పిల్లల్లో కామెర్లు రావడానికి కారణమేంటి?

మా పాప వయసు 10 సంవత్సరాలు. పాపకు ఈమధ్య జ్వరం, వాంతులు, ఆకలి లేకపోవడం.. వంటి సమస్యలు వస్తున్నాయి. చర్మం కూడా కాస్త పసుపు రంగులోకి మారేసరికి డాక్టర్‌ని సంప్రదించాం. పరీక్ష చేస్తే కామెర్లు....

Published : 28 Apr 2023 12:28 IST

మా పాప వయసు 10 సంవత్సరాలు. పాపకు ఈమధ్య జ్వరం, వాంతులు, ఆకలి లేకపోవడం.. వంటి సమస్యలు వస్తున్నాయి. చర్మం కూడా కాస్త పసుపు రంగులోకి మారేసరికి డాక్టర్‌ని సంప్రదించాం. పరీక్ష చేస్తే కామెర్లు అని తెలిసింది. పిల్లల్లో కామెర్లు రావడానికి కారణాలేంటి? మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. సాధారణంగా ఈ వయసులో హెపటైటిస్ A, హెపటైటిస్‌ E అనే రెండు రకాల వైరస్‌లు వస్తుంటాయి. హెపటైటిస్‌ సిరీస్‌లో A, B, C, D, E.. ఇలా పలు వైరస్‌లు ఉంటాయి. అయితే చాలావరకు పిల్లల్లో వచ్చే కామెర్లకు హెపటైటిస్‌ A, హెపటైటిస్‌ E వైరస్‌లు కారణమవుతుంటాయి. మనదేశంలో చిన్నపిల్లల్లో హెపటైటిస్ A వైరస్‌ చాలా ఎక్కువగా వస్తుంటుంది.

అపరిశుభ్రమైన నీళ్లను తాగడం వల్ల ఈ వైరస్‌ వస్తుంటుంది. ఆ నీళ్లను తాగినప్పుడు వైరస్‌ పేగుల్లోకి వెళ్లి.. ఆ తర్వాత లివర్‌లోకి ప్రవేశించి ఇన్‌ఫెక్షన్ కలిగిస్తుంది. అయితే చాలామంది కామెర్లంటే కళ్లకు సంబంధించిన సమస్య అనుకుంటారు. కానీ, ఇది ప్రధానంగా కాలేయానికి సంబంధించిన సమస్య. కాలేయంలో బిలిరుబిన్ తయారవుతుంది. ఇది తయారవడంలో కానీ, బయటకు వెళ్లడంలో కానీ లోపాలు జరిగినప్పుడు కామెర్లు వస్తుంటాయి. బిలిరుబిన్ ఉత్పత్తి ఎక్కువైనప్పుడు రక్తంలో కలిసి రక్తమంతా పచ్చగా అవుతుంది. హెపటైటిస్ A వచ్చినప్పుడు నాలుగు రోజుల పాటు వికారంగా ఉంటుంది. అలాగే తేలికపాటి జ్వరం, వాంతులు ఎక్కువగా అవడం, కడుపు పైభాగంలో నొప్పిగా ఉండడం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ సమస్య వచ్చిన నాలుగు రోజుల తర్వాత కళ్లు పచ్చగా కనిపిస్తుంటాయి. అయితే కామెర్లు వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించిన చికిత్స కూడా సులభమైందే. ఈ వైరస్‌ రెండు వారాల పాటు మాత్రమే శరీరంలో ఉంటుంది. అయితే ఆ సమయంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్య రాకుండా ఉండడానికి పరిశుభ్రమైన నీళ్లను తీసుకోవాల్సి ఉంటుంది. కాచి చల్లార్చిన నీళ్లైతే చాలా మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని