వీళ్లు... పెద్ద పోరాటమే చేశారు!

క్యాన్సర్‌... ఆ పేరు వింటేనే కళ్లల్లో భయం, మాటల్లో వణుకు, గుండెల్లో దడ... మృత్యువు వెంటాడుతున్నట్లే అనిపిస్తుంది. అలాంటిది... ఆ రక్కసి కోరల్లో చిక్కుకున్నా... ధైర్యంగా ఎదుర్కొని... దాన్ని జయించడమే కాదు, ఆ పోరాటాన్ని చెబుతూ మరింత మందికి అవగాహన కల్పిస్తున్నారు... ఈ సెలెబ్రిటీలు. వీళ్ల గెలుపు కథలివీ..!

Updated : 04 Feb 2024 10:18 IST

నేడు ప్రపంచ క్యాన్సర్‌ నివారణ దినోత్సవం

క్యాన్సర్‌... ఆ పేరు వింటేనే కళ్లల్లో భయం, మాటల్లో వణుకు, గుండెల్లో దడ... మృత్యువు వెంటాడుతున్నట్లే అనిపిస్తుంది. అలాంటిది... ఆ రక్కసి కోరల్లో చిక్కుకున్నా... ధైర్యంగా ఎదుర్కొని... దాన్ని జయించడమే కాదు, ఆ పోరాటాన్ని చెబుతూ మరింత మందికి అవగాహన కల్పిస్తున్నారు... ఈ సెలెబ్రిటీలు. వీళ్ల గెలుపు కథలివీ..!


బాధితురాల్ని కావాలనుకోలేదు

- హంసానందిని

‘సంతోషాల్ని ఎంత ఆనందంగా స్వీకరిస్తామో, కష్టాలను దాటేయడానికి అంతే సానుకూలత ప్రదర్శించాలి. అప్పుడే ప్రతికూల పరిస్థితుల్నీ ధైర్యంగా ఎదుర్కోగలం’ అంటోంది టాలీవుడ్‌ నటి హంసానందిని. తాను రొమ్ముక్యాన్సర్‌ బారి నుంచి ఎలా బయటపడిందీ చెబుతోందిలా...

‘చిన్న జ్వరం వస్తేనే...వణికిపోతాం. అలాంటిది ప్రాణాంతకమైన క్యాన్సర్‌ అని తెలిస్తే? నాకైతే ప్రపంచమే చీకటిగా మారిపోయింది.  ఎన్నో భయాలు...ఆందోళన, ఏ పనీ చేయలేని ఒత్తిడి చుట్టుముట్టేశాయి. పద్దెనిమిదేళ్ల క్రితం మా అమ్మ కూడా ఈ మహమ్మారితో పోరాడి ఓడిపోయింది. ఆ గాయం తాలూకు చేదు జ్ఞాపకాలు ఇంకా నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఈలోగా 2020లో రొమ్ములో గడ్డ వస్తే పరీక్ష చేయించా. గ్రేడ్‌ 3 ‘కార్సినోమా’ అన్నారు వైద్యులు. మొదట షాకయ్యా. క్రమంగా నాకు నేనే ధైర్యం చెప్పుకొని ఎలాగైనా దాంతో పోరాడాలనుకున్నా. చికిత్స మొదలయ్యాక భరించలేని నొప్పులు, జుట్టంతా రాలిపోయింది. ఈ బాధలన్నీ పంటి బిగువునే భరించా. ఇలా తొమ్మిది కీమో థెరపీలూ, సర్జరీ పూర్తవడంతో ‘హమ్మయ్య.. బతికి బయటపడ్డా’ అని ఊపిరి పీల్చుకున్నానో లేదో ఆ వెంటనే ఇంకో పిడుగు పడింది. భవిష్యత్తులో మరో రొమ్ముకి కూడా క్యాన్సర్‌ సోకే ప్రమాదం 70 శాతం ఉందనీ, అది వంశపారంపర్యంగా వచ్చేది కాబట్టి మరికొన్ని చికిత్సలు అవసరమనీ చెప్పారు. దాంతో మళ్లీ 7 కీమోలు, శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఈ దశల్ని దాటడం అంత సులువైన విషయమేమీ కాదు. జీవితం నాకు ఎన్ని సవాళ్లు విసిరినా, అది నా పట్ల ఎంత కఠినంగా వ్యవహరించినా.. నేను దానికి బాధితురాలిని కాదల్చుకోలేదు. ధైర్యంతో ఈ గడ్డు దశను దాటి,  చావుని జయించి మరెందరికో స్ఫూర్తిగా నిలవాలనుకున్నా. అందుకే తెరపై మళ్లీ కనిపించాలనుకున్నా. జీవితంలో ప్రతి నిమిషాన్నీ ఆస్వాదిస్తూ, ఇదే చివరి నిమిషం అనుకుంటూ... బతికేస్తే చాలని నిర్ణయించుకున్నా. క్యాన్సర్‌ వంశచరిత్రలో ఉన్నా లేకున్నా, తరచూ నిర్ధరణ పరీక్షలు చేయించుకోవడం వల్ల ప్రాణాపాయాన్ని తప్పించుకోవచ్చు. క్యాన్సర్‌ బాధితులకు అవగాహన, చికిత్సకు సాయం అందించే లక్ష్యంతో అమ్మ పేరున యామినీ ‘క్యాన్సర్‌’ ఫౌండేషన్‌’ను ప్రారంభించనున్నా’ అంటుందీమె.


జీవితాన్ని కొత్తగా చూస్తున్నా

- మనీషా కోయిరాలా

ఉత్తరాది, దక్షిణాది చిత్రసీమల్లో మెరిసి, ‘దివా’ అనిపించుకుంది మనీషా కోయిరాలా. కెరియర్‌లో దూసుకెళుతున్న సమయంలో ఒవేరియన్‌ క్యాన్సర్‌ బారిన పడ్డ ఆమె అదే అందమైన చిరునవ్వుతో తిరిగొచ్చింది.

‘‘నాలాంటి సీరియస్‌ కేస్‌ని ఇంతకుముందు డీల్‌ చేశారా?’ క్యాన్సర్‌ చికిత్స కోసం అమెరికా వెళ్లాక డాక్టర్‌ని అడిగిన ఏకైక ప్రశ్న ఇది. ఆయన అవును అన్నాకే నాకూ బతుకుతానన్న ఆశ చిగురించింది. అందరిలాగే క్యాన్సర్‌ అనగానే నేనూ చనిపోవడం ఖాయం అనుకున్నా. పైగా నాది అడ్వాన్స్‌డ్‌ దశ. చివరి రోజుల్లో ఉన్నా అనుకున్నాక జీవితాన్ని వృథా చేశా అనిపించింది. పదో తరగతి పూర్తయిందో లేదో రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టా. మోడలింగ్‌, సినిమాలు అన్నిచోట్లా విజయాలే. ఈరోజు అమెరికాలో ఉంటే రేపు మరోచోట. విరామమే లేకుండా పరుగులు తీశా. అప్పుడు నన్ను నేను సంతోషంగా ఉంచుకోవడానికి నాకు కనిపించిన దారి ‘ఆల్కహాల్‌’. దాని కారణంగా అయినవాళ్లు దూరమయ్యారు. అపజయాలు పలకరించాయి. అయినా నేను మారలేదు. దీనికితోడు వైవాహిక జీవితమూ విఫలమైంది. ఐవీఎఫ్‌, ఒంటరి జీవితం... అప్పటికీ నా శరీరం చిన్న చిన్న సూచనలు ఇస్తూనే ఉంది. నేనే పట్టించుకోలేదు. క్యాన్సర్‌ బయటపడ్డాక అందరికీ వీడ్కోలు కూడా పలికా. చివరి ప్రయత్నంగా అమెరికా వచ్చా. ఎంత ధైర్యంగా ఉన్నా వరుస కీమోథెరపీలు, మారిన రూపం, నొప్పి భరించలేక ‘చనిపోవడమే మేల’ని ఏడ్చేసేదాన్ని. ఆ సమయంలో నన్ను నడిపింది చిన్న చిన్న ఆనందాలే. సూర్యోదయం, పచ్చికపై చేరిన నీటి బిందువూ లాంటివీ నాలో ఉత్సాహాన్ని నింపాయంటే నమ్ముతారా? వాటన్నింటినీ పుస్తకంలో రాసుకున్నా కూడా. జీవితాన్ని ప్రేమించడం నేర్పిన దశ అది. అందుకే క్యాన్సర్‌ నుంచి బయటపడ్డాక వీటికి విలువనిస్తున్నా. కెరియర్‌ని మళ్లీ ఇష్టంగా ప్రారంభించా. జీవితాన్ని కొత్తగా ఆస్వాదిస్తున్నా. ఆరోగ్యానికి విలువివ్వండి, పోరాడకుండా ఓటమిని ఒప్పుకోవద్దు... ఈ తరానికి నా సలహా ఇది’.


ఇప్పుడిది మరోజన్మ

- తాహిరా కశ్యప్‌

రచయిత్రి, ప్రొఫెసర్‌, లఘచిత్రాల డైరెక్టర్‌గా... ఇద్దరు పిల్లల బాగోగులతో క్షణం తీరిక లేని జీవితం గడుపుతోంది 35 ఏళ్ల తాహిరా కశ్యప్‌. అలాంటి సమయంలో... డాక్టర్‌ చెప్పిన ఓ చేదు మాట ఏడాదిపాటు ఆమె ప్రపంచాన్ని తలకిందులు చేసింది. ఆ తర్వాత...? ఆ మౌనాన్ని బద్దలుకొట్టాలనే నిర్ణయానికొచ్చింది తాహిరా. తనకి క్షీర నాళాల్లో క్యాన్సర్‌. అంటే, ఒక రకం రొమ్ముక్యాన్సర్‌. దీనిపై తను పోరాడుతూ తోటి మహిళల్లో అవగాహన తీసుకురావాలనుకుంది. ఆ సమయంలో ఆమె భర్త, ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ఆయుష్మాన్‌ ఖురానా తనకు అండగా నిలిచాడు. ఇద్దరూ హైస్కూల్‌ నుంచీ స్నేహితులు. ఆమె కథ రాస్తే, అతను తెరపై నటించేవాడు. ఆమె డైరెక్టరైతే అతను హీరో అయ్యాడు. ‘కష్టకాలంలో తను నాకు తోడుగా ఉన్నట్టే... ఇప్పుడు నేను తోడుగా ఉండాలనుకుంటున్నా’ అంటూ ఓ పాడ్‌కాస్ట్‌లో చెప్పుకొచ్చాడు ఆయుష్మాన్‌. ఇక తాహిరా... ‘స్టేజ్‌ జీరోలో ఉండగా నాలో క్యాన్సర్‌ ఉనికి బయటపడింది. క్యాన్సర్‌ విస్తరించడానికి ముందు దశ ఇది. చికిత్సలో భాగంగా కుడిరొమ్ముని తొలగించారు. ఈ క్రమంలో... మహాయాన బౌద్ధంలోని ‘నిచిరెన్‌’ విధానాలు నాకు దీనిపై పోరాడే శక్తినిచ్చాయి. నా వ్యాపకాలు ఎటూ ఉన్నాయి. నెమ్మదిగా కోలుకున్నా. ఇప్పుడు నాకు 39 ఏళ్లు. గతంలో కంటే ఎక్కువగా నన్ను నేను ప్రేమించుకుంటున్నా, శక్తిమంతంగా మారా. నాకిది 2.0 అనుకోండి! ఓ సినిమాకి దర్శకత్వం వహించా, మరిన్ని పుస్తకాలు రాస్తున్నా. మన శరీరంలోని మార్పులని గమనించుకోవాలి. అనుమానం వస్తే పరీక్షలు చేయించుకోండి. ఇంతకు మించి ముందు జాగ్రత్త మరొకటి లేదు’ అంటోంది తాహిరా.


వాడి ఆశే... బతికించింది

-  సోనాలీ బెంద్రే

‘జీవితంలో అక్కర్లేని ఎన్నో విషయాల వెనక పరుగులు పెడతాం. కానీ మన ఆరోగ్యం అన్నింటికంటే ముఖ్యమని అప్పుడు తెలుసుకోలేం’ అంటూ స్టేజ్‌ 4 దశలోని  (మెటాస్టాటిక్‌) క్యాన్సర్‌ని తన సంకల్ప బలంతో జయించిన తీరుని వివరించింది నటి సోనాలీ బెంద్రే..

‘స్టేజ్‌4... బతకడానికి 30 శాతమే ఛాన్స్‌ ఉందని డాక్టర్లు అన్నప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. పైగా క్యాన్సర్‌ అని టైప్‌ చేస్తే ఇంటర్‌నెట్‌లో బోలెడు సమాచారం. అందులో ఏది, ఎంతవరకూ వాస్తవమో తెలియదు. ఇవన్నీ నా పన్నెండేళ్ల కొడుకు చదివి ఎక్కడ బాధపడతాడో అన్న భయం నన్ను అన్నింటి కంటే ఎక్కువగా వేధించేది. వాడి కళ్లలో నాపై పెట్టుకున్న ఆశే నన్ను బతికించింది. అత్యాధునిక వైద్య విధానాలూ, నా కుటుంబ సభ్యుల సహకారం నా సంకల్పానికి తోడుగా నిలిచాయి. చికిత్సలో భాగంగా సర్జరీ చేశారు. ‘24 గంటల్లో నువ్వు నడిచి... ఆస్పత్రి నుంచి బయటపడాలి’ అన్నారు వైద్యులు. ఎందుకంటే అక్కడ ఎక్కువ సేపు ఉంటే ఇన్‌ఫెక్షన్లు సోకుతాయి. అది నాకు ప్రాణాంతకం కాబట్టి. కానీ అది అంత తేలిక కాదు. 24 అంగుళాల కోత పెట్టారు. ఎలా నడవాలి? ఐవీని చేతికి  తగిలించుకుని అలాగే నడిచాను. ఆ తర్వాతి రోజుల్లో ఫిట్‌నెస్‌పై పెట్టిన శ్రద్ధా నన్ను బతికించింది. చరిత్ర గురించి చెప్పడానికి బీసీ ఏసీ అంటాం కదా! నా విషయంలో బీసీ, ఏసీ అంటే బిఫోర్‌ క్యాన్సర్‌.. ఆఫ్టర్‌ క్యాన్సర్‌ అని. నా శరీరంపై ఉన్న కత్తిగాటుని చూసినప్పుడల్లా క్యాన్సర్‌తో నేను చేసిన పోరాటమే గుర్తుకొస్తుంది. అయితే క్యాన్సర్‌ తగ్గిపోతే దాన్ని జయించినట్టు కాదు. ఆరోగ్యకరమైన జీవనశైలిని జీవితాంతం అనుసరించాలి’ అనే సోనాలి ప్రస్తుతం టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. ఒక వర్చువల్‌ బుక్‌ క్లబ్‌నీ నడుపుతోంది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్