ఆమె... నీటిని పొదుపు చేస్తోంది!

బెంగళూరులోని నీటికొరత గురించి ఎన్నో వార్తలు వింటున్నాం. ఆ ఆందోళనకర పరిస్థితి రాకూడదనే... లలితాంబ ఓ అడుగు ముందుకేసి నీటి పొదుపు విషయంలో వినూత్నంగా అడుగులు వేశారు.

Published : 18 Mar 2024 01:54 IST

బెంగళూరులోని నీటికొరత గురించి ఎన్నో వార్తలు వింటున్నాం. ఆ ఆందోళనకర పరిస్థితి రాకూడదనే... లలితాంబ ఓ అడుగు ముందుకేసి నీటి పొదుపు విషయంలో వినూత్నంగా అడుగులు వేశారు. ఇప్పటివరకు 18లక్షల లీటర్లకు పైగా నీటిని ఆదా చేశారామె. మండుటెండలు ముందున్నాయి కాబట్టి ఆ పొదుపు మంత్రమేదో మనమూ తెలుసుకుందాం...

లలితాంబ.. బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్‌ లేఅవుట్‌లో నివసిస్తున్నారు. నీటిని పొదుపుగా వాడకపోతే భవిష్యత్తు తరాలకు ముప్పు తప్పదనే లలితాంబ ఎయిరేటర్లు, రెస్ట్రిక్టర్‌లను వినియోగించమంటున్నారు. వీటిని కుళాయిలకు అమర్చడం వల్ల నీటి వినియోగం నాలుగింట మూడోవంతుకి తగ్గుతుందట. ఇవి నీటిని ఒక ధారలా, వేగంగా రానీయకుండా వెదజల్లినట్టుగా వచ్చేట్టు చేస్తాయి. నీటి వేగాన్ని తగ్గిస్తాయి. దాంతో నీటి వినియోగం తగ్గుతుంది. ‘సాధారణంగా నీటి నిల్వలు పెరగాలంటే ఇంకుడు గుంతలు తవ్వాలి. లేదూ వర్షపునీటిని ఒడిసి పట్టాలి. దీనికోసం బావులు, చెరువులు, కాలువలు... లోతుగా, శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అయితే ఈ పని ఖర్చూ, స్థల పరిమితులతో కూడుకున్నది కావడంవల్ల నీటి శుద్ధి,  పునర్వినియోగం సవాలుగా మారింది. ఈ ప్రక్రియకు దాదాపు రూ.30లక్షల నుంచి 50లక్షల పైనే ఖర్చవుతుంది. కానీ అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఎయిరేటర్లు, రెస్ట్రిక్టర్లతో తేలిగ్గా నీటిని పొదుపు చేయొచ్చు. ఈ రెండు పరికరాలను అమర్చడానికి రెండు నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. బయట రెడీమేడ్‌గా దొరుకుతాయి. వీటిని ట్యాప్‌ నాజిల్‌కు అమర్చుకుంటే సరి’ అంటారు లలితాంబ. అనడమే కాదు తనవంతుగా ఎక్కువగా నీటి దుర్వినియోగం అయ్యే ప్రాంతాల్లోని కళాయిలకు వీటిని అమర్చి ముందడుగు వేశారు.

సొంత ఖర్చుతో...

రూ.12,000లతో కళ్యాణ మండపాలు, పాఠశాలలు, సమావేశ మందిరాల్లో 125 ఎయిరేటర్లను ఏర్పాటుచేశారు.‘ఈ ఎయిరేటర్లను అమర్చడం ద్వారా నిమిషానికి పదిలీటర్లు చొప్పున నెలకు 15000 లీటర్ల నీరు ఆదా చేస్తున్నాం. ప్రభుత్వం వీటిని బహిరంగ ప్రదేశాలు, కమ్యూనిటీ టాయిలెట్లు, వాష్‌ ఏరియాల్లో ఏర్పాటు చేస్తే మరింత నీటిని ఆదా చేయొచ్చని’ అంటున్నారు లలితాంబ. మార్పు అనేది ఒకరితోనే మొదలవ్వాలి దానికి ఎవరి సాయం అవసరం లేదని తన చేతల ద్వారా నిరూపించారీమె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్