పోరాటమే ఆవిడ విజయ చిహ్నం

కష్టాలన్నీ ఒకేసారి దాడిచేయడం అంటే ఏంటో ఈమె జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది. డిగ్రీ అయినా పూర్తికాలేదు.. నాన్న మరణించారు. వ్యాపార నష్టంతో చేతిలో చిల్లిగవ్వ మిగల్లేదు. కొత్తవ్యాపారంలోకి అడుగుపెడితే అక్కడా సవాళ్లు.. ఆపై అనారోగ్యం! మరణం అంచులదాకా వెళ్లింది. వీటన్నింటినీ చిరునవ్వుతోనే దాటింది నిధి.

Updated : 07 Jan 2023 07:14 IST

కష్టాలన్నీ ఒకేసారి దాడిచేయడం అంటే ఏంటో ఈమె జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది. డిగ్రీ అయినా పూర్తికాలేదు.. నాన్న మరణించారు. వ్యాపార నష్టంతో చేతిలో చిల్లిగవ్వ మిగల్లేదు. కొత్తవ్యాపారంలోకి అడుగుపెడితే అక్కడా సవాళ్లు.. ఆపై అనారోగ్యం! మరణం అంచులదాకా వెళ్లింది. వీటన్నింటినీ చిరునవ్వుతోనే దాటింది నిధి. విజయ చిహ్నాలు, జ్ఞాపికలు, బహుమతుల వ్యాపారంలో రాణిస్తూనే ఎంతోమందికి ఉపాధినీ కల్పిస్తోన్న ఆమెను వసుంధర పలకరించింది.

డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు నాన్న అకస్మాత్తుగా చనిపోయారు. ఆయన నీడలో భద్రంగా ఉన్న మాకు అప్పటి నుంచి కష్టాలు పరిచయమయ్యాయి. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. మాది మహారాష్ట్రలోని గుడ్‌గావ్‌. నాన్నది కంప్యూటర్స్‌ వ్యాపారం. నాన్న పోయాక మాకు రావాల్సిన మొత్తం రాలేదు. ఎంతోమంది ముఖం చాటేశారు. ఇల్లు తప్ప ఏమీ మిగల్లేదు. అమ్మకు ఇల్లే లోకం. తమ్ముడు చిన్నవాడు. దీంతో ఇంటి బాధ్యత తీసుకున్నా. ఏం చేయాలన్నా కనీసం డిగ్రీ ఉండాలనిపించింది. నాన్న వ్యాపారాన్ని చూసుకుంటూనే చదువు కొనసాగించా. ఈసారి నష్టంతో చిల్లిగవ్వ కూడా మిగల్లేదు. ఇక కొనసాగించలేనని అర్థమైంది.

తాజ్‌మహల్‌ కావాలన్నారు..

నాకు ఆర్ట్స్‌, క్రాఫ్ట్స్‌ అంటే ఆసక్తి. ఇంట్లో పనికిరాని వస్తువులతో బొమ్మలు తయారు చేసేదాన్ని. కాస్త శిక్షణ ఉంటే బాగుంటుందనుకుంటున్న తరుణంలో స్నేహితురాలు అమెరికాలో ట్రోఫీల డిజైనింగ్‌పై జరుగుతోన్న పెద్ద ప్రదర్శన గురించి చెప్పింది. అక్కడికెళితే ట్రోఫీల డిజైన్లు, వాటిని రూపొందించే సంస్థల విధానాలు తెలుసుకోవచ్చు. పైగా మన దగ్గర అలాంటి పెద్ద సంస్థలేవీ లేవు. కానీ డబ్బులేవి? స్నేహితులకు పరిస్థితి చెబితే రూ.10లక్షలు పోగు చేసిచ్చారు. అలా 2000లో అమెరికా వెళ్లా. ట్రోఫీల తయారీ పరికరాల దగ్గర్నుంచి ఎన్నో అంశాలు తెలుసుకున్నా. శిక్షణా తీసుకున్నా. నాపై నాకు నమ్మకం వచ్చాక 2001లో దిల్లీలో ‘పినాకిల్‌ రివార్డ్స్‌ అండ్‌ రికగ్నైజేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ ప్రారంభించా. మా ఉత్పత్తుల మార్కెటింగ్‌ కోసం సంస్థలను సంప్రదిస్తున్నప్పుడు ‘పిజ్జా హట్‌’ వాళ్లు ‘గ్లాస్‌ లోపల తాజ్‌మహల్‌ చేయగలరా’ అనడిగారు. మొదటి ఆర్డరు.. వెంటనే ఒకే చెప్పేశా. ఎన్నో ప్రయోగాలు చేశాక కానీ.. వాళ్లు కోరినట్లుగా రాలేదు. దాంతో సంపాదించింది రూ. వెయ్యే అయినా ఆత్మవిశ్వాసం పెరిగిన రోజది. అందుకే ఆ మొత్తం నాకు చాలా ప్రత్యేకం. ఆరోజు నుంచి ఈ 22 ఏళ్లలో ఆ సంస్థ నుంచి ఎన్నో ఆర్డర్లు. వాళ్ల ట్రోఫీలు, జ్ఞాపికలు, సిబ్బందికి కానుకలు వంటివన్నీ నేనే డిజైన్‌ చేసిస్తున్నా. రెండో ఆర్డరు ఓ పెద్ద కంప్యూటర్‌ సంస్థది. గ్లాస్‌, క్రిస్టల్‌తో మొమెంటోలు చేసిచ్చా. అప్పుడూ పేరొచ్చింది. క్రమేపీ ఆర్డర్లిచ్చే సంస్థల సంఖ్య పెరిగింది. ఇప్పుడు వేలాది సంస్థలకు పర్మినెంట్‌ డిజైనర్‌నయ్యా.

సవాళ్లెన్నో..

ప్రశంసలే కాదు.. సవాళ్లూ ఎన్నో! కారణం చెప్పకుండా కొన్ని ఆర్డర్లు రద్దయ్యేవి. అతుకుల వద్ద వస్తోన్న బబుల్స్‌, మృదుత్వం లేకపోవడం వంటివి కారణాలని తెలిసింది. రెండేళ్లు సిబ్బందికి సరిగా జీతాలూ ఇవ్వలేకపోయా. ఎన్నో పరిశోధనలతో ఒక్కోదాన్నీ ఓపిగ్గా అధిగమించా! అయిదేళ్లకు ఆర్డర్లు పెరిగాయి. రోహిత్‌సేథ్‌తో వివాహ బంధమూ బాగుంది. అంతా సవ్యంగా సాగుతోందనుకుంటే తీవ్ర కడుపునొప్పి.. గిలగిల్లాడేదాన్ని. ఆసుపత్రులెన్ని తిరిగినా ఫలితం లేదు. చివరకు బెంగళూరులో అనారోగ్య కారణాన్ని గుర్తించి, ఒక కిడ్నీ సగం తొలగించారు. అప్పుడు కానీ పదేళ్ల ప్రత్యక్ష నరకం దూరం కాలేదు. అంత అనారోగ్యంలోనూ సంస్థ మీద శ్రద్ధ తగ్గించ లేదు. కాబట్టే.. నెలకు 10వేలకుపైగా ఆర్డర్లు. 100మందికిపైగా సిబ్బంది పనిచేస్తున్నారు. వార్షికాదాయం రూ.కోటి వరకూ వస్తోంది. ఎల్‌అండ్‌టీ, బాష్‌, వోల్వోతోపాటు 3000కు పైగా దేశ, విదేశీ సంస్థలతో పనిచేశా. దిల్లీ, బెంగళూరుల్లోనే ఉన్న శాఖలను దేశవ్యాప్తం చేయడం
నా లక్ష్యం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్