బంగీ జంప్‌లో ప్రపంచరికార్డు..

ఆ వంతెన పైనుంచి కిందకు చూస్తేనే కళ్లు తిరుగుతాయి. అంతటి ఎత్తు నుంచి తలకిందులుగా కిందకు దూకే బంగీ జంప్‌ అంటే కుర్రకారుకే చెమటలు పడతాయి. అంతటి ధైర్య సాహసాలను అయిదుపదుల వయసులో ప్రదర్శించి చూపించారు లిండా పాట్గియేటర్‌. 59 నిమిషాల్లో 23సార్లు బంగీ జంప్‌ చేసి ప్రపంచరికార్డు సాధించారు.

Published : 11 Nov 2022 00:15 IST

ఆ వంతెన పైనుంచి కిందకు చూస్తేనే కళ్లు తిరుగుతాయి. అంతటి ఎత్తు నుంచి తలకిందులుగా కిందకు దూకే బంగీ జంప్‌ అంటే కుర్రకారుకే చెమటలు పడతాయి. అంతటి ధైర్య సాహసాలను అయిదుపదుల వయసులో ప్రదర్శించి చూపించారు లిండా పాట్గియేటర్‌. 59 నిమిషాల్లో 23సార్లు బంగీ జంప్‌ చేసి ప్రపంచరికార్డు సాధించారు.

ఇంగ్లండ్‌కు చెందిన లిండా దక్షిణాఫ్రికాలో అతి ఎత్తైన బ్లౌక్రన్‌ నదిపై నుంచి బంగీ జంప్‌ చేయాలనుకున్నారు. ఇది నేలకు సుమారు 710 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీనికి అవసరమైన శారీరక, మానసిక సామర్థ్యాలను పెంచుకోవడానికి 50 ఏళ్ల వయసులో ఆవిడ ఎంతో కఠిన శిక్షణ తీసుకున్నారు. ఈ వంతెన పైనుంచి 59 నిమిషాల్లో 23 జంప్స్‌ పూర్తి చేశారు. 19 ఏళ్లక్రితం ఇదే వంతెనపై నుంచి దక్షిణాఫ్రికాకి చెందిన వెరోనికా దీన్‌ గంటలో 19 బంగీ జంప్స్‌ చేసిన రికార్డును లిండా బద్దలు కొట్టారు. ఎలాంటి భయం, ఆందోళన లేకుండా వంతెన పైనుంచి దూకిన లిండా పక్షిలా చేతులు చాపి కిందకు దూసుకెళ్లారు. ‘ఇన్ని సార్లు దూకుతున్నప్పుడు మధ్యలో తీవ్ర అలసటకు లోనయ్యా. రెండుసార్లు వాంతులు కూడా అయ్యాయి. అయినా నాకేదో అవుతుందని భయపడలేదు. అసలా ఆలోచనే పక్కనపెట్టి మనసును దృఢ పరుచుకున్నా. నా 20వ ఏట నుంచే సాహసక్రీడలు ప్రారంభించా. ఇవే ఈ లక్ష్యాన్ని పూర్తిచేయడానికి దోహదపడ్డాయి. భయాన్ని ఒక్కసారి జయించగలిగామంటే చాలు. అనుకున్న దాన్ని చేరుకోగలం. నేను కూడా అలాగే పట్టుదలగా ఆగకుండా జంప్‌ చేశా. ఈ కీర్తి అంతా భగవంతుడిదే. ఆయన వల్లే నేను దీన్ని సాధించగలిగా. మావారు, పిల్లలు అందించిన ప్రోత్సాహం ఎనలేనిది. నిమిషం తేడాలో రికార్డును తిరగ రాయగలిగా’ అని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న లిండా నుంచి చాలా పాఠాలు నేర్చుకోవచ్చు కదా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్