ప్రధాని మెచ్చిన.. బెజ్జిపురం మహిళలు!

వారంతా ఒకప్పుడు ఇల్లే ప్రపంచంగా బతికిన ఇల్లాళ్లు... చాలీ చాలని ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చిన నిరుపేద గృహిణులు. కానీ, ఇప్పుడు వారంతా స్థానికంగా దొరికే గోగునారతో, కుట్టు నైపుణ్యాలతో తమ తలరాతలే మార్చుకున్న విజయ గీతికలు.

Published : 01 Dec 2023 01:53 IST

వారంతా ఒకప్పుడు ఇల్లే ప్రపంచంగా బతికిన ఇల్లాళ్లు... చాలీ చాలని ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చిన నిరుపేద గృహిణులు. కానీ, ఇప్పుడు వారంతా స్థానికంగా దొరికే గోగునారతో, కుట్టు నైపుణ్యాలతో తమ తలరాతలే మార్చుకున్న విజయ గీతికలు. ఈ గెలుపే తాజాగా తిరుపతిలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన మన్‌కీబాత్‌ ప్రసంగంలో ప్రశంసలు అందుకునేలా చేసింది. శ్రీకాకుళం జిల్లా బెజ్జిపురం యూత్‌క్లబ్‌ గెలుపు ఇది..

‘మార్పు కావాలంటే మొదటి అడుగు మనమే వేయాలి. అదే అందరినీ అభివృద్ధి బాటలో నడిపిస్తుంది’ అని నమ్మారా ఊరి యువత. అంతే, అందరూ కలిసి మూడు దశాబ్దాల క్రితం ‘బెజ్జిపురం యూత్‌ క్లబ్‌’ పేరుతో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు. సాగు కష్టాల నుంచి కుటుంబాలను గట్టెక్కించేందుకు గృహిణులకు చేయూత నివ్వాలనుకున్నారు. ఇందుకోసం 1993లో 15 మంది మహిళలతో ఓ బృందం ఏర్పాటు చేశారు. వీరు  మరో వందమందిని చేర్చుకొని ‘గాయత్రి జ్యూట్‌ క్రాఫ్ట్‌’ పేరుతో సంఘంగా ఏర్పడ్డారు. వీరందరికీ  యూత్‌ క్లబ్‌ సభ్యులు... వివిధరకాల చేతివృత్తుల తయారీలో శిక్షణ ఇప్పించడమే కాదు... గడపదాటి బయటకు రాలేని వారికోసం ఇంటికే ముడిసరకుని తెచ్చి ఇవ్వడం, తయారైన ఆ వస్తువులను సేకరించి మార్కెటింగ్‌ చేయడం వంటి బాధ్యతలన్నీ ఈ క్లబ్‌ ప్రతినిధులే తీసుకుంటారు. మొదట్లో సంప్రదాయ శైలి ఊయలలు, చేతిసంచులు చేసేవారు. క్రమంగా ఆధునిక అవసరాలకు తగ్గట్టు ల్యాప్‌టాప్‌ బ్యాగులు, గృహోపకరణాలు, మ్యాట్‌లు లాంటి 80 రకాల వినూత్న ఉత్పత్తులను రూపొందిస్తూ శభాష్‌ అనిపించుకుంటున్నారు. దిల్లీ, ముంబయి, కోల్‌కతా, హైదరాబాద్‌, తమిళనాడు, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో జరిగే జాతీయ స్థాయి ఎగ్జిబిషన్లలో పాల్గొంటూ మన్ననలు పొందుతున్నారు. కొందరు సొంతంగా స్టోర్లను పెట్టి రాణిస్తున్నారు. విదేశాలకూ వీటిని ఎగుమతి చేస్తున్నారు.

ఆరువేలమందికి శిక్షణ..

కేవలం బెజ్జిపురం మహిళలే కాదు... ఎక్కడివారైనా ఇక్కడ శిక్షణ తీసుకోవచ్చు. వీరికి నాబార్డు, డీఆర్‌డీఏ, కేంద్ర అభివృద్ధి మంత్రిత్వశాఖలు శిక్షణ, రుణసాయం చేస్తున్నాయి. అలా రాష్ట్రవ్యాప్తంగా 6500 మంది మహిళలు శిక్షణ పొందారు. వీరిలో 150 మందికిపైగా వ్యాపారవేత్తలుగా స్థిరపడ్డారు. శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో 769 మందికి హస్తకళలు, జ్యూట్‌ క్రాఫ్ట్‌, తోలు బొమ్మల తయారీని నేర్పించారు. వేల మందికి గోగునార ఉత్పత్తుల్లో శిక్షణ ఇచ్చారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా 80 రకాల ప్రొడక్టులను తయారు చేస్తున్నారిక్కడ. సంస్థ రూ.80లక్షలకు పైగా టర్నోవర్‌నీ సాధిస్తోంది. ఈ పురోగతిని గుర్తించే తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీబాత్‌లో ప్రశంసలు కురిపించారు.

టి. చిరంజీవి, ఈనాడు జర్నలిజం పాఠశాల

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్