చనిపోదామనుకొనే సమయానికి.. ఆమె వచ్చింది!

నష్టాలు.. కష్టాలు ఆమెని ఎంతగా బాధించాయంటే ‘ఇక చనిపోవడమే మార్గం’ అనుకొనేంతగా! అయితే చివరి నిమిషంలో మలుపు తిరిగిందామె జీవితం.

Updated : 16 Dec 2022 07:51 IST

నష్టాలు.. కష్టాలు ఆమెని ఎంతగా బాధించాయంటే ‘ఇక చనిపోవడమే మార్గం’ అనుకొనేంతగా! అయితే చివరి నిమిషంలో మలుపు తిరిగిందామె జీవితం. ఈసారి ఆమె కడగళ్లపైన తిరుగుబాటు బావుటా ఎగరేశారు. వంటే ఆసరాగా పట్టుదలతో తలరాతనే మార్చుకున్నారు. బిర్యానీతో జైత్రయాత్ర సాగిస్తోన్న మాధురి.. తన ప్రయాణాన్ని వసుంధరతో పంచుకున్నారిలా...

మాది వంకమామిడి. నాకు నలుగురు అన్నదమ్ములు. అమ్మానాన్నలు చీరలపై బ్లాక్‌ ప్రింటింగ్‌ వేసి అమ్మేవారు. చిన్నప్పట్నుంచీ వాళ్లకు సాయంగా ఉండేదాన్ని. ముగ్గురం కలిసి రోజూ 15 చీరల వరకు ప్రింటింగ్‌ వేసేవాళ్లం. అందులో కొన్నింటిని కళాంజలికిస్తే, మరికొన్ని ఇంటికొచ్చి కొనుక్కొనేవారు. ఇంటర్‌ అయ్యాక కొయ్యలగూడేనికి చెందిన భాస్కర్‌తో పెళ్లైంది. మావారు మగ్గంపని చేయించిన డ్రస్‌ మెటీరియళ్లు, పట్టు చీరలు ఎగ్జిబిషన్స్‌లో విక్రయించేవారు. మా బాబుకి నాలుగేళ్లు వచ్చేంతవరకూ నేనూ ఆయనతో వెళ్లేదాన్ని. కానీ అప్పటికే పోటీ పెరగడంతో అమ్మకాలు అంతగా ఉండేవి కావు.

సమయానికి ఆమె వచ్చింది..

సొంతంగా ఏదైనా చేద్దామని 25 కాసుల బంగారం అమ్మి వస్త్ర దుకాణాన్ని ప్రారంభించా. ఆ వ్యాపారంలో అప్పులే మిగిలాయి. అవి తీర్చడానికి ఉన్న ఇల్లు అమ్మేశాం. చేతిలో చిల్లిగవ్వ లేక.. పస్తులుండాల్సిన పరిస్థితి. నా ఇబ్బందుల్ని పుట్టింటి వాళ్లకి కూడా చెప్పుకోలేక చనిపోదామనుకున్నా. బాబుని అత్తింటి వాళ్లు ఎలాగూ ఆదరిస్తారన్న నమ్మకంతో మావారు, నేను ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమయ్యాం. ఇంతలో దేవతలా మా తోటి కోడలు బియ్యం మూటతో వచ్చింది. మా కష్టం తెలిశాక మా వారి తరఫువారంతా అండగా నిలబడ్డారు. మా ఆడపడుచు నన్ను మహిళాస్వయం సహాయక బృందం కార్యాలయానికి తీసుకెళ్లి, రూ.3వేలు కట్టి సభ్యురాలిని చేసింది. రుణం తీసుకొని ఏదో ఒకటి చేద్దామని భరోసా ఇచ్చింది. అనుకున్నట్టుగానే మూడు నెలల్లో నాకూ, తనకు, మరొకరికి కలిపి రూ.1,20,000 రుణం మంజూరైంది. వాళ్లిద్దరూ ఆ మొత్తం నన్నే తీసుకొని ఏదైనా వ్యాపారం చేసుకోమన్నారు. ఆ రోజు బోరున ఏడ్చా. నాకు తిరిగి జీవితాన్నిచ్చిన క్షణాలవి. నా చేతివంట రుచిగా ఉంటుందని, అదే ప్రయత్నించమని సలహా ఇచ్చారు. దాంతో ఎగ్జిబిషన్లలో క్యాంటిన్‌ పెట్టడానికి అనుమతి పొందాం. తొలిప్రయత్నంగా 2017లో హైదరాబాద్‌ ఎగ్జిబిషన్‌లో క్యాంటిన్‌ పెట్టాం. కొంత ధైర్యం వచ్చింది.


ఖాళీ చేతులతో...

తర్వాతి ఏడాది హైదరాబాద్‌ దమ్‌ బిర్యానీ రుచిని చూపించడానికి కేరళ వెళ్లాం. అక్కడ కురిసిన భారీవర్షాలకు రూ.లక్ష ఖరీదు చేసే సామాన్లన్నీ నీటిలో కొట్టుకుపోయాయి. ఖాళీ చేతులతో ఇంటికొచ్చాం. మరో ప్రయత్నం చేద్దామని 2019లో దిల్లీ ఎగ్జిబిషన్‌కెళ్లాం. మా బిర్యానీకి ఊహించని స్పందన. మొదటిరోజున 30 కేజీలు చేస్తే 5 గంటల్లోపే ఖాళీ అయ్యింది. రెండో రోజున 50కేజీలు చేస్తే సాయంత్రానికే సేల్‌ అయ్యింది. తర్వాత 10 రోజులపాటు రోజూ 100 కేజీల చొప్పున బియ్యం, చికెన్‌ వేసి హైదరాబాద్‌ బిర్యానీ చేస్తే సాయంత్రమయ్యే సరికి మెతుకు మిగిలేది కాదు. ఆ ఒక్క ఎగ్జిబిషన్‌లోనే రూ.12లక్షలకుపైగా బిర్యానీ విక్రయించాం. ఊహించని లాభం అది. మళ్లీ వెనక్కి చూడలేదు. నా బిర్యానీకి మంచి పేరొచ్చింది. తెలంగాణ, ఆంధ్రాసహా దిల్లీ, బెంగళూరు, మద్రాసు, కేరళ, లఖ్‌నవూ వంటి 25కుపైగా ఎగ్జిబిషన్లలో బిర్యానీతో లాభాలను అందుకున్నా. 20మందికి పైగా ఉపాధినిస్తున్నా. పోయిన బంగారాన్ని కొనుక్కున్నా. బాబును బాగా చదివిస్తున్నా. దేశవ్యాప్తంగా ఎగ్జిబిషన్లకు హాజరవ్వాలనేది నా లక్ష్యం. ఎగ్జిబిషన్లు అన్ని వేళలా ఉండవు కాబట్టి.. ఓ క్యాంటిన్‌ కూడా నడుపుతున్నాం.


కష్టాలొచ్చాయని ప్రాణాలు తీసుకోవడం తప్పు. ఆ రోజు మేం చనిపోయుంటే నాకొడుకు అనాథయ్యేవాడు. అందుకే కష్టంలో ఉన్నామని ఎవరైనా అంటే.. పరిష్కారం చనిపోవడం కాదని చెబుతా. సహనంతో మరొక్క అడుగు వేయడానికి కష్టపడితే.. కొత్త జీవితం మనకోసం ఎదురుచూస్తుంటుంది. తిరిగి విజయం సాధించొచ్చు. దానికి నేనే ఉదాహరణ కదా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్