లక్షన్నరమంది తల్లులు తోడుగా...

షాపింగ్‌మాల్‌, సినిమాహాల్‌, ఆఫీసు, బస్సు, రైలు ఎక్కడైనా కానివ్వండి! బిడ్డ ఆకలేసి ఏడిస్తే... తల్లి మనసు ఊరకనే ఉండగలదా? ఏడ్చే బిడ్డను సముదాయిస్తూనే పాలివ్వడానికి తగిన ‘చాటు’ కోసం వెతుకుతుంది. మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా బహిరంగ ప్రాంతాల్లో బిడ్డకు పాలివ్వడానికి తల్లులు పడే వేదన అంతా ఇంతా కాదు.

Published : 04 Aug 2022 18:19 IST

షాపింగ్‌మాల్‌, సినిమాహాల్‌, ఆఫీసు, బస్సు, రైలు ఎక్కడైనా కానివ్వండి! బిడ్డ ఆకలేసి ఏడిస్తే... తల్లి మనసు ఊరకనే ఉండగలదా? ఏడ్చే బిడ్డను సముదాయిస్తూనే పాలివ్వడానికి తగిన ‘చాటు’ కోసం వెతుకుతుంది. మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా బహిరంగ ప్రాంతాల్లో బిడ్డకు పాలివ్వడానికి తల్లులు పడే వేదన అంతా ఇంతా కాదు. ఈ సమస్యకు పరిష్కారంగా లక్షన్నర మంది తల్లులతో ‘ఫ్రీడమ్‌ టు నర్స్‌’ పేరుతో ఉద్యమిస్తున్నారు ఆధునికా ప్రకాష్‌...

పాప మంచం చివరికి వెళ్లిపోయిందేమో! అక్కడ నుంచి పడిపోతే?’.. ఈ ఆలోచన రాగానే ఉలిక్కి పడిలేచేదాన్ని. తనకి అర్ధరాత్రి ఆకలేస్తుందేమో.. పాలు సరిపోయాయా? ఇవే ఆలోచనలు. మా పాప పుట్టిన తర్వాత.. హాయిగా నిద్రపోవడం అనే మాటే మరిచిపోయా. నిద్రలేని రాత్రులే ఎక్కువ. అమ్మ, అమ్మమ్మ ఎవరైనా దగ్గరుంటే ధైర్యం చెబుతారు. కానీ ఐర్లాండ్‌లో ఉన్న నాకు ఇవన్నీ ఎవరు చెబుతారు? కొత్తగా తల్లైన వారికి సాయంగా ఆన్‌లైన్‌లో ఒక గ్రూప్‌ ఉందని తెలిసి అందులో చేరాను. ఆశ్చర్యం.. నాలాంటి అనుమానాలున్న వాళ్లు అందులో చాలామందే ఉన్నారు. మా అనుమానాల్లో కొన్నే నిజం.. చాలామటుకు అపోహలే. ఈ విషయంలో నేను ఒంటరి కాదు.. నాలా చాలామంది ఉన్నారన్న భావన నాలో ధైర్యం పెంచింది. పాప పెద్దయ్యాక.. ఇండియాకు వచ్చాం. కానీ ఓ స్నేహితురాలు ఆన్‌లైన్‌లో పంచుకున్న విషయం మళ్లీ తల్లిపాలపై నా దృష్టిపడేట్టు చేసింది. తను ఓసారి కోల్‌కతాలో షాపింగ్‌ మాల్‌కి వెళ్లింది. అక్కడ పాపకు పాలిద్దామని చూస్తే ఎక్కడా వీలుగా లేదు. మాల్‌ నిర్వాహకుల్ని అడిగితే.. టాయ్‌లెట్‌ తప్ప మరో చోటు లేదన్నారు. అదే విషయాన్ని ఆ మాల్‌ ఫేస్‌బుక్‌ వాల్‌పై రాసిందామె. ‘ఇలాంటి విషయాలు ఇంటి దగ్గరే పూర్తిచేసుకోవాల’న్నది వాళ్ల సమాధానం. ఆ మాటలు విన్నాక ఇక ఊరుకోలేకపోయా. ఎందుకంటే పాలు తాగే హక్కు ప్రతి బిడ్డకూ ఉంది. అది బహిరంగ ప్రదేశంలో అయినా సరే! అందుకే ‘చి ఫ్రీడమ్‌ టు నర్స్‌’ పేరుతో ఆన్‌లైన్‌ ఉద్యమాన్ని ప్రారంభించా. దీనికోసం ‘బ్రెస్ట్‌ ఫీడింగ్‌ సపోర్ట్‌ ఫర్‌ ఇండియన్‌ మదర్స్‌’ పేరుతో పుణె నుంచి ఫేస్‌బుక్‌ గ్రూప్‌ని ప్రారంభించా. దీనిలో ఎంతో మంది తల్లులు పాలివ్వడంలో తమకెదురయిన చేదు అనుభవాలు పంచుకోవడం మొదలుపెట్టారు. బహిరంగ ప్రదేశాల్లో పాలివ్వాల్సి వచ్చినప్పుడు ‘ఆ మూలకు వెళ్లండి’, ‘వాష్‌రూమ్‌కి వెళ్లండి...’ ‘ఎవరినైనా అడ్డం ఉండమనండి’ వంటి సమాధానాలే ఎక్కువగా వినిపించేవి. 2013లో ప్రారంభించిన మా పేజీలో లక్షన్నరమంది తల్లులు సభ్యులుగా ఉన్నారంటే ఇదెంత పెద్ద సమస్యో మీకే అర్థమవుతుంది. నలుగురిలో పాలివ్వలేక పిల్లలకి డబ్బాపాలు అలవాటు చేస్తుంటాం. అది బిడ్డల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. తల్లిపాలు ఎంత విలువైనవో తెలిస్తే బిడియపడం. కొవ్వులు, ఖనిజాలు, విటమిన్లు మొదలుకుని హార్మోన్లు, యాంటీ బ్యాక్టీరియా గుణాలుండే ఈ పాలు తాగితేనే పిల్లలకు క్యాన్సర్ల నుంచీ రక్షణ దొరుకుతుంది.

అపోహలు పోగొట్టేందుకే...

ఎంతో విలువైన తల్లిపాల విషయంలో ఇప్పటికీ మనకెన్నో అపోహలున్నాయి. వాటిని పోగొట్టేందుకే గ్రూపులో 45 మంది నిపుణులున్నారు. పీడియాట్రిస్టులూ, కౌన్సెలింగ్‌ నిపుణులు, సర్టిఫైడ్‌ లాక్టేటింగ్‌ ఎడ్యుకేటర్లు 24 గంటలూ అందుబాటులో ఉంటారు. తరచూ వెబినార్లని నిర్వహిస్తుంటాం. అర్ధరాత్రి, అపరాత్రని లేకుండా ఏ సమయంలో అయినా తల్లులు తమ ఇబ్బందులని ఈ ఫేస్‌బుక్‌ గ్రూపులో పంచుకోవచ్చు. కౌన్సెలర్లు, తోటి తల్లుల నుంచి సమాధానాలు లేదా సాయం తీసుకోవచ్చు. మా బృంద సభ్యురాలికి కవలలు పుట్టి అందులో ఒక పాప చనిపోయింది. దాంతో తన దగ్గర అదనంగా పాలు ఉండేవి. వాటిని తల్లిపాలు లేని పిల్లలకు ఇవ్వాలనుకుంది. మేం అందుకు సాయం చేశాం. అలా ఇప్పుడు ఎంతోమంది పిల్లలు అమృతం లాంటి తల్లిపాలని అందుకుంటున్నారు. నెలకి సుమారుగా నాలుగు వేల ప్రశ్నలు మా గ్రూపులో వస్తుంటాయి. వాటికి సమాధానాలు, సాయం రెండూ అందుతాయి. ఆసియాలోనే ఉత్తమ కమ్యూనిటీగా మా గ్రూపుని ఫేస్‌బుక్‌ గుర్తించింది. మా సేవల్ని విస్తరించేందుకు మిలియన్‌ డాలర్‌ నిధులని అందించింది. కేంద్ర మాతాశిశు సంక్షేమ శాఖ నుంచి వెబ్‌ వండర్‌ ఉమెన్‌ పురస్కారాన్నీ అందుకున్నా.

ప్రపంచమంతా ఇంతే...

నలుగురిలో పాలివ్వలేకపోవడం అనే సమస్య ఒక్క మన దేశంలోనే కాదు ప్రపంచమంతా ఉంది. ఎందుకంటే రొమ్ములని మనం చూసే దృష్టి కోణం మారింది. కానీ వాటి వాస్తవ ప్రయోజనం బిడ్డకు పాలివ్వడమే. పల్లెల్లో ఈ బాధ ఉండదు. పాపకి ఆకలి అంటే నిర్భయంగా పాలిస్తారు. పట్టణాలు, నగరాల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఉంది. పెద్ద కంపెనీలకు సీఈవోలుగా ఉన్న మహిళలు ఇలాంటి విషయాల్లో ముందుకు రావాలి. చాలామంది పాప ఏడుస్తుంది అనగానే పాల కోసమేమో అనేస్తారు. కానీ బుజ్జాయిలు ఏడవడానికి అనేక కారణాలుంటాయి. ఈ అపోహలని పోగొట్టేందుకు బ్రెస్ట్‌ పోషన్‌ పేరుతో ఒక పుస్తకమూ రాశాను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్