్/స్మాల్ ఫండ్; విదేశీ విద్య కోసమైతే కరెన్సీ హెచ్చుతగ్గులకు అనుగుణంగా అంతర్జాతీయ పెట్టుబడి పథకాల్లో మదుపు చేయచ్చు..’ అంటూ వివిధ పెట్టుబడి మార్గాల్ని సూచిస్తున్నారామె.

పిల్లల్నీ భాగం చేయండి!

చాలామంది చిన్నారుల్ని ఆర్థిక విషయాలకు దూరంగా ఉంచుతుంటారు.. ఇప్పట్నుంచే ఇవన్నీ ఎందుకు పెద్దయ్యాక వాళ్లే అర్థం చేసుకుంటారులే అనుకుంటారు. కానీ ఈ ఆలోచన సరికాదంటున్నారు రాధిక. ఊహ తెలిసి, అన్ని విషయాలు వాళ్లు అర్థం చేసుకునే స్థాయికి చేరుకున్నాక ఆర్థిక అంశాల్లో వాళ్లను భాగం చేయడం తప్పనిసరి అంటున్నారు.
‘పిల్లల ఆర్థిక భరోసా కోసం నిర్దేశించుకున్న లక్ష్యాల్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. లక్ష్యానికి చేరువయ్యే కొద్దీ పొదుపుగా వ్యవహరించాలి. అలాగే పిల్లలకు అర్థం చేసుకొనే వయసొచ్చాక వారినీ తమ ఆర్థిక ప్రయాణంలో భాగం చేయాలి. తద్వారా వాళ్లు ఆర్థిక విషయాల గురించి మరింత బాగా అర్థం చేసుకోగలుగుతారు.. భవిష్యత్తులో మరొకరిపై ఆధారపడకుండా స్వయంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు..’ అని చెబుతున్నారు రాధిక.

ఆర్థిక బహుమతులతో భరోసా!

వ్యక్తిగత అవసరాల్ని బట్టి ఆర్థిక ప్రణాళికలూ మారతాయంటున్నారు రాధిక. కాబట్టి పిల్లల విషయంలో వారి ఆర్థిక అవసరాల్ని బట్టి ఎవరికి వారే ఆర్థిక ప్రణాళికల్ని రూపొందించుకోవడం మంచిదంటున్నారామె. అలాగే ఆట వస్తువులపై పెట్టుబడి పెట్టడం కంటే భవిష్యత్తుకు చక్కటి భరోసా అందించడమే ముఖ్యమంటున్నారు.

‘పిల్లలకు బొమ్మలంటే ఎంతిష్టమో చెప్పక్కర్లేదు. ఇలా వాళ్లు అడిగిందల్లా మనం కొనివ్వడం వల్ల ఇల్లు నిండిపోతుంది.. ఇది నాకూ అనుభవమే! అయితే ఇలా డబ్బును, ఇంట్లోని స్థలాన్ని వృథా చేయడం కంటే.. ఆర్థిక బహుమతులతో వారి భవిష్యత్తుకు భరోసా కల్పించచ్చు. వీటి వల్ల ప్రయోజనమే కాదు.. ఇంట్లో స్థలమూ ఆదా అవుతుంది..’ అని సూచిస్తున్నారు రాధిక. నిజమే కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్