Yoga: భరించలేని కోపానికి..

మనలో కొందరికి చీటికి మాటికి కోపం వస్తుంటుంది. అది ఆవేశం స్థాయి దాటి ఆగ్రహంగా మారిందంటే కష్టమే. మాటలు తూలనాడొచ్చు. చేతిలో ఉన్న వస్తువులు విధ్వంసమైపోవచ్చు. అనుబంధాలే బీటలు వారొచ్చు.

Published : 08 Apr 2023 00:19 IST

నలో కొందరికి చీటికి మాటికి కోపం వస్తుంటుంది. అది ఆవేశం స్థాయి దాటి ఆగ్రహంగా మారిందంటే కష్టమే. మాటలు తూలనాడొచ్చు. చేతిలో ఉన్న వస్తువులు విధ్వంసమైపోవచ్చు. అనుబంధాలే బీటలు వారొచ్చు. కనుక కోపానికి కారణాలు వెతకడం, అవతలి వారిదే తప్పంటూ మనల్ని మనం సమర్థించుకోవాలని చూడటం కంటే దాన్ని తగ్గించేసుకోవడం ఉత్తమం కదూ! అందుకు మానసిక వైద్యులను సంప్రదించాలి కదాని జంకుతున్నారా? అవసరం లేదు.. గర్భాసనం వేయండి చాలు.. మీలో గొప్ప మార్పు రావడం తథ్యం.

ఇలా చేయాలి.. ముందుగా కాళ్లు రెండూ ముందుకు జాపి కూర్చుని కుడి కాలిని ఎడమ తొడ మీద, ఎడమ కాలిని కుడి తొడ మీద పెట్టి పద్మాసనంలో కూర్చోవాలి. రెండు కాళ్లకి మధ్యల్లో ఏర్పడిన రెండు ఖాళీల్లో చేతులు పెట్టి కిందికి తీసుకెళ్లాలి. అలా కాళ్ల సందుల్లోంచి పోనిచ్చిన చేతులను ఫొటోలో చూపిన విధంగా గడ్డం దగ్గరికి తీసుకెళ్లాలి. అంటే మోచేతుల దగ్గర మడిచి కాళ్లకు బయటివైపు నుంచి చేతులను పైకి తీసుకెళ్లాలి. అరచేతులను గడ్డానికి అటూ ఇటూ ఉంచాలి. ఈ భంగిమలో తొడలు కొంచెం పైకి లేపి పిరుదుల మీద కూర్చోవాల్సి ఉంటుంది. ఈ ఆసనంలో ఉండగలిగినంతసేపు ఉండి నెమ్మదిగా కాళ్ల మధ్యలోంచి చేతులను తీసి యథా స్థితికి వచ్చి, సేదతీరాలి. మొదట్లో బ్యాలెన్స్‌ చేయడం కాస్త కష్టమనిపించినా క్రమంగా సులభ మవుతుంది. పద్మాసనం అలవాటు ఉన్నవారికి ఇది తేలిక.

ఇవీ ప్రయోజనాలు... గర్భాసనంతో కోపం బాగా తగ్గుతుంది. ఉదర గ్రంథులను క్రమబద్ధం చేసి సవ్యంగా పనిచేయడంలో తోడ్పడుతుంది. జీర్ణాశయం సమస్యలు తగ్గుతాయి. మొత్తం జీర్ణ ప్రక్రియను సరిచేస్తుంది. జఠరాగ్ని వృద్ధి చెందుతుంది. ఆకలి మందగించినవాళ్లు, ఆహారం పట్ల ఆసక్తి తగ్గినవాళ్లు ఈ ఆసనం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆకలి పెరుగుతుంది. మనసు, మెదడు అలజడి లేకుండా ప్రశాంతంగా ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్