కృత్రిమ మేథతో ఎదిగా!

సాంకేతిక రంగంలో ఇప్పుడు అమ్మాయిల హవా పెరుగుతోంది. కానీ ఆ ఆలోచనే కష్టమైన సమయంలో ఈ రంగంలోకి అడుగుపెట్టారు వీణా గుండవెల్లి. అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకోవడమే కాదు.. కృత్రిమ మేథ (ఏఐ) విభాగంలో ప్రపంచంలోనే టాప్‌ సీఈఓల్లో ఒకరయ్యారు.

Published : 28 Nov 2022 00:05 IST

సాంకేతిక రంగంలో ఇప్పుడు అమ్మాయిల హవా పెరుగుతోంది. కానీ ఆ ఆలోచనే కష్టమైన సమయంలో ఈ రంగంలోకి అడుగుపెట్టారు వీణా గుండవెల్లి. అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకోవడమే కాదు.. కృత్రిమ మేథ (ఏఐ) విభాగంలో ప్రపంచంలోనే టాప్‌ సీఈఓల్లో ఒకరయ్యారు. ఈ హైదరాబాదీని వసుంధర పలకరించగా.. ఆ ప్రయాణాన్ని పంచుకున్నారిలా..

అమ్మ శ్యామల, నాన్న శ్రీరాములు మెకానికల్‌ ఇంజినీర్‌. మెదక్‌లోని చిన్న ఊరి నుంచి హైదరాబాద్‌ వచ్చి హెచ్‌ఎంటీలో డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ స్థాయికి ఎదిగారు. ఆ కాలంలోనే అనేక దేశాలు చుట్టొచ్చారు. నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ చేయడానికీ.. టెక్నాలజీలో కొత్త ఉత్పత్తులు అందించాలన్న కోరికకీ ఆయనే స్ఫూర్తి. కాలిఫోర్నియాలో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ చేసి, ప్రముఖ సంస్థల్లో పనిచేశా. సిలికాన్‌ వ్యాలీలో యాహూ, గూగుల్‌ ప్రారంభమవుతోంటే నాకూ స్టార్టప్‌పై ఆసక్తి కలిగింది. అలా 1998లో సోలెక్స్‌ టెక్నాలజీస్‌ ప్రారంభించా. అదో డేటా మేనేజ్‌మెంట్‌ సంస్థ. దానికిప్పుడు డైరెక్టర్‌ని. ప్రతి సంస్థకూ వేలు, లక్షల్లో కస్టమర్లు ఉంటారు. బోలెడన్ని లావాదేవీలు. వాటన్నింటినీ సరి చూసుకోవడం సంస్థలకు పెద్ద తలనొప్పి. దాన్ని సులభతరం చేసేలా 2009లో ఫిన్‌టెక్‌ సంస్థ ‘ఇమాజియా’ ప్రారంభించా. ఆటోమేషన్‌ సేవల కోసమని సిరి, గూగుల్‌ అసిస్టెంట్‌లా ‘జియా’ను రూపొందించాం. ఇది మనుషుల్లా మాట్లాడటం, లావాదేవీలను గుర్తుచేయడం వంటివి చేస్తుంది. దీనికి ఆంత్రప్రెన్యూర్‌ ఆఫ్‌ ద ఇయర్‌, ఇన్నవేటర్‌, ట్రయల్‌ బ్రేజర్‌.. వంటి ఎన్నో అవార్డులు అందుకున్నా. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలో అత్యుత్తమ సీఈఓల్లో ఒకరిగానూ నిలిచా.


సమాజం కోసం..

అనుభవం నలుగురికీ సాయపడితేనే సార్థకత. అందుకే సమాజ సేవపైనా దృష్టిపెట్టా. సాయం కోసం అర్థించేవారు కొందరు.. సాయం చేయాలనున్నా మార్గం తెలియని వారింకొందరు. వీళ్లను  అనుసంధానించేలా ‘టచ్‌ ఎ లైఫ్‌ ఫౌండేషన్‌’ను తీసుకొచ్చా. దీని ద్వారా రక్తం అవసరమైనా, ఉన్నత చదువులకు సాయం కావాలన్నా.. చిన్న, పెద్ద ఏ సాయమైనా పొందొచ్చు, చేయొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించేలా ‘టాల్‌ గివింగ్‌’ పేరిట మొబైల్‌ అప్లికేషన్‌నూ తీసుకొచ్చాం. వ్యాపారంలో ఒడుదొడుకులు చూసి.. ఓ స్థాయికి చేరే సరికి చాలా అనుభవం వస్తుంది. దాన్ని రాబోయే తరాలకూ అందిస్తేనే ప్రయోజనం. లక్షల ఆలోచనలకు ఊపిరి పోసినట్లు అవుతుందనుకొని ‘టాల్‌స్కౌట్స్‌ ఇన్నొవేషన్‌ ప్రోగ్రామ్‌’ రూపొందించాం. ఈ లీడర్‌షిప్‌ ప్రోగ్రామ్‌.. వారి ఆలోచనను బిజినెస్‌గా రూపొందించడానికి అవసరమైన అన్ని విభాగాల్లో సాయం చేస్తుంది. టాప్‌ ఆలోచనలకు అవార్డులూ ఇస్తాం. యూనివర్సిటీ ఆఫ్‌ కొలరాడో ప్రొఫెసర్ల సలహాలతో ఈ ప్రోగ్రామ్‌ డిజైన్‌ చేశాం. ఇదీ గ్లోబల్‌ యూత్‌ ప్రోగ్రామే!

మావారు సాయి గుండవెల్లి.. సోలెక్స్‌ను నిర్వహిస్తున్నారు. అబ్బాయి తేజ్‌ కంప్యూటర్స్‌ చదివి, బ్లాక్‌చెయిన్‌ కంపెనీలో పనిచేస్తూ టచ్‌ ఎ లైఫ్‌ బాధ్యతలూ చూసుకుంటున్నాడు. అమ్మాయి త్రిష కంప్యూటర్స్‌ ఇంజినీరింగ్‌ చదువుతోంది. వ్యాపారమన్నాక ఎన్నో ఎత్తుపల్లాలు! ఫిన్‌టెక్‌ అన్నప్పుడు నిరాశపరచినవారే ఎక్కువ. అయితే కుటుంబం నాకెప్పుడూ అండగా ఉంది. దీనికితోడు పెరుగుతున్న వ్యాపారాలకు తగ్గట్టుగా లావాదేవీలుండాలన్న ఆలోచనను నమ్మి మొదలుపెట్టా. ఇప్పుడీ స్థాయిలో ఉన్నా. అయితే దీనివెనుక ఎన్నో ఏళ్ల శ్రమ, ఓర్పు అవసరమయ్యాయి. మీరైనా అంతే! నచ్చిన ఆలోచన గురించి లోతుగా తెలుసుకోండి. నిపుణుల సాయం తీసుకోండి. ఒకసారి సబ్జెక్టుపై పట్టొస్తే ఏం చేయాలో మీకే తెలుస్తుంది. మిమ్మల్ని మీరు నమ్మండి. ఆడవాళ్లకు సాధ్యం కాదని ఎవరన్నా వినొద్దు. చేయగలను అనిపించిందా.. ముందుకెళ్లిపోండి. అప్పుడు ఆటోమేటిక్‌గా దారులూ తెరుచుకుంటాయి.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్