అమ్మయ్యాక.. ఆ దిగులు పోవాలంటే!

మాతృత్వం ఒక వరం... అది సంతోషాల్నే కాదు, కొన్నిసార్లు తెలియని దిగులునీ తెచ్చిపెడుతుంది. దాని పేరే పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌. సామాన్య మహిళల నుంచి సెలబ్రిటీ మామ్స్‌ వరకూ అంతా దీని బాధితులే.

Updated : 09 Jul 2023 07:53 IST

మాతృత్వం ఒక వరం... అది సంతోషాల్నే కాదు, కొన్నిసార్లు తెలియని దిగులునీ తెచ్చిపెడుతుంది. దాని పేరే పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌. సామాన్య మహిళల నుంచి సెలబ్రిటీ మామ్స్‌ వరకూ అంతా దీని బాధితులే. దీన్నుంచి ఎంత త్వరగా బయటపడితే... అంతలా అమ్మతనాన్ని ఆస్వాదించగలుగుతారని చెబుతునారు..


అంతకుమించిన అందం లేదన్నాడు...

- అనుష్క శర్మ, బాలీవుడ్‌ నటి

‘బిడ్డ పుట్టాక... ఆ తల్లి శరీరాకృతిలో మార్పులు రావడం సహజమే. ముఖ్యంగా బరువు పెరిగిపోయి ఫిట్‌నెస్‌ కోల్పోయే పరిస్థితిని చాలామందిలోనే చూసుంటాం. అయినా సరే... వామిక పుట్టాక కొన్ని రోజులకు నేనూ ఈ విషయంలో మదనపడ్డా. ముఖ్యంగా.. ఫిట్‌నెస్‌ కోల్పోయిన నా శరీరాన్ని చూసి నన్ను నేనే అసహ్యించుకుంటానేమోనని భయపడేదాన్ని. పూర్వపు స్థితికి చేరుకోవడానికి వ్యాయామాలు చేసేదాన్ని. ఈ క్రమంలోనే ఆత్మన్యూనత నన్ను వెంటాడేది. పాత ఫొటోలను విరాట్‌కి చూపిస్తూ ‘అప్పుడు నేనెంత బాగున్నానో చూడు అంటే... అందం కంటే గొప్పదైన అమ్మతనాన్ని ఆస్వాదిస్తు న్నావని గుర్తించు... ఇప్పటి ఫొటోలో మరింత అద్భుతంగా కనబడతావు’ అంటూ నాలోని ప్రతికూల ఆలోచనల్ని తగ్గించి సానుకూలతను పంచేవాడు’ అంటూ తన పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌ నుంచి బయటపడిన విధానాన్ని పంచుకుంటోంది


కుటుంబం తోడుగా ఉండాలి..

- కాజల్‌, నటి

తెలుగు తెరపై తనదైన ముద్ర వేసిన అందాల చందమామ కాజల్‌. కెరియర్‌ పీక్స్‌లో ఉండగానే గౌతమ్‌ కిచ్లూతో పెళ్లి పీటలెక్కింది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం ‘ఇండియన్‌-2’, ‘సత్యభామ’  ప్రాజెక్టుల్లో నటిస్తోన్న కాజల్‌... తరచూ అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్న సందర్భాలను మనకు చెబుతూనే ఉంది. అలా తాజాగా తాను ఎదుర్కొన్న పోస్ట్‌ పార్టమ్‌ డిప్రెషన్‌ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ‘అందరు మహిళల మాదిరిగానే నేనూ ఆ దశను ఎదుర్కొన్నా. అది కొత్తగా తల్లయిన వారందరిలోనూ సర్వసాధారణం. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ కుంగుబాటు నుంచి బయటపడటానికి కుటుంబ సభ్యులు చేయూతనివ్వాలి. అమ్మకు మొదటి ప్రాధాన్యం బిడ్డే అయినా...కొంత సమయాన్ని మీకోసం, మీ వారి కోసమూ కేటాయించుకోవాలి. మీ మునుపటి శరీరాకృతిని తిరిగి తెచ్చుకోవడానికి వ్యాయామ నిపుణుల ఆధ్వర్యంలో వర్కౌట్లు చేయండి. ఇష్టమైన వ్యక్తులతో సమయం గడపండి...ఇవన్నీ త్వరగానే ఆ దశ దాటడానికి సాయం చేస్తాయి. నా విషయంలో  నన్నెంతగానో అర్థం చేసుకునే కుటుంబసభ్యులు ఉండటం వల్ల ఆ దశ నుంచి వెంటనే బయటకు రాగలిగాను. పోస్ట్‌ పార్టమ్‌ డిప్రెషన్‌కు లోనైనప్పుడు నా భర్త గౌతమ్‌ నన్ను సంతోషంగా ఉంచడానికి ఎంతో కష్టపడ్డారు’ అని ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటుంది.


ప్రతి తల్లికీ ఈ థెరపీ కావాలి...

- అలియాభట్‌, నటి

ర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో సీతగా కనిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది అలియాభట్‌. ఏడు నెలల క్రితం రాహా కపూర్‌కు జన్మనిచ్చి మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తోంది. బిడ్డ పుట్టిన సంతోషమే కాదు... తర్వాత జీవితంలో వచ్చిన మార్పులు కూడా తనని ఆందోళనకు గురిచేశాయని చెబుతోంది. ‘ప్రసవమయ్యాక మహిళ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. కొత్త బాధ్యతలెన్నో వచ్చి చేరతాయి. వీటికి హార్మోన్ల అసమతుల్యత, పని ఒత్తిడి వంటివి తోడవుతాయి. దాని ఫలితంగానే ఎన్నో ఉద్వేగాలు. అందుకు పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌, బేబీ బ్లూస్‌కి కారణం. నాలోనూ ఈ తరహా కుంగుబాటు, ఆందోళనని నా చుట్టూ ఉన్నవారు గుర్తించారు. ఈ పరిస్థితిని అధిగమించి, సాధారణ జీవితాన్ని సాగించడానికి నాకు ఎంతో అండగా ఉన్నారు. ఈ క్రమంలోనే పోస్ట్‌పార్టమ్‌ థెరపీ సెషన్స్‌కీ హాజరయ్యా. డైటింగ్‌, బరువు, మామ్స్‌ గిల్ట్‌... ఇలా ఎన్నో విషయాల్లో నేను కుంగుబాటుకు గురయ్యానని అప్పుడే తెలుసుకున్నా. శారీరక వ్యాయామం నుంచి కౌన్సెలింగ్‌ వరకూ వివిధ దశల్లో సాగే ఈ చికిత్స ప్రతి అమ్మకూ అవసరమే’ అంటోంది అలియా.


ధైర్యంగా ఉండాలి..

- సమీరారెడ్డి, నటి

‘బాబు హాన్స్‌ పుట్టాక... చురుగ్గా, ఉండలేకపోయేదాన్ని. బరువు పెరిగా, జుట్టు ప్యాచులు, ప్యాచులుగా ఊడిపోయేది. ఎంత ప్రయత్నించినా సంతోషంగానూ గడపలేకపోయేదాన్ని. అది డిప్రెషన్‌ అని తెలుసుకోవడానికి సమయం పట్టింది.  మానసిక వ్యాధులు పైకి కనిపించకపోయినా, అంతర్గతంగా మనిషిని కుంగదీస్తాయి. ఈ పరిస్థితి తల్లయిన ప్రతి అమ్మాయికీ ఎదురుకావొచ్చు. ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. మార్పుల్ని అంగీకరిస్తేనే అమ్మతనాన్ని పూర్తిగా ఆస్వాదించగలం. శారీరక మార్పులు, విమర్శలపై కాదు.. పిల్లల పెంపకంపై దృష్టి సారించడం మొదలుపెట్టండి. బిడ్డలే మన మొదటి ప్రాధాన్యం. అలాగే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మరచిపోవద్దు’.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్