నాన్నలా చనిపోకూడదని...

అత్తారింట్లో ఇష్టం లేకపోయినా సేంద్రియ వ్యవసాయంలో ప్రయోగాలు చేసింది రుబీపారిక్‌. నష్టమే మిగిలింది.. అలాగని వెనక్కి తగ్గలేదు. ఈసారి ఆమె వేసిన అడుగు.. నాబార్డ్‌ని మెప్పించింది. అజొల్లా, వర్మికంపోస్ట్‌ తయారీలో వ్యాపారవేత్తగా ఎదిగేలా చేసింది.

Updated : 13 Dec 2023 03:22 IST

అత్తారింట్లో ఇష్టం లేకపోయినా సేంద్రియ వ్యవసాయంలో ప్రయోగాలు చేసింది రుబీపారిక్‌. నష్టమే మిగిలింది.. అలాగని వెనక్కి తగ్గలేదు. ఈసారి ఆమె వేసిన అడుగు.. నాబార్డ్‌ని మెప్పించింది. అజొల్లా, వర్మికంపోస్ట్‌ తయారీలో వ్యాపారవేత్తగా ఎదిగేలా చేసింది..

రుబీ స్వస్థలం రాజస్థాన్‌. తను ఏడాది పాపగా ఉన్నప్పుడే తండ్రి క్యాన్సర్‌తో చనిపోయాడు. ‘మేం ఐదుగురం. మమ్మల్ని పెంచడానికి అమ్మ చాలా కష్టపడింది. ఉన్నదంతా నాన్న వైద్యానికే అయిపోయింది. డబ్బులేక పదో తరగతి తర్వాత చదువు ఆపేశా. 20 ఏళ్లకే ప్రకాష్‌ పారిక్‌తో పెళ్లైంది. మాది సంప్రదాయ కుటుంబం. కృషి విజ్ఞాన కేంద్రం వాళ్లు మా పంట పొలంలో వ్యవసాయ పాఠాలు చెప్పకుండా ఉంటే నేను ఇంటికే పరిమితం అయ్యేదాన్ని. కానీ వాళ్లు నేర్పిన సేంద్రియ వ్యవసాయ పాఠం నా జీవితాన్నే మార్చేసింది. రసాయనాలు వాడకుండా పంటల్ని లాభసాటిగా పండించడం ఎలానో చెప్పారు. మాకున్న భూమిలో సేంద్రియ సాగు చేస్తా అంటే ఇంట్లో నవ్వారు. ‘అది మగవాళ్ల పని. నీ వల్ల ఏం అవుతుం’దని వెక్కిరించారు. ఒక్క మావారు తప్ప అందరూ అదే మాట. ఎలా అయితేనేం మా మామగారిని ఒప్పించి ఎకరం భూమిలో గోధుమ, ఆవాల పంట వేశా. మెలకువలు తెలీక నష్టాలే వచ్చాయి. దాంతో ఇంట్లోవాళ్లు మేం ముందే చెప్పాంగా అన్నట్టు చూశారు’ అంటూ వ్యవసాయంలో తన తొలినాటి అనుభవాన్ని చెప్పింది రుబీ.  

తక్కువ ఖర్చుతో ..

‘పురుగు మందుల వాడకం వల్లే నాన్నకి క్యాన్సర్‌ వచ్చిందనిపించింది. అందుకే సేంద్రియ వ్యవసాయంపై పట్టు సాధించాలని ఆవుపేడ, జీవామృతంతో నేలని సారవంతం చేయడం నేర్చుకున్నా. నాలుగేళ్ల తర్వాత ఆశించిన రీతిలో దిగుబడులు వచ్చాయి. నాబార్డ్‌ నా కృషిని గుర్తించింది. 50 శాతం రాయితీకి వర్మీకంపోస్ట్‌ యూనిట్‌ని ప్రారంభించుకొనే అవకాశం ఇచ్చింది.

మొదట్లో నీకు చేతకాదు అన్నవాళ్లే తర్వాత నా సేంద్రియ విధానం నేర్చుకోవడానికి క్యూ కట్టారు. ఇప్పటివరకూ 15,000 మంది శిక్షణ తీసుకుని వ్యవసాయం బాట పట్టా’రంటారీమె. ఎకరంతో మొదలుపెట్టిన రుబీ ప్రస్తుతం 26 ఎకరాల్లో సాగు చేస్తోంది. అలాగే సేంద్రియ ఎరువుగా వాడే వర్మీకంపోస్ట్‌, అజొల్లా రకం నాచుని తయారుచేసి వాటిని రైతులకు సరఫరా చేస్తోంది. ‘నాన్నలా మరెవరూ చనిపోకూడదనే ఈ వ్యవసాయం చేస్తున్నా’ అనే రుబీ నాబార్డ్‌ అవార్డుతోపాటు తాజాగా ఇంటర్నేషనల్‌ కాంటెన్సి సెంటర్‌ ఆఫ్‌ ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌ అవార్డునూ అందుకొంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్