సోమవ్వ అంటే ఒక బ్రాండ్‌!

బంజారా సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే ఎంబ్రాయిడరీ కళను దేశవ్యాప్తం చేస్తున్న సోమవ్వ ఇప్పుడొక బ్రాండ్‌. ఆమె ఎంబ్రాయిడరీ చేసే దుస్తులకు రెండు మూడు నెలల ముందే ఆర్డరివ్వాల్సిన స్థాయికి ఎదిగింది. ఒక సాధారణ గిరిజన మహిళకు ఇదెలా సాధ్యమైందో చూడండి...

Updated : 27 Mar 2022 06:20 IST

బంజారా సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే ఎంబ్రాయిడరీ కళను దేశవ్యాప్తం చేస్తున్న సోమవ్వ ఇప్పుడొక బ్రాండ్‌. ఆమె ఎంబ్రాయిడరీ చేసే దుస్తులకు రెండు మూడు నెలల ముందే ఆర్డరివ్వాల్సిన స్థాయికి ఎదిగింది. ఒక సాధారణ గిరిజన మహిళకు ఇదెలా సాధ్యమైందో చూడండి...

చిన్నప్పటి నుంచి అమ్మమ్మ, నానమ్మ, అమ్మ నుంచి తానూఎంబ్రాయిడరీ, చేతితోనే దుస్తులను తయారు చేయడం నేర్చుకుంది. కర్ణాటకలోని గడగ్‌జిల్లా కుందరవల్లి తండాలో పుట్టింది సోమవ్వ. మంగళప్పతో పెళ్లయ్యాక అత్తింట అడుగుపెట్టింది. భర్త ఆదాయం సరిపోక తానూ ఏదైనా చేయాలనుకుంది. అలా తనకు తెలిసిన ఈ కళతో ఇంట్లో వాళ్లకి, తనకు దుస్తులు రూపొందించి, వాటిపై ఎంబ్రాయిడరీ వేసేది సోమవ్వ. పట్టొచ్చింది అనుకున్నాక తెలిసిన వాళ్లకు, చుట్టుపక్కల గ్రామాల్లోనూ విక్రయించేది. రెండు మూడేళ్లు బాగానే ఆదాయం వచ్చేది. తర్వాత కొనేవాళ్లు తగ్గిపోయారు. మరో దారి లేక చెరకు గడలు అమ్మడం మొదలు పెట్టింది. రెండు దశాబ్దాలు గడిచి పోయాయి.

ఆసక్తి కనిపెట్టి...

తరతరాల కళకి దూరం అయ్యానని వేదనపడేది సోమవ్వ. కానీ బంజారా ఎంబ్రాయిడరీపై ఇటీవల ఆసక్తి పెరగడం గమనించింది. దాంతో మళ్లీ ఉత్సాహంగా దుస్తుల తయారీని మొదలు పెట్టింది. వాటిని భర్త సహా ఇతర కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో విక్రయించే వారు. ఫలానా డిజైన్‌ కావాలని అడిగితే  తక్కువ సమయంలో రూపొందించడం సోమవ్వకు కష్టమయ్యేది. దాంతో తండాలోని కొందరు మహిళలకు శిక్షణనిచ్చి వారితో చేయించడం మొదలు పెట్టింది. సమీప దుకాణాల్లోనూ సోమవ్వ డిజైన్లకు గిరాకీ పెరిగింది. దీంతో మరింత ఉత్సాహం వచ్చింది. కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టింది. ‘రంగు రంగు రాళ్లు, అద్దాలు వంటివి దుస్తులకు అమర్చే దాన్ని. నా డిజైన్లను ఇప్పుడు చాలామంది ఇష్టపడుతున్నారు. 10 రకాల దుస్తుల తయారీకి రెండు నెలలకుపైగా సమయం పడుతుంది. వీటిని ఎవరూ కొనకపోతే నాకష్టం వృథా అయినట్లే. అందుకే దేనికది ప్రత్యేకంగా డిజైన్‌ చేస్తా. మార్కెటింగ్‌లో మా ఆయన, అబ్బాయి మహంతేష్‌ చేయూతని ఇస్తున్నారు. తెలంగాణ సహా కర్ణాటక, మహారాష్ట్ర, గోవా వెళ్లి ఈ దుస్తులను ప్రదర్శించాం. చాలా బంజారా ఫెస్టివల్స్‌లో పాల్గొన్నా. అలా ఈ కళకు తిరిగి మంచి స్పందన వచ్చేలా చేయగలిగా. క్రమంగా చాలా ప్రాంతాల నుంచి ఆర్డర్లు పెరిగాయి. దేశ వ్యాప్తంగా ఈ దుస్తులకు మంచి పేరొచ్చింది. ఇప్పుడు రెండు నెలలు ముందే ఆర్డరిస్తే కానీ నేను చేసివ్వలేని పరిస్థితి. ప్రస్తుతం బంజారా లేదా లంబాడీ డ్రస్‌, బ్లవుజులు, స్కర్టులు మాత్రమే చేస్తున్నా. వీటిపై వినియోగదారుల ఆసక్తి మేరకు పూసలు, నాణేలు, ముత్యాలు, బొత్తాలు, అద్దాలు వంటివి అద్దుతున్నా’ అని చెప్పే సోమవ్వ రూపొందించే డిజైన్స్‌ రూ.7వేల నుంచి రూ.25 వేలకు పైగా ధర పలుకుతున్నాయి. ‘ఈ కళ మాతోనే అంతరించకూడదని ఆసక్తి ఉన్న వారికి శిక్షణ ఇస్తున్నా. మా కళను కాపాడుకున్నందుకు, మరికొందరు మహిళలకు ఉపాధినీ ఇవ్వగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అంటోంది సోమవ్వ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్