డ్రైఫ్రూట్.. కేసరి కుడుములు!

పండగ అంటేనే పిండివంటలు, నైవేద్యాలు. ఇందులో భాగంగా భగవంతుడిని పూజించడం ఎంత ముఖ్యమో, ఆయనకు మనం భక్తితో సమర్పించే నైవేద్యం కూడా అంతే ముఖ్యమైనది. అందులోనూ వినాయక చవితి అంటే వెరైటీ కుడుములకు పెట్టింది పేరు.

Published : 17 Sep 2023 14:07 IST

పండగ అంటేనే పిండివంటలు, నైవేద్యాలు. ఇందులో భాగంగా భగవంతుడిని పూజించడం ఎంత ముఖ్యమో, ఆయనకు మనం భక్తితో సమర్పించే నైవేద్యం కూడా అంతే ముఖ్యమైనది. అందులోనూ వినాయక చవితి అంటే వెరైటీ కుడుములకు పెట్టింది పేరు. మరి వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కుడుములను తయారుచేసి, ఆ బొజ్జ గణపయ్యకు నైవేద్యంగా సమర్పిస్తే ఆ ఆదిదేవుడి ఆశీర్వాదం అందుకోవచ్చు. అలాంటివే ఈ వెరైటీ కుడుములు..!

డ్రైఫ్రూట్ కుడుములు

కావాల్సినవి

బాదం పప్పులు - 12

ఎండిన ఖర్జూరాలు - 8

ఎండు కొబ్బరి - అర కప్పు

నీళ్లు - ఒక టీస్పూన్

జీడిపప్పు - 15

ఎండుద్రాక్ష (కిస్‌మిస్) - 2 టేబుల్‌స్పూన్లు

నెయ్యి - ఒక టేబుల్ స్పూన్

బియ్యప్పిండి - కప్పు

ఉప్పు - కొద్దిగా

తయారీ

ముందుగా బాదం, జీడిపప్పు, కిస్‌మిస్, ఎండు కొబ్బరి.. ఇవన్నీ ప్యాన్‌లోకి తీసుకొని దోరగా వేయించాలి.

ఆపై వీటిని మిక్సీ జార్‌లోకి తీసుకొని అందులో గింజ తీసేసిన ఎండు ఖర్జూరాలు కూడా వేసి అన్నీ మిక్సీ పట్టుకోవాలి.

ఇప్పుడు ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకొని నెయ్యి వేసి, నీళ్లు పోస్తూ ముద్దలు కట్టుకునేలా కలుపుకోవాలి.

అరచేతులకు నెయ్యి రాసుకొని.. ఈ పిండిని చిన్న చిన్న ముద్దల్లా చేసుకోవాలి.

మరో గిన్నెలో బియ్యప్పిండి తీసుకొని అందులో ఉప్పు వేసి వేడి నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి.

ఈ బియ్యప్పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి కాస్త ఒత్తి మధ్యలో డ్రైఫ్రూట్స్ ముద్దను ఉంచి మూసేయాలి. ఇలా తయారుచేసుకున్న కుడుముల్ని ఆవిరిపై ఉడికిస్తే టేస్టీ టేస్టీ డ్రైఫ్రూట్స్ కుడుములు సిద్ధం!


కేసరి కుడుములు

కావాల్సినవి

కోవా - 2 కప్పులు

యాలకుల పొడి - అర టీస్పూన్

కుంకుమపువ్వు - కొద్దిగా

చక్కెర - అర కప్పు

క్రష్ చేసిన పిస్తా పప్పులు - అరకప్పు

నెయ్యి - వేయించడానికి సరిపడినంత

తయారీ

ప్యాన్‌లో కోవా, చక్కెరను తీసుకుని తక్కువ మంట మీద ఉంచాలి.

చక్కెర పూర్తిగా కరిగాక మంటను ఆఫ్ చేసి అందులో యాలకుల పొడిని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా చల్లారే వరకు పక్కన ఉంచాలి.

ఈ మిశ్రమాన్ని రెండు భాగాలుగా విభజించాలి. ఈ క్రమంలో ఒక గిన్నెలో కాస్త ఎక్కువ మిశ్రమాన్ని, మరో గిన్నెలోకి కాస్త తక్కువ మిశ్రమాన్ని తీసుకోవాలి.

తక్కువగా ఉన్న మిశ్రమంలో క్రష్ చేసిన పిస్తా పప్పులను, వేరే గిన్నెలో ఉన్న మిశ్రమానికి కుంకుమ పువ్వును కలపాలి.

ఈ రెండు మిశ్రమాలను కలిపి కేసరి కుడుములను తయారుచేయవచ్చు. అందుకోసం ముందుగా కుంకుమపువ్వు మిశ్రమాన్ని రోలింగ్ చేసి చిన్న ముద్దలుగా చేసుకోవాలి.

అరచేతులకు నెయ్యి రాసుకొని ముద్దను కాస్త ఒత్తి మధ్య భాగంలో ఉన్న ఖాళీలో పిస్తా మిశ్రమం ఉండను ఉంచి మూసేయాలి. అంతే యమ్మీ యమ్మీ కేసరి కుడుములు రడీ!

ఇక వీటితో పాటు చాలామంది ఇష్టపడే కొబ్బరి-బెల్లం కుడుములు కూడా ఎలా చేయాలో ఓసారి చూసేయండి..


కొబ్బరి-బెల్లం కుడుములు

కావాల్సినవి

బియ్యప్పిండి - ఒక కప్పు

కొబ్బరి తురుము - ఒక కప్పు

యాలకుల పొడి - పావు టీస్పూన్

ఉప్పు - ముప్పావు టీస్పూన్

బెల్లం పొడి - ఒక కప్పు

నువ్వుల నూనె - అర టీస్పూన్

నెయ్యి - టేబుల్‌స్పూన్

తయారీ

ముందుగా ఒక ప్యాన్‌లో నెయ్యి వేసి కొబ్బరి తురుమును దోరగా వేయించాలి.

మరో ప్యాన్ తీసుకుని అందులో బెల్లం వేసి తగినన్ని నీళ్లు పోసి సన్నటి మంటపై ఉంచాలి.

కాసేపయ్యాక బెల్లం చిక్కగా మారి పాకంలా తయారవుతుంది. ఆ సమయంలో ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి తురుమును కలపాలి.

ఈ మిశ్రమాన్ని మీడియం మంటపై ఉంచి పదే పదే కలుపుతుండాలి. ఇప్పుడు ఈ మిశ్రమానికి యాలకుల పొడిని జత చేసి మరోసారి కలపాలి.

కొన్ని సెకన్ల తర్వాత మంటను ఆపేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. చల్లారాక వీటిని చిన్న చిన్న ఉండల్లా చేసి పెట్టుకోవాలి.

ఆలోపు ఒక గిన్నెలో బియ్యప్పిండిని తీసుకుని అందులో ఒక కప్పు వేడి నీళ్లను పోయాలి. ఆ తర్వాత నువ్వుల నూనె, ఉప్పు కూడా వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి.

ఆ పిండిని చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని కాస్త ఒత్తి.. అందులో ఇందాక తయారుచేసి పెట్టుకున్న బెల్లం-కొబ్బరి ఉండల్ని స్టఫ్ చేయాలి.

ఇలా తయారుచేసుకున్న కుడుముల్ని ఆవిరిపై ఉడికిస్తే ఎంతో రుచికరంగా నోరూరించే కొబ్బరి-బెల్లం కుడుములు రడీ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్