పోషకాలతో మూడ్‌ స్వింగ్స్‌ దూరం..

నెలసరి, గర్భం దాల్చినప్పుడు మూడ్‌స్వింగ్స్‌ ప్రభావం పలు మానసిక సమస్యలకు దారితీస్తుంది. వీటిని పోషకాహారం ద్వారా జయించొచ్చు అంటున్నారు నిపుణులు. 

Updated : 10 Oct 2022 13:32 IST

నెలసరి, గర్భం దాల్చినప్పుడు మూడ్‌స్వింగ్స్‌ ప్రభావం పలు మానసిక సమస్యలకు దారితీస్తుంది. వీటిని పోషకాహారం ద్వారా జయించొచ్చు అంటున్నారు నిపుణులు. 

విటమిన్లు, ఖనిజ లవణాలు, ప్రొబయోటిక్స్‌, ఒమేగా-3 ఫ్యాటీయాసిడ్స్‌, జింక్‌ వంటి పోషకాలు తగినంతగా అందనప్పుడు నరాల వ్యవస్థ ప్రభావితమై, ఆందోళన, ఒత్తిడికి దారి తీస్తుంది. నెలసరిలో వచ్చే నొప్పి, ఆందోళనకు ఇవన్నీ తోడైతే మూడ్‌స్వింగ్స్‌ వస్తాయి. శరీరంలోని మిగతా వ్యవస్థలతో మెదడు సమన్వయం కాకపోవడంతో సమస్య తీవ్రత పెరుగుతుంది. అందుకే ఒమేగా-3, మెగ్నీషియం, బీ, కే విటమిన్లు ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి. వర్ణమయమైన కూరగాయలు, పండ్లను తీసుకోవడం ద్వారా యాంటీ ఆక్సిడెంట్స్‌ అధికంగా అందుతాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. నెలసరి సమయంలో ముఖ్యంగా ఎక్కువశాతం చక్కెర, రిఫైన్డ్‌ కార్బ్స్‌, ప్రాసెస్డ్‌ ఫుడ్‌, టాక్సిక్‌ ఫ్యాట్‌, రసాయనాలున్న ఆహారానికి దూరంగా ఉంటే మూడ్‌స్వింగ్స్‌కు గురికాకుండా ఉండొచ్చు. జింక్‌ లోపం మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది. షెల్‌ఫిష్‌, చికెన్‌, బాదం, ఆకుకూరలు మెదడుకు కావాల్సినంత జింక్‌ను అందేలా చేసి, మానసికారోగ్యాన్ని కలిగిస్తాయి. మెదడుకు అత్యంత ముఖ్యమైన బి6 విటమిన్‌ అందనప్పుడు ఆందోళన, ఒత్తిడి, చికాకు, గందరగోళం, అలసట వంటివన్నీ కలుగుతాయి. సీఫుడ్‌, మాంసాహారం, చిక్కుడు, గింజధాన్యాలు, ఆకుకూరల ద్వారా మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

గర్భిణిగా.. గర్భం దాల్చిన సమయంలో వీటి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. హార్మోన్‌ స్థాయుల్లో మార్పులు, నిద్రలేమి, అలసట, ఒత్తిడి, ఆందోళన, వికారం, వాంతులతోపాటు నెలలు పెరుగుతున్న కొద్దీ శరీరంలో కలిగే మార్పులు.. ఇవన్నీ గర్భిణిలో మూడ్‌స్వింగ్స్‌కు దారితీస్తాయి. ఇవి మానసిక అనారోగ్యాన్ని తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. పుట్టబోయే బిడ్డపైనా ఈ ప్రభావం పడుతుంది. ఇలాకాకుండా ఉండాలంటే మెదడు సక్రమంగా పనిచేసేలా పోషకాహారాన్ని తీసుకోవడంతోపాటు, వైద్యుల పర్యవేక్షణలో నడక, చిన్నచిన్న వ్యాయామాల ద్వారా శారీరకంగా ఫిట్‌గా ఉండొచ్చు. దీని వల్ల గుండెకు రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. ఎండార్ఫిన్లు విడుదలవడంతో సంతోషంతోపాటు శరీరానికి కొత్త శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది. కంటినిండా నిద్రపోవడంతో అలసట, చికాకు వంటివి దరి చేరవు. ఇంకేముంది... మూడ్‌స్వింగ్స్‌ సమస్యకు దూరంగా ఉండొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్