ఇల్లాలే జగన్మాత

సృష్టిని నడిపించే అనంత శక్తి స్వరూపం జగన్మాత. ఆ ఆదిపరాశక్తి నిరంతరం సహస్ర రూపాల్లో ఈ లోకాన్ని సంరక్షిస్తున్నట్లు స్త్రీ కూడా అనేక రూపాల్లో తన వారిని, ఇంటిని కాపాడుకుంటోంది. రాక్షసులపై మాత సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి పర్వదినం. చెడుపై మంచి గెలుస్తుందనడానికి సంకేతం కూడా. జగన్మాత ఆదిశంకరుని వినతిని మన్నించి కనకధారను వర్షించిన కారుణ్యమూర్తి.

Published : 05 Oct 2022 00:46 IST

సృష్టిని నడిపించే అనంత శక్తి స్వరూపం జగన్మాత. ఆ ఆదిపరాశక్తి నిరంతరం సహస్ర రూపాల్లో ఈ లోకాన్ని సంరక్షిస్తున్నట్లు స్త్రీ కూడా అనేక రూపాల్లో తన వారిని, ఇంటిని కాపాడుకుంటోంది. రాక్షసులపై మాత సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి పర్వదినం. చెడుపై మంచి గెలుస్తుందనడానికి సంకేతం కూడా. జగన్మాత ఆదిశంకరుని వినతిని మన్నించి కనకధారను వర్షించిన కారుణ్యమూర్తి. రామలింగని జ్ఞాన తృష్ణను గమనించి విద్యనొసంగిన విజ్ఞానమూర్తి. ఇంద్రాదుల ఇక్కట్లను రూపుమాపేందుకు రాక్షసుల్ని సంహరించిన రౌద్రమూర్తి. రతీదేవి కన్నీటికి కరిగి మన్మథుని బతికించిన మమతామూర్తి. కామేశ్వరుని వైపు ప్రేమదృక్కుల్ని ప్రసరించి విఘ్నేశ్వరుని సృష్టించిన ప్రణయమూర్తి. ఆదిభిక్షువుకు అన్నమొసగిన అన్నపూర్ణ. సర్వసృష్టిని తనలో ఇముడ్చుకుని సృష్టి స్థితి లయాది సామర్థ్యాల్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రసాదించిన ఆదిపరాశక్తి. స్త్రీ రూప ధారిణియైన జగన్మాత రూపాలను శరన్నవరాత్రుల శుభ ఘడియల్లో స్వర్ణ కవచాలంకృతగా, బాలాత్రిపుర సుందరిగా, గాయత్రిగా, అన్నపూర్ణగా, లలితా పరమేశ్వరిగా, లక్ష్మీదేవిగా, సరస్వతిగా, దుర్గగా, మహిషాసుర మర్దినిగా, రాజరాజేశ్వరిగా ఆరాధించుకుంటాం.

అసలు స్త్రీ అన్న పదమే సమస్త సృష్టికీ మూలం. అందులోని సకార రకార తకారాలు సత్వ రజస్తమో గుణాలకు నిలయం. ఇవి సృష్టి స్థితి లయలకు ప్రతీకలు. అందు లోని ఇకారం శక్తి స్వరూపం. ఇకార రూపమైన శక్తి లోపిస్తే శివం కూడా శవప్రాయమవుతుంది. ఇదే విషయాన్ని జగద్గురు ఆదిశంకరాచార్యులు సౌందర్యలహరి మొదటి శ్లోకంలోనే ‘శివశక్త్యాయుక్తౌ యది భవతి శక్తః ప్రభవితుం’ అంటూ అయ్యవారి సామర్థ్యానికి కారణం అమ్మ అనుగ్రహమేనన్నారు.

అమ్మవారి శక్తి సామర్థ్యాల్ని తెలియజేస్తూ లలితా సహస్ర నామ స్తోత్రంలో వ్యాసుడు ‘కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః’ అంటారు. అమ్మవారు వేలిగోటితో అలా విలాసంగా మీటితే నారాయణుడు పది అవతారాలు ఎత్తాడట! అలానే ‘హర నేత్రాగ్ని సందగ్ధా కామసంజీవ నౌషధిః’ లయకారుడైన పరమేశ్వరుని నేత్రాగ్నిలో భస్మమైన మన్మథుణ్ణి తన శక్తితో జీవింప చేయగలిగిన సామర్థ్యం అమ్మది అని మహర్షి భావన. శంకర భగవత్పాదుల వారు తమ కనకధారా స్తవంలో ‘అమ్మా! ధనికుల గుమ్మం దగ్గర పడిగాపులు కాయమని నా నుదుటిమీద బ్రహ్మ తన చేతితో రాసిన గీతల్ని నీ కాలితో తుడిచేయమ్మా’ అనడంలో అమ్మ ఔన్నత్యం ప్రస్ఫుటమౌతోంది. ‘కర్తుం అకర్తుం అన్యథా కర్తుం’ అన్నట్లుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టి స్థితి లయల్లో మార్పుచేర్పులు చేయగల సర్వ సామర్థ్య అమ్మ.

జిల్లెళ్లమూడి అమ్మ చెప్పినట్లు జగన్మాత అంటే జగత్తుకు మాత కాదు, జగత్తనే మాత. ఆ జగత్తులో మన కళ్ల ముందు నడయాడే ప్రతి స్త్రీ జగన్మాత అంశే. ప్రాచీనకాలంలో ఇంటికి దీపమైన స్త్రీమూర్తి ఆధునిక కాలంలో మరింత విస్తృతయై ఇంటా బయటా లక్ష్మిలా, సరస్వతిలా, గిరిజలా, శక్తిరూపిణిగా తన పాత్రను సమర్థంగా పోషిస్తూ వెలుగులు విరజిమ్ముతోంది.

‘ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుంది’ అన్న మహాకవి గురజాడ మాటను అక్షర సత్యంగా మార్చి, జగన్మాతే ఇల్లాలుగా మారినట్టు అమ్మగా, అక్కగా, చెల్లిగా, భార్యగా, గురువుగా, అధికారిణిగా విభిన్న బాధ్యతలను పోషిస్తోంది. అమ్మానాన్నలూ, అత్తమామలను ఆదరిస్తూ, ఇంటాబయటా వ్యవహారాల్ని సమర్థంగా చక్కదిద్దుతోంది. కుటుంబీకుల ఆలనా పాలనలో అన్నపూర్ణగా, అన్యోన్య దాంపత్యంలో ప్రణయమూర్తిగా, బిడ్డల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దటంలో చదువుల తల్లిగా, సంసారాన్ని సజావుగా నడపటంలో కార్యనిర్వాహకురాలిగా విభిన్న రూపాల్లో పరాశక్తికి ప్రతిరూపంగా కళ్ల ముందు తిరుగుతోంది. అటువంటి స్త్రీ మూర్తిని అమ్మవారి దశావతారంగా భావించి ప్రణమిల్లుదాం!
 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్