శిరోజాలకు సహజ వర్ణాలు...

పార్లర్‌లో జుట్టుకు రకరకాల కలర్స్‌ వేసుకొన్నప్పుడు తాత్కాలిక మెరుపు కనిపిస్తుంది. క్రమేపీ శిరోజాలు పొడారి పేలవంగా మారతాయి. రసాయన రంగుల ప్రభావంతో జుట్టు నిర్జీవమై సహజత్వాన్ని కోల్పోతుంది.

Published : 15 Nov 2022 00:47 IST

పార్లర్‌లో జుట్టుకు రకరకాల కలర్స్‌ వేసుకొన్నప్పుడు తాత్కాలిక మెరుపు కనిపిస్తుంది. క్రమేపీ శిరోజాలు పొడారి పేలవంగా మారతాయి. రసాయన రంగుల ప్రభావంతో జుట్టు నిర్జీవమై సహజత్వాన్ని కోల్పోతుంది. సహజ సిద్ధంగా వంటింటి పదార్థాలతో శిరోజాలకు వర్ణాలను అద్దొచ్చు.

బర్గండీ.. బీట్‌రూట్‌ తురుము నుంచి తీసే రసం లేదా ఈ దుంపను చిన్నచిన్నగా పలచని చక్రాల్లా కోసి ఎండలో వారం రోజులు ఆరనిచ్చి మిక్సీలో చేసిన మెత్తని పొడిని ఒకటిన్నర చెంచా తీసుకోవాలి. ఇందులో నాలుగు చెంచాల గోరింటాకు పొడి, చెంచా కుంకుడుకాయ పొడి, సరిపడేంత టీ డికాక్షన్‌, గుడ్డు తెల్లసొన వేసి బాగా కలిపి రెండు గంటలు నాననివ్వాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు రాసి షవర్‌క్యాప్‌ ధరించాలి. గంటన్నర ఆరనిచ్చి షాంపును వినియోగించకుండా గోరువెచ్చని నీటితో కడిగేయాలి. మరుసటి రోజు షాంపూతో స్నానం చేస్తే చాలు. ఇలా నెలలో నాలుగైదుసార్లు చేస్తే శిరోజాలు ఎక్కువకాలం బర్గండీ వర్ణంలో మెరుస్తూ, మెత్తని మృదువైన పట్టుకుచ్చులా కనిపిస్తాయి. అలాగే రెండు బీట్‌రూట్‌ దుంపల తురుమును మిక్సీలో వేసి వడకట్టి రసం తీసి, 4 చెంచాల తేనె, 5 చెంచాల గోరింటాకు పొడి కలిపి రెండు గంటలు నాననివ్వాలి. దీన్ని శిరోజాలకు పట్టించి రెండు గంటలు ఆరనిచ్చి, షాంపూతో తలస్నానం చేసి కండిషనర్‌ అప్లై చేయాలి. వారానికి కనీసం రెండుసార్లు ఈ ప్యాక్‌ వేస్తే శిరోజాలకు సహజమైన బర్గండీ వర్ణాన్నివ్వడమే కాదు మృదువుగా మారుస్తుంది. జుట్టు ఒత్తుగా అవుతుంది. ఇందులోని పొటాషియం శిరోజాలను రాలకుండా సంరక్షిస్తుంది. 

కాఫీపొడితో.. జుట్టు మెరూన్‌ వర్ణంలో ప్రత్యేకంగా మెరుస్తూ ఒత్తుగా కనిపించాలనుకునేవారు, డై అలవాటు ఉన్నవారు కాఫీ పొడి ప్యాక్‌తో మంచి ఫలితాన్ని పొందొచ్చు. నాలుగు చెంచాల డికాక్షన్‌ కాఫీపొడికి కప్పు నీటిని కలిపి అయిదు నిమిషాలు మరిగించి చల్లార్చి వడకట్టాలి. ఇందులో రెండు చెంచాల బ్లాక్‌ కోకోవా, చెంచా కాఫీపొడి, నాలుగు చెంచాల గోరింటాకు పొడి, అరచెక్క నిమ్మరసం, రెండు చెంచాల ఆలివ్‌నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్లవరకు రాసి కనీసం 3 గంటలు ఆరనిచ్చి షాంపూతో స్నానం చేయాలి. ఇలా వారానికొకసారి చేస్తే డైతో పని ఉండదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్