రోజంతా.. ఉల్లాసంగా!

ఆనందంగా నిద్రలేచామన్న సందర్భాలను గుర్తుచేసుకోండి. రోజూ బలవంతంగా లేవడం.. గబ గబా పనుల్లో పడిపోవడం..

Updated : 21 Dec 2022 04:47 IST

ఆనందంగా నిద్రలేచామన్న సందర్భాలను గుర్తుచేసుకోండి. రోజూ బలవంతంగా లేవడం.. గబ గబా పనుల్లో పడిపోవడం.. ఇంతే కదూ! అప్పుడు మొదలైన అలసట రోజంతా అలాగే ఉన్నట్లు అనిపిస్తోందా? అయితే ఈ మార్పులు చేసుకొని చూడండి.

* ఒత్తిడి.. పనులు సకాలంలో పూర్తవ్వవేమో అన్న కంగారుతోనే ప్రారంభిస్తుంటాం. సమయంతో పరుగులు పెడుతుంటాం. అదీ మెదడుపై తద్వారా శరీరంపై ప్రభావం పడేలా చేస్తుంది. లేవగానే పనిలో పడిపోకుండా ఓ 5, 10 నిమిషాలు యోగాకు కేటాయించండి. లేదా నచ్చిందేదైనా చదవడానికి ప్రయత్నించండి.. ఒత్తిడి దూరమై మనసు ఉత్తేజితమవుతుంది.

* ఎక్కువ తాగేస్తున్నారా.. నిద్ర మత్తు వదలాలనో.. ఆకలికి చెక్‌ పెట్టొచ్చనో.. హడావుడిలో ఎక్కువ పెట్టేశామనో.. టీ, కాఫీలు ఎక్కువగా తాగేస్తుంటారు. కానీ ఇవి రోజులో మూడుసార్లకు మించొద్దంటున్నారు నిపుణులు. శరీరంలో కెఫిన్‌ నిల్వలు పెరిగితే ఆ ప్రభావం నిద్రపై పడుతుంది. నిద్రా సమయం తగ్గితే ఆ ప్రభావం పడేది మెదడుపైనే. అందుకే టీ, కాఫీలు తగ్గించుకోవాలి.

* ప్రణాళిక.. నిద్ర శరీరాన్ని ఉల్లాసంగా మారుస్తుంది. అది కరవైతేనే అలసినట్లుగా నిద్ర లేస్తాం. అందుకే కనీసం 7గం. నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. అందుకు కొన్ని సూత్రాలు పాటించాలి. ఒకే సమయానికి పడుకోవాలి. పడక గదిలో ఎక్కువ వెలుతురు లేకుండా చూసుకోవాలి. మరుసటిరోజు గురించి ఆలోచించక ఆనందకరమైన, ప్రశాంతతనిచ్చే అంశాలను జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అన్నింటినీ మరచి శ్వాస మీద దృష్టిపెడితే నిద్రా త్వరగా పడుతుంది.

* కదలండి.. ఇంటి పనుల పేరుతో కదులుతూనే ఉంటాం. మరి పని పూర్తయ్యాక? ఆఫీసుకొచ్చాక? అలా అలా అడుగులేస్తున్నారా? వేయక పోవడమూ మనసుపై ప్రభావం చూపేదే! కాబట్టి, గుర్తొచ్చినప్పుడల్లా అలా నాలుగు అడుగులు వేస్తుండండి.. శరీరానికి ఆక్సిజన్‌ సరఫరా బాగా జరిగి మనసూ ఉల్లాసంగా అవుతుంది.

* 20-20-20.. స్క్రీన్‌ను ఎక్కువగా చూడటాన్నీ తగ్గించాలి. ఇవి కళ్లు అలసిపోయేలా చేసి, తలనొప్పి, దేనిపైనా దృష్టిపెట్టలేకపోవడం వంటివాటికి దారి తీస్తాయి. కాబట్టి, ప్రతి 20 నిమిషాలకోసారి బ్రేక్‌ తప్పనిసరి. ఆ సమయంలో 20 అడుగుల దూరంలో ఉన్నదాన్ని తదేకంగా చూడాలి. తర్వాత 20 సెకన్లు రిలాక్స్‌ అవ్వండి. ఇవన్నీ మనసుని తద్వారా ఆరోగ్యాన్నీ కాపాడుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్