ఏడుగురు ప్రధానులకు... రక్షణ బాధ్యత తీసుకున్నా!

దేశ ప్రధాని భద్రతా బాధ్యత అంటే మాటలా? అలాంటిది ఏడుగురు భారత ప్రధానుల రక్షణ బాధ్యతను భుజాలకెత్తుకున్నారామె. ఆ ధైర్యానికి కొనసాగింపుగా అన్నట్టు తోటి మహిళల్లో డిప్రెషన్‌ సమస్యల్ని  దూరం చేస్తూ... ‘గ్రిఫ్‌ కోచ్‌’గా మారారు అపరాజిత రామద్యాని..!

Updated : 17 Mar 2024 07:12 IST

దేశ ప్రధాని భద్రతా బాధ్యత అంటే మాటలా? అలాంటిది ఏడుగురు భారత ప్రధానుల రక్షణ బాధ్యతను భుజాలకెత్తుకున్నారామె. ఆ ధైర్యానికి కొనసాగింపుగా అన్నట్టు తోటి మహిళల్లో డిప్రెషన్‌ సమస్యల్ని  దూరం చేస్తూ... ‘గ్రిఫ్‌ కోచ్‌’గా మారారు అపరాజిత రామద్యాని..!

భారత ప్రధాని ఎక్కడికెళ్లినా వారి పక్కనే కోటూ, సూటూ, చేతిలో పిస్టల్‌, నల్లటి కళ్లద్దాలు ధరించిన కొందరు... ప్రధాని వెంటే ఉండటం గమనించారా? వీళ్లే ఎస్‌పీజీ (స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌) బృందం. స్వదేశంలోనూ, విదేశంలోనూ ప్రధాని ఎక్కడున్నా.. 24గంటలూ కట్టుదిట్టమైన భద్రతనిచ్చేది ఈ అధికారులే. అయితే ఇలా రక్షణ ఇవ్వడం అంత తేలికైన వ్యవహారం కాదు. యూఎస్‌ సీక్రెట్‌ సర్వీస్‌కు దీటుగా ఈ ఎస్‌పీజీ బృందానికి కఠినమైన శిక్షణ ఇస్తారు. అలాంటి శిక్షణ తీసుకుని ఏడుగురు ప్రధానులకు రక్షణగా నిలిచా. సీఆర్‌పీఎఫ్‌ భద్రతా దళంలో మొదటి మహిళా డీఎస్పీగా, ఆసియా మహిళా ఫోర్స్‌లో మొదటి కమాండెంట్‌గా పనిచేశా. నేను పుట్టి, పెరిగిందంతా చెన్నైలోని టీనగర్‌లో. చిన్నప్పట్నుంచీ ఖాకీ యూనిఫామ్‌ ధరించాలన్నది నా కల. అందుకు కారణం మా నాన్న శ్రీనివాసన్‌ పోలీస్‌శాఖలో ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ అధికారిగా పనిచేశారు. మిలిటరీ ఇంజినీర్‌ కూడా. ఆయన నన్ను మగపిల్లాడిలా పెంచారు. దాంతో ఆటలపైనా ఇష్టం పెంచుకుని అథ్లెట్‌గా జాతీయ స్థాయిలో రాణించా. పెళ్లి తర్వాతే బీఏ ఇంగ్లిష్‌, మద్రాసు యూనివర్సిటీలో ఎంఏ క్రిమినాలజీ పూర్తిచేశా. ఆపై యూజీసీ స్కాలర్‌షిప్‌ సాయంతో పీహెచ్‌డీ పూర్తి చేశా. ఆ సమయంలో సీఆర్‌పీఎఫ్‌లోకి మహిళల్ని తీసుకుంటున్నారని తెలిసి దరఖాస్తు చేసుకున్నా. ఇంటర్వ్యూలో నాకు పెళ్లైందనీ, బాబు ఉన్నాడనీ తెలిసి ఎంపిక చేయడానికి ఆలోచించారు. పెళ్లే మీకు ఆటంకం అనుకుంటే... దేశం కోసం, కుటుంబాన్ని కూడా వదిలేస్తా అన్నా. దాంతో అధికారుల మనసు మారి నన్ను ఎంపిక చేసుకున్నారు. బాబుని మావారి దగ్గర వదిలి రాజస్థాన్‌లో జరిగే ట్రైనింగ్‌కు వెళ్లా. ఖాకీ పట్ల ఉన్న ప్రేమతో రన్నింగ్‌, రైఫిల్‌,  మౌంట్‌ క్లైంబింగ్‌ అన్నింట్లోనూ నా సత్తా నిరూపించుకున్నా. 13నెలల ట్రైనింగ్‌ తర్వాత దిల్లీలో ఉద్యోగం వచ్చింది. అక్కడే మాకు రెండో బాబు పుట్టాడు. వాడు పుట్టిన మూడునెలలకే మసీదు కూల్చివేత ఘటనలో అయోధ్యకు బయలుదేరా. 

ప్రధాని రక్షణలో తొలిసారి... 

ప్రధానికి రక్షణ కల్పించే ఎస్‌పీజీ బృందంలోకి తొలిసారి మహిళలను ఎంపిక చేశారు. దానికోసం నాలుగు నెలలపాటు దిల్లీలో శిక్షణ తీసుకున్నా. అంతకు ముందు నేనందుకున్న ట్రైనింగ్‌తో పోలిస్తే ఇది పదింతలు కఠినంగా అనిపించింది. విశ్రాంతి ఉండదు. నిద్రపోనివ్వరు... ఆహారం పెట్టరు... ఎలాంటి గడ్డు పరిస్థితులనైనా తట్టుకొని నిలబడే సామర్థ్యం ఉందా అని ఇలా పరీక్షిస్తారు. ఎనిమిదిగంటలపాటు మరో ఆలోచన లేకుండా పనిచేయాలి. సాధారణంగా ఐదేళ్లు మాత్రమే ఇక్కడ విధులు నిర్వహించే అవకాశం ఇస్తారు. నేను మాత్రం 1993 నుంచి 2001 వరకు తొమ్మిదేళ్లపాటు ఎస్‌పీజీ అధికారిగా పనిచేశా. ఎస్‌పీజీలో అసిస్టెంట్‌ ఇన్స్‌స్పెక్టర్‌ జనరల్‌ (ఏఐజీ) పదవి అందుకున్నా. మాజీ ప్రధాని వీపీ సింగ్‌తో మొదలుపెట్టి.... చంద్రశేఖర్‌, పీవీ, అటల్‌ బిహారీ వాజ్‌పేయ్‌(రెండుసార్లు), దేవెగౌడ, ఐకే గుజ్రాల్‌ ఇలా ఏడుగురు ప్రధానులకు భద్రతా విధులు నిర్వహించా. 2004లో మావారు అనారోగ్యంతో చనిపోయారు. ఆ సమయంలో నేను అమర్‌నాథ్‌లో రక్షణ విధుల్లో ఉన్నా. వెయ్యిమంది మహిళా సైన్యం నిర్వహణ బాధ్యత నాది. దాంతో గుండె నిబ్బరం చేసుకుని నాలుగోరోజే విధుల్లో చేరా. 2008లో డీఐజీగా పదోన్నతి దక్కింది. పిల్లలపై దృష్టి పెట్టాలని 21 ఏళ్ల సర్వీస్‌ని వదిలి వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్నా. పిల్లలిద్దరికీ పెళ్లిళ్లై దిల్లీలో స్థిరపడ్డారు. ఒంటరి మహిళలు, ఉద్యోగినులూ చీటికీమాటికీ డిప్రెషన్‌లోకి జారుకోవడం గమనించా. అందుకే వాళ్లలో ధైర్యం నూరిపోయాలని గ్రిఫ్‌ కోచ్‌గా మారి వారికి కౌన్సెలింగ్‌ ఇస్తున్నా. మావారు చనిపోవడానికి ముందు నాకో కుక్కని బహుమతిగా ఇచ్చారు. అది చూపించిన ప్రేమ వల్ల.. వీధికుక్కలని చేరదీసి ఆశ్రయమిస్తున్నా. ‘పా’స్టర్స్‌ ఫౌండేషన్‌’ ప్రారంభించి 400 శునకాల ఆలనాపాలనా చూస్తున్నా.

ఆళ్ల లక్ష్మీ హరికృష్ణ, చెన్నై


తొలి మహిళ

కమలా సోహాని... తొలిమహిళా శాస్త్రవేత్త.. మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో జన్మించిన ఈమె ఉన్నత విద్యావంతుల కుటుంబంలో పుట్టారు. బాంబే యూనివర్సిటీ నుంచి రసాయన, భౌతికశాస్త్రాల్లో పట్టా అందుకున్నారు. ఐఐఎస్‌సీ(ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌)లో ప్రవేశం పొందిన తొలిమహిళ ఈమె. రాయల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌కు మొదటి మహిళా డైరెక్టర్‌గా కూడా గుర్తింపు పొందారు. ‘నీరా’పై ఆమె చేసిన పరిశోధనకుగానూ రాష్ట్రపతి అవార్డునీ అందుకున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్