అణచివేతని.. ఆటాడుకున్నారు!

ఆ ఫుట్‌బాల్‌ క్లబ్‌లో అందరూ అమ్మాయిలే. దాన్ని స్థాపించి విజయపథాన నడిపిస్తున్నదీ ఓ మహిళే. పురుషాధిక్యత, ఆర్థిక సవాళ్లను దాటి యువతులను క్రీడాకారులుగా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారామె. 

Updated : 03 Dec 2023 04:22 IST

ఆ ఫుట్‌బాల్‌ క్లబ్‌లో అందరూ అమ్మాయిలే. దాన్ని స్థాపించి విజయపథాన నడిపిస్తున్నదీ ఓ మహిళే. పురుషాధిక్యత, ఆర్థిక సవాళ్లను దాటి యువతులను క్రీడాకారులుగా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారామె. ఈమె కృషిని కథలా మార్చి బుల్లితెరపైకి తీసుకొచ్చారు మీనా లాంగ్‌జామ్‌. ఈమె రూపొందించిన ‘ఆండిరో డ్రీమ్స్‌’ ముంబయి ఫెస్ట్‌లో ఇటీవల ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డును దక్కించుకున్న సందర్భంగా మీనా చెప్పిన విషయాలివి..

ఆండిరో.. మణిపుర్‌లోని ఓ మారుమూల గ్రామం. అక్కడ మూఢ నమ్మకాలతోపాటు మహిళలు ఊరుదాటి బయటకు అడుగుపెట్టకూడదనే సంప్రదాయాలు ఉన్నాయి. అలాంటి చోటు నుంచి మెరికల్లాంటి క్రీడాకారిణులతో ఓ ఫుట్‌బాల్‌ బృందం తయారైందంటే ఆశ్చర్యమేగా. ఆ అద్భుతం వెనక ఉన్న మహిళ.. లైబీ. పేదరికంలో పుట్టి పెరిగారామె. అమ్మాయిలు ఇలాంటి సంప్రదాయాల మధ్య మగ్గిపోవడం ఇష్టం లేక 22 ఏళ్ల క్రితం ‘గర్ల్స్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌’ ఏర్పాటు చేశారు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా అమ్మాయిలని ఎలా ఆడిస్తావని అందరూ హేళన చేసినా లైబీ లెక్కచేయలేదు. తనవంతు కృషి ఆపలేదు. సరైన నిధులు లేక, కనీసం క్రీడకు అవసరమయ్యే సామాన్లు లేక ఎన్నో ఇబ్బందులకు గురయ్యింది. అయినా ఆడపిల్లల్లో నిరాశ రానివ్వలేదు. ఫలితంగా ఆ గ్రామానికి చెందిన ఎందరో మహిళా క్రీడాకారిణులు తమ కలలను నెరవేర్చుకుంటున్నారు. మరెందరికో స్ఫూర్తిగానూ నిలుస్తున్నారు. ఆండిరో మహిళలు సాధించిన ఈ విజయాన్నీ, దీనివెనక ఉన్న లైబీ గురించీ తీసిన లఘుచిత్రమే ‘ఆండిరో డ్రీమ్స్‌’. ఇప్పుడు అందరి ప్రశంసలూ అందుకొంటోంది. అయితే దీన్ని చిత్రీకరించడానికి నేను కూడా ఎన్నో సవాళ్లని ఎదుర్కొన్నా. కొన్ని సందర్భాల్లో నా ప్రాణానికే ముప్పు అనిపించేటంత ఇబ్బందులొచ్చాయి. వాటన్నింటినీ దాటి అనుకున్నది సాధించానని’ చెప్పే మీనా మాస్‌ కమ్యూనికేషన్స్‌లో డాక్టరేట్‌ తీసుకొని, మణిపుర్‌ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

పురస్కారాలెన్నో..

కేరళ, కొరియా తదితరచోట్ల జరగనున్న ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లోనూ ‘ఆండిరో డ్రీమ్స్‌’ ప్రదర్శనకు అర్హత సాధించింది. ఫిల్మ్‌ మేకర్‌గా మీనా పదేళ్ల నుంచి డాక్యుమెంటరీలు రూపొందిస్తున్నారు. ఇంఫాల్‌లో మొదటి మహిళా ఆటోడ్రైవర్‌పై ఈమె చిత్రీకరించిన ‘ఆటోడ్రైవర్‌’ డాక్యుమెంటరీ పలువురి ప్రశంసలను అందుకొంది. ‘అచ్చైబీ ఇన్‌ లవ్‌’ చిత్రాన్ని 30కిపైగా జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్