Year Ender 2023: ఈ ఏడాది ఈ ఫ్యాషన్లదే హవా!

ఏటికేడు టెక్నాలజీలో మార్పులొచ్చినట్లే.. ఫ్యాషన్‌ ప్రపంచంలోనూ పలు మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ క్రమంలోనే అతివల అభిరుచుల్ని బట్టి డిజైనర్లు కొన్ని కొత్త ట్రెండ్స్‌ని సృష్టిస్తే.. మరికొన్ని పాత ఫ్యాషన్లే కొత్త హంగులద్దుకొని మార్కెట్లో కొలువుదీరతాయి.

Published : 23 Dec 2023 12:29 IST

(Photos: Instagram)

ఏటికేడు టెక్నాలజీలో మార్పులొచ్చినట్లే.. ఫ్యాషన్‌ ప్రపంచంలోనూ పలు మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ క్రమంలోనే అతివల అభిరుచుల్ని బట్టి డిజైనర్లు కొన్ని కొత్త ట్రెండ్స్‌ని సృష్టిస్తే.. మరికొన్ని పాత ఫ్యాషన్లే కొత్త హంగులద్దుకొని మార్కెట్లో కొలువుదీరతాయి. అలా ఈ ఏడాదీ విభిన్న ఫ్యాషన్లు తమ హవాను కొనసాగించాయి.. అటు ఫ్యాషన్‌ ప్రియుల ఆదరణకు నోచుకుంటూనే.. ఇటు ఫ్యాషన్‌ ప్రపంచంలో సరికొత్త ట్రెండ్‌ని సృష్టించాయి. వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం!

‘మెటాలిక్‌’ మెరుపుల్!

దుస్తుల ఎంపికలో రంగులది కీలక పాత్ర. చర్మ ఛాయకు నప్పేలా ఆయా రంగుల్లో ఉన్న దుస్తుల్ని ఎంచుకున్నప్పుడే అందం ఉట్టిపడుతుంది. అయితే ఈసారి సాదాసీదా రంగుల్ని పక్కన పెట్టి.. ఎక్కువమంది మెటాలిక్‌ రంగులకే ఓటేసినట్లు ఫ్యాషన్‌ నిపుణులు చెబుతున్నారు. గోల్డ్‌, సిల్వర్‌, కాపర్‌, బ్రాంజ్‌ వంటి రంగులే కాదు.. నీలం, ఆకుపచ్చ, పసుపు, ఎరుపు, ఊదా.. ఇలా దాదాపు అన్ని రంగుల్లోనూ రూపొందించిన మెటాలిక్‌ షేడెడ్‌ దుస్తులు మగువల మనసు దోచుకున్నాయి. కాస్త స్టైలిష్‌గా, ట్రెండీగా మెరిసిపోవాలనుకునే అమ్మాయిలు.. మిక్స్‌డ్‌ కలర్స్‌, మిక్స్‌డ్ టెక్స్చర్స్ తరహాలో ఉన్న డిజైన్లను ఎంచుకున్నారట! ఇక ఈ మెటాలిక్‌ రంగుల్లో ఫ్యాషనబుల్‌ దుస్తులే కాదు.. చీరలు, లెహెంగాలు, కుర్తీస్‌.. వంటి సంప్రదాయ దుస్తులూ రూపుదిద్దుకున్నాయి. ఇలా ఈ దుస్తుల మెరుపు మగువల అందాన్ని రెట్టింపు చేసిందనడంలో సందేహం లేదు.


టేక్‌ ఎ ‘బౌ’!

బౌటై అనగానే పురుషులు షర్ట్‌కి ధరించే ఓ క్లాత్‌ యాక్సెసరీనే గుర్తొస్తుంది. ఇది వారికి జెంటిల్‌మెన్‌ లుక్‌ని అందిస్తుంది. అలాగని ఇది పూర్తిగా పురుషుల ఫ్యాషనా? అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే ఈ బౌటై ఈ ఏడాది అమ్మాయిల ఫేవరెట్‌ ఫ్యాషన్‌ యాక్సెసరీగా మారిపోయిందంటున్నారు నిపుణులు. సెలబ్రిటీల దగ్గర్నుంచి సామాన్యుల దాకా తాము ఎంచుకునే కొన్ని రకాల మోడ్రన్‌ దుస్తులకు మ్యాచింగ్‌గా ఉండేలా లేదంటే కాంట్రాస్ట్‌ రంగుల్లో ఉన్న ఓ బౌటైని జత చేస్తూ మెరిసిపోయారు. ఈ క్రమంలో కొంతమంది హాఫ్‌-షోల్డర్‌ గౌన్లకు భుజాల వద్ద, మరికొందరు నడుం దగ్గర, ఇంకొందరు వీపుపై.. ఇలా దుస్తులపై అక్కడక్కడా బౌటైల్ని అమర్చిన డ్రస్సుల్ని ఎంచుకొని మెరిసిపోయారు. వీటిలోనూ దుస్తుల రంగుకు నప్పేలా ప్లెయిన్‌వి, లేదంటే వ్యతిరేక రంగుల్లో ఉన్నవి, అదీ కాదంటే కుందన్స్‌-రాళ్లు పొదిగినవి.. ఇలా భిన్నమైన బౌటైస్‌తో హంగులద్దిన దుస్తులు ఈసారి ఫ్యాషన్‌ ప్రపంచంలో సందడి చేశాయి.


‘పూల’ హవా!

ఫ్లోరల్‌ దుస్తులు.. వీటి అందమే వేరు! పైగా ఇది ఎవర్‌గ్రీన్‌ ఫ్యాషన్‌ ట్రెండ్‌ కూడా! నాటి తరం హీరోయిన్ల దగ్గర్నుంచి నేటి తరం కథానాయికల దాకా.. ఎంతోమంది విభిన్న రకాల ఫ్లోరల్‌ అటైర్స్‌ని ధరించి హొయలుపోవడం మనం చూశాం. అయితే వీటిలోనూ కాస్త చిన్న పూలు, పెద్ద పూలు, బ్యాక్‌గ్రౌండ్‌ క్లాత్‌ కలర్‌తో మ్యాచయ్యేలా రూపొందించిన ఫ్లోరల్‌ అవుట్‌ఫిట్స్‌.. వంటివే ఎక్కువగా కనిపించాయి. కానీ ఈసారి మాత్రం బ్యాక్‌గ్రౌండ్‌ రంగుకు పూర్తి వ్యతిరేక రంగుల్లో ఉన్న పూల ప్రింట్లు.. అందులోనూ ముదురు రంగు ఫ్లోరల్‌ దుస్తులకే ఫ్యాషన్‌ ప్రియులు ఓటేశారట! ఇవి వారి చర్మ ఛాయను హైలైట్‌ చేయడంతో పాటు ఫ్యాషనబుల్‌ లుక్‌ని అందించడమే ఇందుకు కారణమంటున్నారు నిపుణులు.


‘కటౌట్‌’తో కిర్రాక్‌ లుక్!

మనం రోజూ ధరించే దుస్తులు కాస్త చిరిగినా పక్కన పెట్టేస్తుంటాం.. ప్యాచప్‌ చేయించుకొని తిరిగి ధరించేవారూ తక్కువే! కానీ అలాంటి చిరిగిన దుస్తుల్నే ఈసారి ఫ్యాషన్‌ ప్రియులు ఇష్టపడ్డారట! ‘కటౌట్‌ డ్రస్సులు’గా పిలిచే ఈ ఫ్యాషన్‌ ఈ ఏడు ఫ్యాషన్‌ ప్రపంచంలో ట్రెండ్‌ని క్రియేట్‌ చేసిందంటున్నారు నిపుణులు. భుజాలు, నడుం, వీపు.. ఇలా ఆయా శరీర భాగాలు కనిపించేలా డ్రస్‌పై అక్కడక్కడా కటౌట్‌ సెక్షన్స్‌ ఉంటాయి. గుండ్రంగా, ‘వి’ షేప్‌లో, కర్వీగా.. కటౌట్స్‌ ఇలా ఎలా అయినా ఉండచ్చు. ఇక కొన్ని కటౌట్‌ దుస్తులు నడుం దగ్గర జిగ్‌జాగ్‌గా ముడిపెట్టేలా కూడా ఉంటాయి. ఈ తరహా దుస్తులు అల్ట్రా మోడ్రన్‌ లుక్‌ని అందిస్తాయి. అందుకే ఫ్యాషన్‌పై లోతైన అవగాహన ఉన్న వారు, బోల్డ్‌ లుక్‌ని ఇష్టపడే వారే వీటిని ఎక్కువగా ఎంచుకుంటున్నారట!


‘ఫ్రింజ్‌’ లుక్‌ అదుర్స్!

లేస్‌ డ్రసెస్‌ మనకు సుపరిచితమే! ఇప్పటికీ చాలామంది వార్డ్‌రోబ్‌లో లేస్‌ డ్రస్‌ ఒక్కటైనా కచ్చితంగా ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే ఈ లేస్‌లే కాస్త మోడ్రన్‌గా ముస్తాబై ‘ఫ్రింజ్‌’ తరహాలో ఈ ఏడాది మగువల మనసు దోచుకున్నాయి. డ్రస్‌ రంగుకు మ్యాచింగ్గా లేదంటే కాంట్రాస్ట్‌ కలర్‌లో లేస్‌లు వేలాడదీసినట్లుగా ఉండే ఈ దుస్తులు అమ్మాయిలకు అదిరిపోయే లుక్‌ని అందిస్తాయి. వీటిలోనూ షార్ట్‌ డ్రసెస్‌, కాఫ్తాన్స్‌, పొడవాటి గౌన్లు, లేయర్డ్‌ గౌన్లు, ఫ్రింజ్‌ క్రాప్‌టాప్స్‌, డ్రస్‌కు కింది భాగంలో జతచేసిన ఫ్రింజ్‌ లేస్‌లు.. ఇలా విభిన్న మోడల్స్‌లో ముస్తాబై మార్కెట్లోకొచ్చేశాయి. స్టైలిష్‌గా ఉంటూ, సరికొత్త లుక్‌ని అందించడం వల్లే ఈసారి ఎక్కువమంది అమ్మాయిలు ఈ ఫ్యాషన్‌పై మనసు పారేసుకున్నారట!


ఎవర్‌గ్రీన్‌ ‘శారీ’!

చీరకట్టు మన సంప్రదాయం! అయినా వీటిలోనూ కొత్త కొత్త ఫ్యాషనబుల్‌ శారీస్‌ ఏటికేడు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అలా ఈ ఏడాది ఆర్గంజా, టిష్యూ, ప్లీటెడ్‌ శారీ, సీక్విన్‌ శారీస్‌పై మగువలు ఎక్కువగా ముచ్చటపడ్డారట! పండగలు, ప్రత్యేక సందర్భాల దగ్గర్నుంచి.. పెళ్లిళ్లు, నైట్‌ పార్టీస్‌ దాకా.. ఇలాంటి ట్రెండీ శారీస్‌ని ఎంచుకోవడానికే వారు మక్కువ చూపారట! ఇక వీటిలోనూ ప్రి-డ్రేప్‌డ్‌ శారీస్‌ని ఎంచుకొని సింప్లీ సూపర్బ్‌ అనిపించుకున్నారు అతివలు. ఇలాంటి చీరలకు మ్యాచింగ్‌గా లేదంటే కాంట్రాస్ట్‌ రంగుల్లో ఉన్న బ్లౌజుల్ని ఎంచుకోవడం, మెటాలిక్‌-సీక్విన్‌ బ్లౌజులతో హంగులద్దడం వల్ల చాలామంది తమ ఫ్యాషన్‌ సెన్స్‌ని చాటుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్