బతికితే భారమన్నారు.. గాన కోకిలైంది!

‘ఈ పాప బతికి వృథా.. ఈమె మీకో భారమే..’ బెంజీ కుమార్‌ పుట్టినప్పుడు ఆమె తల్లిదండ్రులకు వచ్చిన సలహాలివి! కానీ కవితాకుమార్‌ అవేమీ పట్టించుకోలేదు.

Updated : 08 Jan 2023 07:23 IST

‘ఈ పాప బతికి వృథా.. ఈమె మీకో భారమే..’ బెంజీ కుమార్‌ పుట్టినప్పుడు ఆమె తల్లిదండ్రులకు వచ్చిన సలహాలివి! కానీ కవితాకుమార్‌ అవేమీ పట్టించుకోలేదు. చిన్న ఆశ కనిపించినా ప్రయత్నించారు. కూతురిని జాతీయ అవార్డులు గెలుచుకునే స్థాయికి తీసుకొచ్చారు.. ఆ అమ్మాకూతుళ్ల గెలుపు ప్రయాణమిది.

బెంజీ పుట్టేనాటికి ‘ఆటిజం’, ‘న్యూరోడైవర్జెన్స్‌’ అన్న పదాలు విన్నవారే అరుదు. దీంతో ఎక్కడ, ఎవరి సాయం తీసుకోవాలో తెలియక కవితాకుమార్‌, ఆమె భర్త చాలా ఇబ్బందులు పడ్డారు. బెంజీకి నెల వయసు వచ్చేనాటికి అందరి పిల్లల్లా లేదని ఆమె అమ్మానాన్న గుర్తించారు. ఆసుపత్రులకు తిప్పినా ప్రయోజనం లేదు. ‘ఈ అమ్మాయి మంచానికే పరిమితం.. వదిలించుకోవడం మేలు.. అనవసర భారం’ అంటూ ఎంతోమంది సలహాలివ్వడం, సానుభూతి చూపడం చేసేవారు. కానీ తల్లి మనసు.. ఊరుకోదు కదా! ఎక్కడ చిన్న ఆశ కనిపించినా బెంజీని తీసుకొని వెళ్లిపోయేది. దేశవిదేశాల్లో చికిత్స చేయించారు. అమెరికా వెళ్లినప్పుడు ఇది ‘ఆటిజం’ అని తెలిసిందామెకు. చికిత్సతో లక్షణాలను తగ్గించొచ్చన్న వాళ్ల మాటలు ఆమెలో ఆశలు రేపాయి.

బెంజీ సంగీతానికి స్పందించడం గమనించారామె. అయిదేళ్లు వచ్చాక శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇప్పించారు. రెండేళ్లలోనే ప్రదర్శన ఇచ్చే స్థాయికి ఎదిగిందామె. ఆమె పాట విని అందరూ నిల్చొని ప్రశంసిస్తోంటే ఆ తల్లి ఆనందానికి అవధుల్లేవు. 9 ఏళ్లకే ‘బేసిక్‌ రాగాస్‌’ పేరుతో సొంత క్యాసెట్‌ విడుదల చేసింది బెంజీ. ‘కొత్తవాళ్లతో మాట్లాడాలన్నా.. కొత్త ప్రదేశాలకు అలవాటు పడాలన్నా బెంజీ కాస్త ఇబ్బంది పడేది. పాట రికార్డింగ్‌ సమయంలోనూ ఇదే పరిస్థితి. కానీ సంగీతంపై ప్రేమ.. నిరూపించుకోవాలన్న తపనతో కష్టపడేది. ఫలితమే లతా మంగేష్కర్‌, ఆశా భోంస్లే, అద్నాన్‌ సమీ వంటి ప్రముఖుల నుంచి ప్రశంసలు.. మూడు జాతీయ అవార్డులతో సహా ఎన్నో అవార్డులు. అన్నింటికంటే ఒక చిన్న ప్రశంస.. నలుగురి చప్పట్లు తనకి చాలా ఆనందాన్నిస్తాయి. ఒకప్పుడు నన్ను చూసి జాలిపడిన వారే.. అదృష్టవంతురాలంటూ పొగుతున్నా’రంటున్న కవిత తన కూతురి లాంటివారికి సాయపడాలని 2007లో ‘ధూన్‌ ఫౌండేషన్‌ ప్రారంభించారు’. దాని ద్వారా ఆటిజం, వైకల్యం ఉన్న పిల్లలకు ఆర్ట్స్‌ వంటివి నేర్పిస్తూ ఆత్మవిశ్వాసం నింపుతున్నారు. 27 ఏళ్ల బెంజీ కూడా సమయమున్నప్పుడల్లా సంగీత పాఠాలు చెబుతోంది. దీనిద్వారా తనలా ఎంతోమంది తల్లులు గర్వంగా నిలబడేలా చేయడమే తన లక్ష్యమంటోన్న ఈమె ప్రయాణం స్ఫూర్తిదాయకమే కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్