ఆమె కుంచె పడితే.. నేరగాళ్లకు మూడినట్టే!

భవిష్యత్‌పై బోలెడు ఆశలతో ఉన్న అమ్మాయి. అనుకోకుండా అత్యాచారానికి గురైంది. తీవ్రమైన అవమాన భావన, ‘న్యాయం జరగకపోగా తననే తప్పంటే?’ అన్న భయం.. ఆ 20 ఏళ్ల అమ్మాయిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. చనిపోవాలనుకునేది. అలా చేస్తే న్యాయం జరగదు. మరెలా? అప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయం వేలమందికి న్యాయం జరిగేలా చేసింది. ఎందరినో కటకటాల వెనక్కి వెళ్లేలా చేసింది.

Published : 09 Jun 2022 18:35 IST

భవిష్యత్‌పై బోలెడు ఆశలతో ఉన్న అమ్మాయి. అనుకోకుండా అత్యాచారానికి గురైంది. తీవ్రమైన అవమాన భావన, ‘న్యాయం జరగకపోగా తననే తప్పంటే?’ అన్న భయం.. ఆ 20 ఏళ్ల అమ్మాయిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. చనిపోవాలనుకునేది. అలా చేస్తే న్యాయం జరగదు. మరెలా? అప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయం వేలమందికి న్యాయం జరిగేలా చేసింది. ఎందరినో కటకటాల వెనక్కి వెళ్లేలా చేసింది.

లోయిస్‌ గిబ్సన్‌కి సినిమాల్లో రాణించాలన్న కోరిక. చదువవ్వగానే మోడలింగ్‌, సినిమాల్లో, ఎన్నో పత్రికల కవర్ల మీదా మెరిసింది. ఓరోజు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారం చేశాడు. చనిపోయిందనుకొని వెళ్లిపోయాడు. పోలీసుల వద్దకు వెళ్లాలంటే భయం. జరిగిన దాని పట్ల అవమానం. చుట్టూ ఉన్నవారిని చూస్తే భయం.. చనిపోవాలా? అన్నీ మర్చిపోయి సాగాలా? ఇలా ఎన్నో ప్రశ్నలు వెంటాడేవి. ఈమెది అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌. ఆ దుర్ఘటనతో ఎంతో ఇష్టమైన నటన, నృత్యాన్ని వదిలి టెక్సాస్‌ వెళ్లిపోయింది. లోయిస్‌కి ఆర్ట్స్‌ కూడా పరిచయమే. దీంతో మనుషుల చిత్రాలు గీయడంలో మెలకువలు నేర్చుకుంది. టూరిస్ట్‌లకు డబ్బులు తీసుకొని గీసివ్వడం మొదలుపెట్టింది. ఓసారి ‘విద్యార్థుల ముందే టీచర్‌పై అత్యాచారం’ అన్న వార్తను చూసింది. తనకు జరిగింది గుర్తు వచ్చింది. నేరస్థులు ధైర్యంగా బయట తిరగడం తనకు నచ్చలేదు. వెంటనే బాధితురాలి దగ్గరకు వెళ్లింది. తను చెప్పిన వివరాలతో బొమ్మ గీసి చూపింది. దాని ఆధారంగా పోలీసులు దోషిని అరెస్ట్‌ చేశారు. ఇలా నేరస్థులందరినీ పట్టించాలనుకుంది. నేరుగా పోలీసుల్ని సంప్రదిస్తే తాత్కాలిక ఉద్యోగిగా తీసుకొన్నా తన ప్రతిభ చూసి ‘ఫోరెన్సిక్‌ ఆర్టిస్ట్‌’గా పర్మనెంట్‌ చేశారు.

‘చావు అంచుల వరకూ వెళ్లా. అత్యాచారం, హత్య లాంటివి విన్నప్పుడల్లా ఇప్పటికీ నాకు జరిగిందే గుర్తొస్తుంది. నాకు అన్యాయం చేసిన వాడిని జైలుపాలు చేసినా.. ఆ అనుభవం నా మనసులో నాటుకుపోయింది. అందుకే అవతలి వ్యక్తి రూపు రేఖలు చెబుతోంటే నా చేయి పని చేసుకుంటూ వెళుతుంది.’ అంటుంది లోయిస్‌. ఓ సారి నాలుగేళ్ల చిన్నారి శవం జాలర్లకు దొరికింది. ముఖం గుర్తుపట్ట లేకుండా ఉంది. పుర్రె తీరు ఆధారంగా లోయిస్‌ బొమ్మగీసింది. దాన్ని పేపర్‌లో ప్రచురిస్తే వాళ్ల బామ్మ గుర్తు పట్టింది. దర్యాప్తులో సవతి తండ్రే హంతకుడని తేలింది. ఒక బాబు తన తల్లి హత్యను చూశాడు. నేరస్తుడు దొరకలేదు. ఇరవైయ్యేళ్లు గడిచాయి... ఆ పిల్లాడు పెద్దయ్యాక ఓ 60 ఏళ్ల వ్యక్తిని చూసి హంతకుడు ఇతనేనన్నాడు. అతనేమో ఒప్పుకోలేదు. లోయిస్‌ అతను హత్య చేసిన సమయంలో ఎలా ఉండే వాడో గీసింది. దీంతో నేరగాడికి కటకటాలు తప్పలేదు. దాదాపు నాలుగు దశాబ్దాలు సేవలందించిన ఈమె.. ఇటీవలే 72 ఏళ్ల వయసులో విరమణ తీసుకుంది. 5 వేలకుపైగా చిత్రాలు గీసి, 1300కుపైగా మంది నేరగాళ్లకి శిక్ష పడటంలో సాయం చేసింది. ఇది గిన్నిస్‌ రికార్డు కూడా. విరమణ పొందినా అవసరమైతే తన సేవలందించడానికి ముందే ఉంటానంటోంది. అంతేకాదు.. ఆసక్తి ఉన్నవారికి ఫోరెన్సిక్‌ ఆర్ట్‌లో శిక్షణ కూడా ఇస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్