అక్కడ ఆడపిల్లలు... మేకల కన్నా చులకన!

ఆడపిల్లకి అక్షరమిచ్చే ధైర్యం మరెవ్వరూ ఇవ్వలేరని బలంగా నమ్మారామె. అందుకే 24 వేల గ్రామాల్లోని 14 లక్షలమంది ఆడపిల్లలకు చదువుని చేరువ చేశారు.

Updated : 07 Dec 2023 06:56 IST

ఆడపిల్లకి అక్షరమిచ్చే ధైర్యం మరెవ్వరూ ఇవ్వలేరని బలంగా నమ్మారామె. అందుకే 24 వేల గ్రామాల్లోని 14 లక్షలమంది ఆడపిల్లలకు చదువుని చేరువ చేశారు. ఆ కృషికే మనదేశం నుంచి మొదటిసారి అంతర్జాతీయ వైజ్‌ ప్రైజ్‌ అవార్డుని అందుకోనున్నారు 52 ఏళ్ల సహీనా హుస్సేన్‌...

లక్షలమంది ఆడపిల్లల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చిన సహీనా ఆ దిశగా అడుగులు వేయడానికి కారణం తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలే. దిల్లీలో సంపన్న కుటుంబంలో పుట్టారీమె. తండ్రి యూసఫ్‌ హుస్సేన్‌ నటుడు. తల్లి గృహిణి. కానీ వాళ్లిద్దరూ విడిపోవడం... ఆ తర్వాత సవతి తండ్రి వేధింపులు ఆమె జీవితాన్ని నరకంలా మార్చాయి. చివరికి కాలేజీలో చదువుకోవాల్సిన సమయంలో ఇల్లొదిలి ఆశ్రమానికి పారిపోయారు. అదృష్టవశాత్తు ఓ బంధువులావిడ సాయంతో సహీనా లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో డిగ్రీ చేశారు. ఆ తర్వాత హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్లోనూ చదువుకున్నారు.

వాటికన్నా లోకువ..

లండన్‌ నుంచి ఇండియాకు వచ్చాక.. ఇక్కడి ఆడపిల్లల జీవితాల్లో మార్పు తీసుకురావాలనుకున్నారు సహీనా. ‘1995లో చైల్డ్‌, ఫ్యామిలీ హెల్త్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలో పదేళ్లు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేశా. ఆ సమయంలోనే ఆఫ్రికాతోపాటు మనదేశంలోని అనేక గ్రామాలు తిరిగా. గ్రామీణ ప్రాంతాల్లోని ఆడపిల్లల జీవితాలని చూశాక వాళ్ల జీవితాల్లో మార్పు అవసరమనిపించింది. రాజస్థాన్‌ నుంచి నా ఆశయానికి శ్రీకారం చుట్టా. 2007లో బాలికా విద్యకోసం ‘ఎడ్యుకేట్‌ గర్ల్స్‌’ అనే ఎన్జీవోని స్థాపించి.. గ్రామాల్లో ఇంటింటికీ తిరిగాను. అక్కడ ఆడపిల్లలను తల్లిదండ్రులు అప్పుగా భావించేవారు. వాళ్లు పెంచుకొనే మేకలకిచ్చే విలువని కూడా.. కడుపున పుట్టిన ఆడపిల్లలకు ఇచ్చేవారు కాదు. అత్తారింటికి వెళ్లే పిల్లకు చదువెందుకనేవారు. బడిలో చేర్పించినా.. మధ్యలోనే మాన్పించి పెళ్లి చేసేవారు. డ్రాపవుట్స్‌ సంఖ్య పెరగడానికీ, బాలికలకు చదువు దూరం కావడానికి పేదరికమే కాదు, బలమైన పితృస్వామ్యం కూడా కారణమే’నంటారు సహీనా

పిచ్చికుక్కలనేవారు..

ఏ ఆడపిల్లలకైతే చదువునందించాలని సహీనా తపన పడ్డారో.. వారిలోనే విద్యపై అయిష్టత కనిపించేది. బడికి రావడానికి ఇష్టపడేవారు కాదు. ఇక వాళ్ల కుటుంబాల సంగతి సరేసరి. ఎన్ని సమస్యలు ఎదురైనా వెనకడుగు వేయలేదామె. ‘పుస్తకం చేత పట్టాల్సిన వయసులో అత్తింటి ఆరళ్లకు గురయ్యేవారు. మొదట అటువంటి వారందరినీ గుర్తించి, అవగాహన కలిగించడానికీ¨, తల్లిదండ్రులను ఒప్పించడానికీ నేను, మా సంస్థ వలంటీర్లు ఎక్కని గడప లేదు. అలా వెళ్లినప్పుడు మమ్మల్ని పిచ్చి కుక్కలంటూ తిట్టి, ముఖంమీదే తలుపులేసేవారు. చదువుకు సిద్ధమైన బాలికలను వలంటీర్లుగా నియమించి మిగతావారికి అవగాహన కలిగించేలా చేసేదాన్ని. నా కష్టం వృథా కాలేదు. క్రమంగా బడికొచ్చే బాలికల సంఖ్య పెరిగింది. డ్రాప్‌అవుట్స్‌ తగ్గారు. అలాగే స్కూల్‌కొచ్చే పిల్లలకు నాణ్యమైన విద్య, సౌకర్యాలు అందేలా చూసేవాళ్లం. అలా మధ్యప్రదేశ్‌, బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లోని మొత్తం 24 వేల గ్రామాల్లో ఈ సేవలు విస్తరించాం. 2021లో రాజస్థాన్‌ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని బాలికల చదువు, సాధికారత కోసం కలిసి పనిచేస్తున్నాం. ప్రస్తుతం మా ఎన్జీవోలో 18వేల బాలికా వలంటీర్లు ఉన్నారు. మేమంతా కలిసి 14 లక్షలమందికిపైగా ఆడపిల్లలకు చదువుని చేరువ చేశాం’ అని చెబుతున్న సహీనా కృషికి ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక ‘వైజ్‌ ప్రైజ్‌’ అవార్డు అందింది. దోహాలో త్వరలో జరగనున్న డబ్ల్యూఐఎస్‌ఈ సమావేశంలో అవార్డుతోపాటు రూ.4 కోట్ల నగదు బహుమతిని అందుకోనున్నారు. గతంలో నీతి ఆయోగ్‌ నుంచి ‘ఉమెన్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా’ వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులెన్నో అందుకున్నారు సహీనా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్