కొవిడ్‌ బాధితుల కోసం.. గర్భిణిగానూ పనిచేసి!

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ విస్తరిస్తున్న సమయంలో దాని వ్యాప్తి గురించి అందరికీ తెలిసేలా చేసిందీమె. గర్భిణిగానూ రాత్రింబవళ్లు కష్టపడింది. వెబ్‌ డాష్‌బోర్డ్‌ ద్వారా దేశవిదేశాల్లో కరోనా కేసులను ట్రాక్‌ చేసే సౌలభ్యాన్ని అందించింది.

Published : 04 Oct 2022 00:59 IST

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ విస్తరిస్తున్న సమయంలో దాని వ్యాప్తి గురించి అందరికీ తెలిసేలా చేసిందీమె. గర్భిణిగానూ రాత్రింబవళ్లు కష్టపడింది. వెబ్‌ డాష్‌బోర్డ్‌ ద్వారా దేశవిదేశాల్లో కరోనా కేసులను ట్రాక్‌ చేసే సౌలభ్యాన్ని అందించింది. అందుకే ప్రతిష్ఠాత్మక ‘లాస్కర్‌-బ్లూంబర్గ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ అవార్డు’కు ఎంపికై, రూ.2 కోట్ల బహుమతినీ అందుకోనున్న లారెన్‌ గార్డెనర్‌ స్ఫూర్తి కథ ఇది.

లారెన్‌ అమెరికాలోని జాన్స్‌ హాప్‌కిన్స్‌ వైటింగ్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో (మేరీల్యాండ్‌) ప్రొఫెసర్‌. జనవరి 2020.. కరోనా ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్నప్పుడు తన విద్యార్థుల్లో ఒకరు ఆందోళనపడటం గుర్తించిందీమె. చైనాలో తన కుటుంబ క్షేమ సమాచారం కోసం అతడు అదేపనిగా ప్రయత్నించడం చూసి పరిష్కారం కోసం ఆలోచించింది. అదే కొవిడ్‌-19 ట్రాకర్‌ రూపకల్పనకి కారణమైంది. టెక్సాస్‌కు చెందిన లారెన్‌ ‘మోడలింగ్‌ ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్‌’లో ప్రత్యేక కోర్సు చేసింది. పరిశోధకురాలు కూడా.

పక్కా సమాచారం అందిస్తూ..

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ బాధితుల గురించి తెలుసుకునేలా ఈ ప్రత్యేక ట్రాకర్‌ కనిపెట్టానంటుంది లారెన్‌. ‘ఈ వైరస్‌ బారిన పడుతున్నవారి సంఖ్యను సేకరించి, మా బృందం ఇందులో పొందుపరిచేది. దీన్ని గూగుల్‌ షీట్స్‌ ద్వారా డాష్‌బోర్డ్‌పై ఎవరైనా తెలుసుకునేలా చేశాం. కేసులు పెరిగి, ఈ డేటా పరిశీలనపై చాలామంది ఆధారపడుతుండటంతో.. ‘గిట్‌హబ్‌’ ఓపెన్‌ సోర్స్‌ ద్వారా వివరాలను ఎవరైనా, ఎక్కడి నుంచైనా తెలుసుకునేలా చేశా. పెరుగుతున్న కొవిడ్‌ మృతుల సంఖ్య ఆందోళన పరిచేది. వారి వివరాల కోసం బంధువులు, కుటుంబీకుల ఆతృత చూసినప్పుడు మనసు వేదనతో నిండేది. మొదట మాన్యువల్‌గా వివరాలను సేకరించి అప్‌లోడ్‌ చేసేవాళ్లం. అది కష్టమై, ప్రపంచ నలుమూలల నుంచి అధికారికంగా ఆరోగ్య శాఖల నుంచి వచ్చే డేటాను ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆటోమేటెడ్‌ స్క్రాపర్స్‌ ఏర్పాటు చేశాం. అలా అవసరానికి తగినట్లు దీన్ని అభివృద్ధి చేస్తూనే ఉన్నా. ఆ ఏడాది ప్రతి క్షణాన్నీ ప్రజలకు మేలు చేయాలని ఈ ప్రాజెక్టు కోసమే వినియోగించాం. డిసెంబరు 2020లో తల్లినైనా ప్రాజెక్టుని కొనసాగిస్తూనే వచ్చా’ అని చెబుతోందీమె. 


ప్రజాప్రయోజనం.. ఈ డాష్‌బోర్డ్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితులు, మృతుల సంఖ్యనే కాదు, వ్యాక్సిన్‌ వేయించుకున్న వారి సంఖ్య కూడా తెలుసుకోవచ్చు. ప్రజారోగ్యానికి సంబంధించి వైద్యరంగానికెంతో ఉపయోగపడిన ఈ ట్రాకర్‌ ఈ ఏడాది ఉత్తమ ప్రజా ప్రయోజన సంస్థగా నిలిచిందని ‘ద ఆల్బర్ట్‌ అండ్‌ మేరీ లాస్కర్‌ ఫౌండేషన్‌’ ప్రకటించింది. ఈ సంస్థ ఏటా అందించే ‘లాస్కర్‌-బ్లూంబర్గ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ అవార్డు’కు లారెన్‌ను ఎంపిక చేసింది. ఈ పురస్కారంతో రూ.2 కోట్ల నగదు బహుమతినీ అందించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్