15ఏళ్లకే పెళ్లైనా.. సాధించా!

టీచరమ్మగా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతూనే... సేవకీ సై అంటున్నారామె. చిన్నతనంలోనే వివాహం, ఆపై కుటుంబ బాధ్యతలు మీదపడ్డా..

Updated : 29 Nov 2022 05:07 IST

టీచరమ్మగా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతూనే... సేవకీ సై అంటున్నారామె. చిన్నతనంలోనే వివాహం, ఆపై కుటుంబ బాధ్యతలు మీదపడ్డా.. సంకల్పం బలంగా ఉంటే ఇవేమీ ఆడవాళ్లను అడ్డుకోలేవు అని నిరూపించారు నర్సారావుపేటకి చెందిన డాక్టర్‌ సాంబేలు శాంతిబాయి... తన మనసులోని మాటను వసుంధరతో పంచుకున్నారామె...

మేం ముగ్గురు అక్కాచెల్లెళ్లం. అమ్మ ఆరోగ్యం బాగాలేదని మాకు ఆరునెలల వ్యవధిలోనే పెళ్లిళ్లు చేశారు. అలా 15ఏళ్లకే పెళ్లి... ఆ తర్వాత ముగ్గురాడపిల్లలు. ఇదేనా జీవితం అని నిరాశ పడుతున్న సమయంలో మావారు నరసింహారావు చదువుకొమ్మని, నచ్చిన పనిచేయడానికి వెనకాడొద్దని ప్రోత్సహించారు. ఆయన పోలీస్‌. అలా ఆయన ప్రోత్సాహంతో... చదువుకుంటూనే.. టైలరింగ్‌, ఆత్మరక్షణ విద్యలు, లలిత సంగీతం వంటివన్నీ నేర్చుకున్నా. 2008 ఎల్‌పీ సెట్‌లో హిందీ భాషలో స్టేట్‌ఫస్ట్‌ ర్యాంకు సాధించా. ఎంఏ హిందీ, హిస్టరీ, బీఈడీ చేశా. 2014లో.. హిందీ ఉపాధ్యాయనిగా ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం పల్నాడు జిల్లా మాచర్ల మండలం జమ్మలమడక గ్రామంలో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో హిందీ టీచర్‌ని.

అలా సేవలోకి అడుగుపెట్టా...

2005లో రేపల్లెకు వరదలు వచ్చాయి. ఏకధాటిగా కురిసిన వర్షాలకి ఎంతోమంది పస్తులున్నారు. ఇంటెదురుగా ఉన్నావిడకి వండుకోవడానికి కట్టెలు కూడా లేని పరిస్థితి. అలాంటివారి కోసం ఇంట్లోనే వంట చేసి ఆహారం పొట్లాలు, దుప్పట్లు పంచడం మొదలుపెట్టా. అప్పుడే వరల్డ్‌ వెల్‌ బీయింగ్‌ అనే సంస్థను స్థాపించి.. జీవితాంతం సేవచేయాలని నిర్ణయించుకున్నా. ఆ తర్వాత నాకు వెల్దుర్తి మండలోని ఓ మారుమూల గ్రామంలో టీచర్‌గా తొలి పోస్టింగ్‌ వచ్చింది. అక్కడ పాఠశాలలో కనీస వసతులు లేవు. సగం మంది పిల్లలు మధ్యాహ్న భోజనం కూర్చుని చేస్తుంటే తక్కినవాళ్లు నిల్చోవాల్సిన దుస్థితి. ఈ సమస్యల్ని పరిష్కరించాల్సిందిగా ఎంతమందిని అడిగినా లాభం లేకపోయింది. దాంతో.. నా జీతంతో పాటు, మావారి సాయం కూడా తీసుకుని నాలుగున్నర లక్షలు పెట్టి అక్కడ సౌకర్యాలు కల్పించా. ఎనిమిదేళ్ల నుంచీ ఒక ఆశ్రమాన్నీ నిర్వహిస్తున్నా. ఆర్థికంగా ఏ అండా లేని 26 మంది పిల్లలు ఇక్కడ ఉంటున్నారు. ఇప్పటివరకూ అద్దె ఇంట్లోనే ఈ ఆశ్రమం నిర్వహించినా, ఇక నుంచైనా సొంత భవనం ఉండాలని నిర్మాణాన్ని మొదలుపెట్టాం. ఇందుకోసం నా బంగారాన్ని తాకట్టు పెట్టాను. నేను, మా వారు.. మా జీతాల్లో 60శాతం ఇలా సేవా కార్యక్రమాల కోసమే వెచ్చిస్తున్నాం. విరాళాలు ఆశించకూడదనుకున్నాం. ఇక ప్రతిచోటా మా బడి పిల్లలతో హిందీ పరీక్షలు రాయిస్తుంటాను. దాని వల్ల పిల్లలకు మరొక భాష మీద పట్టొస్తుంది... సర్టిఫికెట్‌ వాళ్లకు ఉపయోగపడుతుంది. అందుకే శిక్షణ అందిస్తూ పరీక్ష ఫీజులూ నేనే చెల్లిస్తా. అలా నాలుగువేల మంది పిల్లలతో రాయించా.


ఆత్మవిశ్వాసం కోసం...

నేను తైక్వాండోలో గ్రీన్‌బెల్ట్‌ సాధించాను. ప్రతి ఆడపిల్లకూ ఆత్మరక్షణ విద్య అవసరం.. అందుకే నేనే పాఠశాలలో పని చేసినా అక్కడి పిల్లలకి తైక్వాండో ఉచితంగా నేర్పిస్తుంటా. నా ముగ్గురు కూతుళ్లూ కరాటే, చెస్‌, చిత్రలేఖనాల్లో జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించారు. పోటీల్లో పాల్గొనడానికి ఏ పిల్లలకు ఆసక్తి ఉన్నా... వాళ్లనీ ప్రోత్సహించి పంపిస్తుంటాను. మా సంస్థ వార్షికోత్సవానికి ఏటా రక్తదాన కార్యక్రమాలు నిర్వహించి, ఆ రక్తాన్ని తలసేమియా పిల్లలకోసం ప్రభుత్వ ఆసుపత్రులకు అందిస్తున్నాం. బాల్య వివాహాలు ఎన్ని కష్టాలు తెచ్చిపెడతాయో నాకు తెలుసు కాబట్టి... అవి ఎక్కువగా జరిగే గ్రామీణ మహిళలకు అండగా ఉండేందుకు క్యాండిళ్లు, విస్తరాకుల తయారీ వంటి వాటిలో శిక్షణ ఇస్తున్నా. 300 మంది పైచిలుకు ఈ శిక్షణ అందుకున్నారు. దాని ఆధారంగా వాళ్లంతా ఎంతో కొంత ఉపాధిని పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి రెండుసార్లు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును పొందాను. సావిత్రిబాయి ఫూలే నేషనల్‌ ఫెలోషిప్‌, తెలుగు సాహితీ పురస్కారం వంటివి ఎన్నో అందుకున్నా. ఎన్ని అవార్డులు వచ్చినా సేవను మించిన సంతృప్తి లేదని అనుకుంటాను.

- పోలే కిరణ్‌కుమార్‌, మాచర్ల గ్రామీణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్