అమ్మ చెప్పిన పాఠం!

కొన్ని కథలు కాలాన్ని తట్టుకుని ఎప్పటికీ స్ఫూర్తిని రగిలిస్తూనే ఉంటాయి. మనదేశపు మొదటి తరం మహిళా ఇంజినీర్లలో ఒకరైన దమయంతీ హింగూరాణి గుప్తా విజయగాథ కూడా అటువంటిదే. ఫోర్డ్‌ సంస్థల్లో తొలి మహిళా ఇంజినీర్‌గా

Published : 20 Apr 2022 01:40 IST

కొన్ని కథలు కాలాన్ని తట్టుకుని ఎప్పటికీ స్ఫూర్తిని రగిలిస్తూనే ఉంటాయి. మనదేశపు మొదటి తరం మహిళా ఇంజినీర్లలో ఒకరైన దమయంతీ హింగూరాణి గుప్తా విజయగాథ కూడా అటువంటిదే. ఫోర్డ్‌ సంస్థల్లో తొలి మహిళా ఇంజినీర్‌గా రాణించిన ఆమె తన ప్రస్థానాన్ని ఇలా చెప్పుకొచ్చారు...

ప్పుడు నాకు ఐదేళ్లు ఉంటాయి. భారత్‌... పాక్‌ విభజన సమయం. ఇల్లూ, వాకిళ్లనే కాదు.. అయినవాళ్లని కూడా వదులుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మా కుటుంబమంతా కరాచీకి చేరుకున్నాం. అక్కడి నుంచి ముంబయికి. అంతవరకూ సంపన్నులుగా ఉన్న మేం...వలస కుటుంబంగా, అతి కష్టమ్మీద రోజులు గడుపుతూ వచ్చాం. మా అమ్మ గోపీబాయి చదువుకుంది నాలుగో తరగతే అయినా ఆమె చెప్పిన జీవితపాఠాలు ఏ ప్రొఫెసర్లూ చెప్పలేరు. అంతగా జీవితాన్ని కాచివడపోసింది. ‘ఆస్తులు ఈ రోజు ఉంటాయి.. రేపు పోతాయి. కానీ చదువు అలా కాదు. అందులోనూ ఒక ఆడపిల్ల చదువు ఆ కుటుంబంలో వెలుగులు నింపుతుంది’ అని తరచూ అనేది. నాకు పదమూడేళ్లప్పుడు మేమున్న చిన్న ఊరికి ప్రధాని వస్తున్నారని తెలిసి అందరికంటే ముందెళ్లి వేదికకి దగ్గరగా కూర్చున్నా. ‘ఇంతవరకూ మనల్ని పాలించిన తెల్లవాళ్లు ఇక్కడి నుంచి దోచుకుపోయారే కానీ... ఒక్క ఫ్యాక్టరీ కూడా ఇక్కడ కట్టలేదు. మనకి పరిశ్రమలు రావాలి. ఇంజినీర్లు కావాలి. ఈ మాట అబ్బాయిలకోసం అనుకుంటున్నారేమో. కాదు అమ్మాయిల కోసం’ అన్నారాయన. అప్పుడే నేను మొదటిసారి ఇంజినీర్‌ అనే పదం వినడం. కానీ ఆ మాటలు నా మనసులో బలంగా నాటుకుపోయాయి. రోజులు ఎంత కష్టంగా గడుస్తున్నా అమ్మ నన్ను పట్టుదలగా ఇంజినీరింగ్‌ చదివించింది. ఆ కాలేజీలో నేనొక్కదాన్నే అమ్మాయిని. దాంతో విడిగా వాష్‌రూమ్‌ కూడా ఉండేది కాదు. అవసరానికి అరమైలు దూరం వెళ్లేదాన్ని. పంతొమ్మిదేళ్లప్పుడు హెన్రీఫోర్డ్‌ జీవితచరిత్రను చదివాను. ఆ పుస్తకం నన్నెంతలా మార్చిందంటే చేస్తే ఫోర్డ్‌ సంస్థలోనే ఉద్యోగం చేయాలన్నంతగా.

నువ్వైతే పెన్నీ.. నేనైతే డాలర్‌..

అమెరికాలోని మోటార్‌సిటీగా పేరొందిన డెట్రాయిట్‌లో ఫోర్డ్‌కంపెనీలోకి అడుగుపెట్టినప్పుడు అందరిలా నా దగ్గర చలికోటు, కారు ఏమీలేవు. ఒక సారి ఆ కంపెనీవాళ్లు మొదటిదశలోనే తిరస్కరించారు. రెండోసారి వెళ్లినప్పుడు హెచ్‌ఆర్‌... వాళ్లు ‘మీరు ఇంజినీర్‌ పోస్టు కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. ఇక్కడసలు ఆ విభాగంలో మహిళలే లేరు’ అన్నారు. ‘నిజమే మీరు ఉద్యోగం ఇవ్వకపోతే ఎలా ఉంటారు?’అన్నది నా సమాధానం.

నా సమాధానం మా బాస్‌కి నచ్చింది. అలా ఫోర్డ్‌ కంపెనీలో మొదటి మహిళా ఇంజినీర్‌గా అడుగుపెట్టాను. అంతమంది మగవాళ్ల మధ్య పనిచేయడం ఎంత ప్రత్యేకంగా ఉంటుందో అంతే ఛాలెంజింగ్‌గానూ ఉండేది. నా రిపోర్టులని పూర్తిగా చూడకుండానే ‘ఈ అంకెలన్నీ తప్పే’ అన్నాడు ఒకాయన. ‘సరే చూద్దాం.. నువ్వు తప్పులు చూపిస్తే ఒక్కోదానికి నేను డాలర్‌ చొప్పున ఇస్తా. అవి తప్పుకాదని తెలిస్తే నాకు పెన్నీలివ్వు’ చాలన్నా... ఆ పందెంలో అతనే నాకు డబ్బులు ఇచ్చాడు. నేనొక్క డాలర్‌ కూడా ఇవ్వలేదు. స్త్రీలు కాబట్టి వాళ్లు కచ్చితంగా తప్పేచేస్తారని అతని నమ్మకం. ఆ నమ్మకాన్ని నేను నిజం చేయదలచుకోలేదు. అదే కంపెనీలో పనిచేస్తున్న సుభాష్‌తో నాకు వివాహం అయ్యింది. ఇద్దరు పిల్లలు. సంజయ్‌, సునీల్‌. సంజయ్‌ న్యూరోసర్జన్‌. సునీల్‌ వ్యాపారవేత్త. వాళ్లు పుట్టిన తర్వాత కూడా పదోన్నతులు సాధించి ఆ సంస్థలో కీలకంగా మారాను. ఇప్పుడు నాకు ఐదుగురు మనవరాళ్లు. వాళ్లకి నేనెప్పుడూ ఇలా చేయండి... అలా చేయండి అంటూ చెప్పను. వాళ్లకు నచ్చిన పనిచేసే స్వేచ్ఛని ఇచ్చాను. మా అమ్మ నాకిచ్చినట్టుగా!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్