రెండు కుటుంబాలు.. బోలెడన్ని సంతోషాలు

కొత్త సంవత్సరం వచ్చేసింది. అప్పుడే ఏడాది గడిచిందా అనిపిస్తోందా! అంతే మరి.. కాలప్రవాహంలో కొట్టుకు పోతున్నాం. నిత్యం ఉండే పరుగుల సంగతెలా ఉన్నా ఈరోజు మాత్రం వేగానికి బ్రేకేయండి! ఆత్మీయులతో సరదాగా గడపండి. ఇదొక తీపి జ్ఞాపకంగా మిగులుతుంది. ఈ ఉత్సాహం సంవత్సరం మొత్తాన్నీ రీఛార్జ్‌ చేస్తుంది.

Published : 01 Jan 2023 00:52 IST

కొత్త సంవత్సరం వచ్చేసింది. అప్పుడే ఏడాది గడిచిందా అనిపిస్తోందా! అంతే మరి.. కాలప్రవాహంలో కొట్టుకు పోతున్నాం. నిత్యం ఉండే పరుగుల సంగతెలా ఉన్నా ఈరోజు మాత్రం వేగానికి బ్రేకేయండి! ఆత్మీయులతో సరదాగా గడపండి. ఇదొక తీపి జ్ఞాపకంగా మిగులుతుంది. ఈ ఉత్సాహం సంవత్సరం మొత్తాన్నీ రీఛార్జ్‌ చేస్తుంది.

ఏం చేయాలంటే...

మీకు చాలా ఇష్టమైన ఒకటి రెండు కుటుంబాలను ఎంచుకుని భోజనానికి ఆహ్వానించండి. అందరికీ వంట మీరే చేయాలంటే కొంచెం కష్టమే కనుక కుటుంబసభ్యుల సాయం తప్పకుండా తీసుకోండి. అవతలి వారు తాము కూడా ఒకటి రెండు డిషెస్‌ తెస్తామంటే ‘నేను కదా పిలిచాను, మీరు తేవడమేంటి?’ అంటూ వాదించకండి. అందరూ ఒకచోట చేరి కబుర్లు కలబోసుకోవడం ముఖ్యం తప్ప ఒక్కరే కష్టపడాలని కాదుగా! ఒకవేళ వాళ్లకి తెచ్చే ఆలోచన లేకపోతే మాత్రం మీరు అడగొద్దు. మీకు బాగా చేతనై సులువనిపించే వంటకాలు చేస్తే సరిపోతుంది. అది కూడా అలసట అనిపిస్తే అన్నం వరకూ వండి కూరలూ గట్రా ఆర్డర్‌ పెడితే తేలికవుతుంది. అందరి అభిరుచులనూ దృష్టిలో పెట్టుకుని కడాయ్‌ పనీర్‌, దాల్‌ మఖని, దాల్‌ తడ్కా, ఆలూ కుర్మా, పంజాబీ చోళే, గోంగూర పచ్చడి, కాలీఫ్లవర్‌ పికిల్‌, గారెలు, దహీ వడ, పులిహోర, పాలక్‌ పూరీ, రసమలై, క్యారట్‌ హల్వా- లాంటివి ఎంచుకుంటే ఎవరికీ అసంతృప్తి ఉండదు. రుచికరమైన పదార్థాలు వేడి వేడిగా తింటూ ఎంచక్కా ముచ్చటించుకోవచ్చు.

డ్రెస్‌ కోడ్‌

ఇష్టమైన వ్యక్తులంతా ఒకే ప్యాటర్న్‌ లేదా రంగు దుస్తుల్లో ఉంటే భలే ఉంటుంది కదూ! భోజనానికి పిలిచేటప్పుడే డ్రెస్‌ కోడ్‌ గురించి చెప్పండి. నీలం, పసుపు, గులాబి.. ఇలా రెండు మూడు రంగుల ఆప్షన్‌ ఇవ్వండి. ఇంటిల్లిపాదీ అదే రంగులో రావాలి కనుక ఎవరికీ ఆ రకమైనవి సిద్ధంగా లేవంటే యాతన పెట్టినట్టవుతుంది. ఒకరిద్దరికి లేకుంటే ఈ పేరుతో కొనుక్కోవడం కూడా సరదాగానే ఉంటుంది. ఇది తప్పకుండా మురిపించే అనుభవం అవుతుంది.

అల్లరి చేయండి

పెద్దా చిన్నా అనే తేడా లేకుండా అంతా కలిసి అందమైన అల్లరి చేయండి. వచ్చిన ఆటలన్నీ ఆడండి. తెలిసిన పాటలేవో పాడండి. వచ్చినా రాకపోయినా డ్యాన్స్‌ చేయండి. జోక్స్‌ చెప్పండి. ఇవన్నీ ఎంత థ్రిల్లింగా ఉంటాయో! ఈ సంతోషం ఈ ఒక్కరోజుకే పరిమితం కాదు.. నెమరేసు కున్నప్పుడల్లా మధురంగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్