టోటం పోల్‌... ఇల్లు జిగేల్‌..!

ఏంటి రకరకాల బొమ్మలన్నింటినీ ఇలా నిలువుగా అమర్చారు? అయినా అవి పడకుండా ఎలా ఉన్నాయి? అనుకుంటున్నారు కదూ! వీటిని ‘టోటం పోల్స్‌’ అంటారు. గృహాలంకరణ అంటే అందరికీ ఆసక్తే.

Published : 19 Feb 2024 01:56 IST

ఏంటి రకరకాల బొమ్మలన్నింటినీ ఇలా నిలువుగా అమర్చారు? అయినా అవి పడకుండా ఎలా ఉన్నాయి? అనుకుంటున్నారు కదూ! వీటిని ‘టోటం పోల్స్‌’ అంటారు. గృహాలంకరణ అంటే అందరికీ ఆసక్తే. దానికి కాస్త సృజనాత్మకత జోడిస్తే వచ్చే కళే వేరు. అందుకే ప్రతిదీ అందంగా, ఆకర్షణీయంగా ఉండాలనుకుంటుంది ఈ తరం. అలాంటివారిని మెప్పిస్తుంది టోటం పోల్‌. పాశ్చాత్య దేశాల్లో ఒకప్పుడు వాళ్ల సంస్కృతికి చిహ్నంగా వాడే ఈ స్థంభాలు, ప్రస్తుతం నూతన సొబగులద్దుకుని గృహాలంకరణలో భాగమయ్యాయి. రకరకాల పక్షులు, జంతువులు, మొక్కలు, కుండల ఆకృతుల్లో మలిచిన ఇవి గార్డెన్‌, వాల్‌ డెకార్‌లుగా చక్కగా ఒదిగిపోతున్నాయి. ఓ పెద్ద స్థంభానికి నిలువుగా ఒకదానిపై మరొకటి ఒద్దిగ్గా అమర్చిన ఈ రూపాలు రకరకాల రంగుల్లో చూడటానికీ ముచ్చటగా ఉంటాయి. సెరామిక్‌, చెక్క, కలర్డ్‌ గ్లేజస్‌ మెటీరియళ్లతో వీటిని తయారు చేస్తారు. మనకు కావాల్సినట్లుగా మార్చుకోగలిగే ‘ఇంటర్‌ ఛేంజబుల్‌ టోటమ్‌’లు కూడా ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్నాయి. ఇంకేం ఇంట్లో ఏ గదికి నప్పుతుందో ఆలోచించేయండి. అందానికి అందం...కనులకు విందు!

ప్రత్యేకత తెలుసా..!

టోటం.. ఓడోడెమ్‌ అనే అల్గోంక్వియన్‌ పదం నుంచి వచ్చింది. ‘బంధుత్వ సమూహం’ అని అర్థం. పశ్చిమ కెనడా, వాయువ్య యునైటెడ్‌ స్టేట్స్‌లో కనిపించే స్మారక శిల్పాలే ఈ టోటంపోల్స్‌. సాధారణంగా వీటిని ఎరుపు లేదా పసుపు దేవదారు చెట్టు మొద్దుతో తయారుచేస్తారు. అలాగైతే ఏళ్ల తరబడి పాడవకుండా ఉంటాయని వీటిని ఎంచుకునేవారు. ఈ పోల్స్‌ అక్కడి వారి చరిత్ర, సంస్కృతిని తెలియజేస్తాయి. కుటుంబంలోని పూర్వీకులూ, సంఘంలోని ప్రముఖ వ్యక్తుల వివరాలను బొమ్మల రూపంలో పొందుపరచడం అక్కడి సంప్రదాయమట. అయితే వీటిలో ఒక్కోదానికీ ఒక్కో అర్థం ఉంటుంది. ఇంటి ముందు ఉంచే వాటిని ఫ్యామిలీ పోల్స్‌ అంటారు. వీటిని ఊళ్లో ముఖ్య నాయకుల ఇళ్ల ముందు ఏర్పాటు చేస్తారు. గృహద్వారాలుగా వినియోగిస్తే హౌస్‌పోస్టు స్థంభాలు అంటారు. పూర్వీకుల స్మారక స్థూపాలుగా ఉపయోగించేవి మెమోరియల్‌ పోల్స్‌ అయితే, అతిథులను స్వాగతించడానికి ఏర్పాటు చేసే వాటిని స్వాగత స్థంభాలంటారు. చనిపోయిన వారి కోసం పెట్టేవి మార్చురీ పోల్స్‌. దీని పైభాగంలో వారి దేహాన్ని ఉంచిన పెట్టెను ఉంచుతారట. ఎవరైనా అప్పు చేసి చెల్లించకున్నా, మరేదైనా తప్పు చేసినా వారి చిత్రాన్ని పోల్‌రూపంలో ఉంచుతారట. వాటిని షేమ్‌ పోల్స్‌గా పిలుస్తారు. మరి అలాంటి వారి పరిస్థితి ఏంటా అనుకుంటున్నారా... అప్పు చెల్లించాక తిరిగి వాటిని తీసేస్తారటలెండీ. ఏదేమైనా ప్రతి సందర్భానికీ వాడే ఈ స్థంభాల ఆలోచన బాగుంది కదూ..!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్