వాళ్ల కోసం.. 150 కోర్సులు చేశా!

ఉపాధ్యాయ వృత్తి ఉద్యోగం కాదు.. బాధ్యత అని నమ్మారామె. అందుకే బోధించడం, మార్కులొచ్చేలా చూడటంపైనే దృష్టిపెట్టలేదు. విద్యార్థులను ఇతర అంశాల్లోనూ ప్రోత్సహిస్తున్నారు. పేద కుటుంబాల పిల్లలను విదేశీబాట పట్టిస్తున్నారు.

Updated : 27 Nov 2023 01:40 IST

ఉపాధ్యాయ వృత్తి ఉద్యోగం కాదు.. బాధ్యత అని నమ్మారామె. అందుకే బోధించడం, మార్కులొచ్చేలా చూడటంపైనే దృష్టిపెట్టలేదు. విద్యార్థులను ఇతర అంశాల్లోనూ ప్రోత్సహిస్తున్నారు. పేద కుటుంబాల పిల్లలను విదేశీబాట పట్టిస్తున్నారు. సంభాన రూపవతి.. ఆ ప్రయాణం ఆవిడ మాటల్లోనే..

విద్యార్థులను ఎంతసేపూ మార్కులంటూ పరుగెత్తిస్తే.. మానసిక వికాసం సాధ్యమయ్యేదెలా? వాళ్ల ఆలోచనా పరిధి ఎలా పెరుగుతుంది. దానిలో మార్పు తేవాలనుకున్నా. మాది మన్యం జిల్లా పాలకొండ. ఎంఏ బీఈడీ చదివి, శ్రీకాకుళం గురుకుల పాఠశాలలో ఇంగ్లిష్‌ ఉపాధ్యాయురాలిగా చేరా. లెక్చరర్‌, ప్రిన్సిపల్‌.. ఇలా పదోన్నతులెన్నో పొంది ప్రస్తుతం విశాఖ, అనకాపల్లి జిల్లాల గురుకుల పాఠశాలల సమన్వయకర్తగా చేస్తున్నా. పాఠాలే కాదు ఎక్స్‌ట్రాకరిక్యులర్‌ యాక్టివిటీస్‌కీ ప్రాధాన్యమివ్వాలని నమ్ముతాన్నేను. అందుకే పిల్లలను వివిధ పోటీల్లో పాల్గొనేలా చూస్తా. 2016లో ప్రిన్సిపల్‌గా ఉన్నప్పుడు స్టెమ్‌ రంగాలపై వారిలో ఆసక్తి కలిగించాలని అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ మా కళాశాలకి వచ్చేలా చూశా. దీనిద్వారా కేంద్రప్రభుత్వం నుంచి నిధులతోపాటు అధునాతన సైన్స్‌ పరికరాలెన్నో వస్తాయి. వీటితో పిల్లలు ప్రాజెక్టులు చేయొచ్చు. సమాజంలో ఏ సమస్యనైనా సైన్స్‌ సాయంతో పరిష్కరించొచ్చనే ఆలోచన కలిగించడమే ఉద్దేశం. అంతేకాదు.. ఏఐ, రోబోటిక్స్‌ వంటి అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీలూ పరిచయమవుతాయి.

టాప్‌లో.. తప్పకుండా..

జాతీయస్థాయిలో ఏటా ఏటీఎల్‌ మారథాన్‌ నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా 300 ప్రాజెక్టులను ఎంపిక చేస్తారు. మా విద్యార్థులు తయారు చేసిన.. మురికి నీటిని మంచి నీటిగా మార్చడం, అంధులకు ప్రత్యేకమైన కుర్చీ, స్టిక్‌, రోబోలు వంటి సైన్స్‌ ప్రాజెక్టులెెన్నో ఇక్కడ ఎంపికయ్యాయి. నేనెక్కడ పనిచేసినా మా స్కూలు టాప్‌ 20లో తప్పక ఉండేది. దీని ద్వారా ఎంపికైన మా విద్యార్థిని రష్యా వెళ్లడమే కాదు.. రోబోటిక్స్‌లో 15 రోజుల శిక్షణతోపాటు అధ్యక్షుడు పుతిన్‌నీ కలిసింది. దేశవ్యాప్తంగా జరిగే సైన్స్‌ ఇంక్యుబేషన్‌, ఫెస్ట్‌లకీ తీసుకెళుతుంటా. 2016లో న్యూయార్క్‌లో నిర్వహించిన వరల్డ్‌ మేకర్‌ ఫెయిర్‌లో 100 దేశాలు పాల్గొంటే మా పిల్లలు తయారు చేసిన రెండు రోబోలు ఎంపికయ్యాయి. అమెరికా కొన్నేళ్లుగా కెనడీ లూగర్‌ యూత్‌ ఎక్స్ఛేంజ్‌ స్టడీ ప్రోగ్రామ్‌ నిర్వహిస్తోంది. దీనిలో 8 దశల్లో వడపోతలు ఉంటాయి. ఎంపికైన విద్యార్థి ఇతర దేశాలవాళ్లతో కలిసి ఏడాది అక్కడ చదువుకోవచ్చు. ఖర్చులన్నీ నీతిఆయోగ్‌ భరిస్తుంది. 9, ఇంటర్‌ ప్రథమ సంవత్సర విద్యార్థులు పాల్గొనవచ్చు. నేను 2020లో సమన్వయకర్త అయినప్పటి నుంచీ మా పిల్లలను పంపిస్తున్నా. ఏటా కనీసం ఇద్దరు మా విద్యార్థులు ఉంటున్నారు. ఈ ఏడాదికి ఇద్దరు ఇప్పటికే ఆరోదశకు చేరుకున్నారు కూడా. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, సమాజానికి సాయపడే గుణం వంటివెన్నో పరీక్షిస్తారు. అన్ని స్కూళ్లలో పిల్లలకు కొన్ని అంశాలిచ్చి రాయమంటాం. దాని ద్వారా ఎంపిక చేసి, దరఖాస్తు చేయిస్తున్నాం. వారికి అవసరమైన శిక్షణనీ ఇప్పిస్తాం. ఇవేకాదు.. విద్యార్థుల ఆసక్తినిబట్టి ఆటలు, నృత్యం, సంగీతం అన్నింట్లో ప్రోత్సహిస్తున్నా.

పురస్కారాలెన్నో..

30ఏళ్ల సర్వీసు.. వరుసగా పదేళ్లు ఉత్తమ ఉపాధ్యాయినిగా నిలిచా. శ్రీమతి సావిత్రిబాయి పూలే, ముఖ్యమంత్రి ఎక్సలెన్స్‌ సహా పురస్కారాలెన్నో అందుకున్నా. తొలిరోజుల్లో ఈవిడేంటి.. కూర్చోరు.. కూర్చోనివ్వరు. ఏదో ఒక పోటీ అంటారు అనుకునేవారు. తర్వాత్తర్వాత నా ఉద్దేశం అర్థం చేసుకొని టీచర్లంతా ముందుకొచ్చారు. మా విద్యార్థులకు కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌, సైన్స్‌, మేథ్స్‌ ల్యాబ్‌లు ప్రారంభించాం. ఆసక్తి ఉన్నవారికి ఐఐటీ, నీట్‌ శిక్షణతోపాటు కెరియర్‌ గైడెన్స్‌నీ ఇస్తున్నాం. మా దగ్గరంతా పేద, కులీ కుటుంబాల పిల్లలే. వాళ్లు అభివృద్ధి చెంది ఇంకొంతమందికి సాయపడే స్థాయిలో నిలపాలని నా కోరిక. అందుకే నన్ను నేను అప్‌డేట్‌ చేసుకుంటా. 150 వరకు ఆన్‌లైన్‌ కోర్సులు చేశా. టీచర్‌ ప్రొఫెషియన్సీ టెస్ట్‌ జాతీయ స్థాయిలో ఉంటుంది. ఏటా రాస్తుంటా. టీచర్లనూ రాయమంటా. నా దగ్గర చదివిన వారెందరో ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఇంజినీర్లయ్యారు. ఆ సంతృప్తి కోసమే ఈ కష్టమంతా!

యడ్లపాటి బసవ సురేంద్ర, విశాఖపట్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్