Updated : 06/09/2021 19:53 IST

దగ్గు, జలుబు.. ఈ వంటింటి చిట్కాలతో దూరం!

వాతావరణంలో కలిగే మార్పులు జలుబు, దగ్గు వంటి అనారోగ్యాలను మోసుకొస్తాయి. పిల్లల నుంచి వృద్ధుల దాకా వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యల బారిన పడుతుంటారు. ఆస్పత్రికి వెళ్లినా, మందులు తీసుకున్నా ఇవి తగ్గిపోవాలంటే కచ్చితంగా కొంచెం సమయం పడుతుంది. ఈ క్రమంలో మరికొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. వీటికి తోడు ప్రస్తుతం కరోనా మరింత కలవరపాటుకు గురి చేస్తోంది.

వంటగదే మన మొదటి ఫార్మసీ!

ఈ పరిస్థితుల్లో జలుబు, దగ్గు వంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఉండేందుకు వంటింటి చిట్కాలే మేలంటున్నారు పలువురు వైద్య నిపుణులు. కిచెన్‌లోని కొన్ని పదార్థాలను ఆహారంలో చేర్చుకోవడం, ఆవిరి పట్టుకోవడం, గార్గిల్‌ చేయడం వల్ల ఈ సమస్యల నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చంటున్నారు. ఈ సందర్భంగా ‘వంటగదే మన మొదటి ఫార్మసీ’ అంటూ కొన్ని సహజ చిట్కాలను పంచుకుంటున్నారు.. మరి అవేంటో చూద్దాం రండి..

* ఒక టీస్పూన్‌ పసుపు, నల్లమిరియాలు, తేనె కలిపిన మిశ్రమం తీసుకోవాలి.

* రోజుకు కనీసం 2-3 సార్లు తులసి నీరు/టీ తాగాలి.

* ఉసిరి, పైనాపిల్‌, నిమ్మ, కివీ మొదలైన పుల్లటి పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.

* ఒక లీటరు నీటిలో 7-8 తులసి ఆకులు, ఒక చిన్న అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లి ముక్కలు, ఒక టీస్పూన్‌ చొప్పున వాము, మెంతులు, పసుపు, 4-5 నల్ల మిరియాలు వేసి మరిగించండి. ఉదయాన్నే నిద్ర లేవగానే ఈ మిశ్రమాన్ని తాగండి.

* స్నానం చేసేందుకు, తాగేందుకు చల్లటి నీరును ఉపయోగించద్దు.

* జీర్ణక్రియ మెరుగయ్యేందుకు ఎక్కువగా గోరువెచ్చని నీటిని తాగుతూ ఉండాలి.

* ఏమైనా గొంతు సమస్యలుంటే తేనె మంచి ఉపశమనమిస్తుంది.

* సాధారణ టీ, కాఫీలకు బదులు అల్లం, పసుపు, లెమన్‌టీలు తాగండి.

* గోరువెచ్చని పాలలో కొంచెం పసుపు కలుపుకొని తాగితే ఆరోగ్యానికి మంచిది.

* గొంతునొప్పి వేధిస్తుంటే కొద్దిగా పసుపు, ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటితో గార్గిల్‌ చేయాలి.

* తులసి ఆకులు నమలాలి.

* వీటితో పాటు వేయించిన ఆహార పదార్థాలు, బయటి ఆహారం, కొవ్వు పదార్థాలను బాగా తగ్గించాలి. వీలైనంతవరకు తేలికగా ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యమివ్వండి.

సో... చూశారుగా... తరచుగా వేధించే జలుబు, దగ్గు సమస్యల నుంచి ఎలా బయటపడాలో..మరి మీరు కూడా ఈ వంటింటి చిట్కాలను పాటించండి. అప్పటికీ తగ్గకపోతే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని