అమ్మ షివోన్‌... నాన్న మస్క్‌!

మనిషి మెదడులో చిప్‌ని ఉంచి, తద్వారా పక్షవాతం వంటి సమస్యలకు పరిష్కారం కనిపెట్టే దిశగా పరిశోధనలు చేస్తోంది ఎలాన్‌మస్క్‌ ప్రారంభించిన న్యూరాలింక్‌ సంస్థ. ఈ సంస్థ స్పెషల్‌ ప్రాజెక్ట్స్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న అమ్మాయి పేరు షివోన్‌ జిలిస్‌.

Published : 28 Feb 2024 14:20 IST

మనిషి మెదడులో చిప్‌ని ఉంచి, తద్వారా పక్షవాతం వంటి సమస్యలకు పరిష్కారం కనిపెట్టే దిశగా పరిశోధనలు చేస్తోంది ఎలాన్‌మస్క్‌ ప్రారంభించిన న్యూరాలింక్‌ సంస్థ. ఈ సంస్థ స్పెషల్‌ ప్రాజెక్ట్స్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న అమ్మాయి పేరు షివోన్‌ జిలిస్‌. ఆమె ఇద్దరు పిల్లల్లో ఒకరి పేరు స్ట్రైడర్‌ చంద్రశేఖర్‌ జిలిస్‌ మస్క్‌. వినడానికి ఆసక్తిగా ఉంది కదా! ఇంగ్లిష్‌ పేర్లమధ్యలోకి ఈ చంద్రశేఖర్‌ పేరు ఎందుకొచ్చినట్టు?

కెనడాలో వెంచర్‌ క్యాపిటలిస్ట్‌గా రాణించి... తరవాత కృత్రిమమేధ నిపుణురాలిగా పేరుతెచ్చుకున్న షివోన్‌ పుట్టి, పెరిగిందంతా కెనడాలో. ఆమె తండ్రి రిచర్డ్‌ జిలిస్‌ మాజీ ప్రభుత్వోద్యోగి. తల్లి శారద, పంజాబీ. యేల్‌ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌ అండ్‌ ఫిలాసఫీలో డిగ్రీ తీసుకుంది షివోన్‌. ఆటలంటే పిచ్చి. ఐస్‌ హాకీ గోల్‌కీపర్‌గా ఆమె నెలకొల్పిన రికార్డుని యేల్‌ యూనివర్సిటీ ఇప్పటికీ భద్రంగా దాచుకుంది. గిటార్‌ అండ్‌ డ్రమ్స్‌లోనూ ఆమెది ప్రత్యేక శైలి. గిటారిస్ట్‌గా కెనడాలో ఆమె సెలబ్రిటీ హోదాను అందుకుంది. ఆ తరవాత బ్లూమ్‌బెర్గ్‌ బెటా ఇన్వెస్ట్‌మెంట్స్‌ సంస్థని స్థాపించి నవతరం సంస్థల్లో పెట్టుబడులు పెడుతూ వెంచర్‌ క్యాపిటలిస్ట్‌గా రాణించింది. 2015లో ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30 జాబితాలో చేరింది. ఇండోనేషియా, పెరూ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఫైనాన్షియల్‌ టెక్నాలజీ సంస్థలను స్థాపించింది. యూనివర్సిటీ ఆఫ్‌ టొరంటో వేదికగా... ఏటా సాంకేతిక పరిజ్ఞానం, సాహిత్యంపై పనిచేసేవారికి సమావేశం నిర్వహించి పెట్టుబడులు అందేట్టు చూస్తుంది. ఈ క్రమంలోనే రచయిత రేకర్జ్‌ వెయిల్స్‌ రాసిన ‘ఏజ్‌ ఆఫ్‌ స్పిరిచ్యువల్‌ మెషిన్స్‌’ అనే పుస్తకం చదివి కృత్రిమ మేధపై ఇష్టాన్ని పెంచుకుంది షివోన్‌. ఆ తర్వాత ‘టెస్లా’ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గానూ బాధ్యతలు తీసుకుంది. ఓపెన్‌ ఏఐ సంస్థలో కొంతకాలం సభ్యురాలిగా ఉంది. ఆ తర్వాతే న్యూరో టెక్నాలజీ సంస్థ... న్యూరాలింక్‌లో టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ హోదాకు చేరుకుంది. ఈ సంస్థ స్పెషల్‌ ప్రాజెక్ట్స్‌కీ ఆమే డైరెక్టర్‌. అయితే 2021లో ఐవీఎఫ్‌ పద్ధతిలో షివోన్‌, ఎలాన్‌మస్క్‌లకు కవలలు పుట్టారంటూ ప్రపంచవ్యాప్తంగా వార్తలొచ్చాయి. దాని గురించి స్పందించకపోయినా మస్క్‌, షివోన్‌లు పిల్లల పేర్ల చివర ఇద్దరి పేర్లూ ఉండేట్టు కోర్టు అనుమతి తీసుకున్నారు. ఎలాన్‌మస్క్‌ జీవిత చరిత్ర రాసిన వాల్టర్‌... తల్లిదండ్రుల అనుమతితో ఆ పిల్లల పేర్లు వెల్లడి చేశాడు. అబ్బాయి పేరు స్ట్రైడర్‌ చంద్రశేఖర్‌ జిలిస్‌ మస్క్‌, అమ్మాయి పేరు అజుర్‌ జిలిస్‌మస్క్‌గా చెప్పాడు. ఎలాన్‌మస్క్‌ భారత్‌కి వచ్చినప్పుడు ఓ సందర్భంలో... ‘మా అబ్బాయికి భారతీయ భౌతిక శాస్త్రవేత్త ఎస్‌. చంద్రశేఖర్‌ పేరు పెట్టాం’ అని చెప్పుకొచ్చాడు. అయితే షివోన్‌ని మస్క్‌ వివాహం చేసుకోలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్