ఎండకి ‘స్క్రీన్‌’ వేసేద్దాం!

చర్మసంరక్షణ కోసం ఏవేవో క్రీములు వాడుతుంటాం. ఏ కాలమైనా సన్‌స్క్రీన్‌ రాయమంటే మాత్రం ‘అబ్బా... మావల్ల కాదు’ అనేస్తారు చాలామంది. అసలే ఎండాకాలం.

Published : 04 Apr 2024 01:56 IST

చర్మసంరక్షణ కోసం ఏవేవో క్రీములు వాడుతుంటాం. ఏ కాలమైనా సన్‌స్క్రీన్‌ రాయమంటే మాత్రం ‘అబ్బా... మావల్ల కాదు’ అనేస్తారు చాలామంది. అసలే ఎండాకాలం. అది ముఖాన్ని మరింత జిడ్డు చేస్తుందని కొందరంటే... పొరలుగా ఊడొస్తుంది, తెల్ల మచ్చల్లా కనిపిస్తుంది... అంటూ కారణాలు చెప్పేవారు మరికొందరు. కానీ చర్మ ఆరోగ్యానికి ఇది తప్పనిసరి అని తెలుసా?

ముప్పైల్లోనే ముడతలు, గీతలు వగైరా ముఖంపైకి చేరి, అసలు వయసు కంటే పెద్దగా కనిపిస్తున్నారా? ఎండ చలవే ఇదని తెలుసా? ముడతలు, వృద్ధాప్యఛాయలకు 90 శాతం కారణం ఎండేనట. పైగా వేసవిలో వేడే కాదు, అతినీలలోహిత కిరణాల తాకిడీ ఎక్కువే. ఇవి చర్మకణాలను దెబ్బతీస్తాయి. దాన్ని అరికట్టాలంటే సన్‌స్క్రీన్‌ రాయాల్సిందే!

  • చర్మం ఆరోగ్యంగా నిగనిగలాడాలంటే ఎలాస్టిన్‌, కొల్లాజెన్‌ వంటి న్యూట్రియంట్లు తప్పనిసరి. ఎండ ప్రభావం వీటి విడుదలలో ఆటంకాలను కలుగజేస్తుంది. కొద్దిసేపు ఎండకి ఏమవుతుందిలే అనుకున్నా... అది చేసే నష్టం ఇంతా అంతా కాదు. అదే సన్‌స్క్రీన్‌ లోషన్‌ వాడితే, అది రక్షణ పొరగా ఏర్పడి, ఈ హాని నుంచి కాపాడుతుంది.
  • కాసేపు అలా బయటకు వెళ్లి వస్తే చాలు. ముఖం ఎర్రబడటం, దద్దుర్లు, మంట వగైరా పలకరిస్తాయి కదూ! వీటి నుంచీ సన్‌స్క్రీనే రక్షణ. ‘ఇవేం అంత ప్రమాదం. కొద్దిసేపట్లో తిరిగి అంతా చక్కబడుతుందిగా’ అని తేలిగ్గా తీసుకోవద్దు. దీనివల్ల చర్మ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదమూ ఉంది.
  • ‘నల్లబడొద్దనేగా రాసుకునేది! నా చర్మమెలాగూ నలుపే. ఇక అవసరమేముంటుంది’ అని వాదించేవారికీ లోటు లేదు. లేతవర్ణం చర్మం వారికి ఎక్కువ సమస్య అన్నది వాస్తవమే! కానీ డార్క్‌ స్కిన్‌ వారికీ యాక్నే, వృద్ధాప్యఛాయలతోపాటు క్యాన్సర్‌కీ దారితీయొచ్చు కాబట్టి, నిర్లక్ష్యం వద్దు.

ఏవి ఎంచుకోవాలి?

  • యూవీఏ, యూవీబీ అని రెండు రకాల హానికారక కిరణాలు చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వీటి నుంచి రక్షణ పొందాలంటే ‘బ్రాడ్‌ స్పెక్ట్రమ్‌’ ఉన్న రకాలనే ఎంచుకోవాలి. సన్‌ ప్రొటెక్షన్‌ ఫ్యాక్టర్‌ (ఎస్‌పీఎఫ్‌) యూవీ రేడియేషన్‌ నుంచి రక్షణనిస్తుంది. ఇది కనీసం 30 ఉన్నవైతేనే మేలు. వేసవి కాబట్టి, 50 వరకూ ఎంచుకోవచ్చు.

  • చర్మతీరుకు తగ్గవి ఎంచుకుంటే ఇంకా మంచిది. జిడ్డు, సాధారణ చర్మాల వారు మ్యాటే లేదా స్ప్రే రకాలను ఎంచుకోవచ్చు. ఇవైతే జిడ్డు భావన కలిగించవు. నీటి ఆధారితమైనవైనా మంచిదే. పొడి, సున్నిత చర్మాల వారికైతే క్రీమ్‌ రూపంలో ఉన్నవి సరిపడతాయి. వీటితోనైనా ఇబ్బందే అనిపిస్తే స్ప్రే, పౌడర్‌ రకాలూ మార్కెట్‌లో ఉన్నాయి. ఈకాలంలో చెమటా ఎక్కువే. కాబట్టి, వాటర్‌ రెసిస్టెంట్‌, వెరీ వాటర్‌ రెసిస్టెంట్‌ రకాలను వాడితే మేలు.
  • కొన్ని రకాల క్రీములు సన్‌స్క్రీన్‌నీ జోడించి ఇస్తాయి. హమ్మయ్యా అవి రాసుకుంటే సరిపోతుందని భావించొద్దు. సాధారణంగా వాటిల్లో తక్కువ ఎస్‌పీఎఫ్‌ ఉన్నవే ఉంటాయి. కనీసం 30 లేకపోతే విడిగా సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాయాల్సిందే. మేకప్‌ వేసుకుంటున్నా ముందు... మాయిశ్చరైజర్‌, ఆపై దీన్ని రాయక తప్పదు. లేదంటే ఎండ వల్ల కలిగే హానితోపాటు మేకప్‌లోని రసాయనాలు మరింత దుష్ప్రభావాలకు కారణం అవుతాయి. కాబట్టి, నిర్లక్ష్యం పనికి రాదు.
  • కొందరు కొద్దిగా, పైపైన రాసి, మమ అనిపించేస్తారు. అదీ మంచి పద్ధతి కాదు. తగినంత మొత్తం రాయకపోయినా హాని నుంచి తప్పించుకోలేం. పెద్ద శనగగింజ పరిమాణం కంటే ఎక్కువ మొత్తంలో రాయాలి. ఎండలోకి వెళ్లడం లేదుగా అన్న అలసత్వమూ వద్దు. ఇంట్లో ఉన్నా సన్‌స్క్రీన్‌ రాయాల్సిందే. ఇక బయటికి అడుగు పెడుతోంటే కనీసం 15 నిమిషాల ముందే రాసుకోవాలి. ముఖం వరకూ రాస్తే సరిపోతుంది అనుకుంటున్నారేమో! ఎండ ప్రభావం పడే మెడ, వీపు, చేతులు, పాదాలకూ రాయాలి. ఇంకా ఎండలో ఎక్కువ సమయం ఉండాల్సి వస్తే ప్రతి రెండు గంటలకోసారి రాస్తూ ఉండాలి.
  • పిల్లలకు సన్‌స్క్రీన్‌ అవసరం లేదన్నదీ భ్రమే! ఆరేళ్లలోపు పిల్లలకు టోపీ, స్కార్ఫ్‌ లాంటివి వాడాలి. అంతకన్నా పెద్దవారికి ఆటల సమయంలోనే కాదు, కొద్దిసేపు బయట అడుగుపెడుతున్నా ఈ రక్షణ తప్పనిసరి. పైగా ఆర్గానిక్‌ సన్‌స్క్రీన్‌లూ వస్తున్నాయిప్పుడు!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్