మనమూ మారదామా జల నేస్తాలుగా!

ఇంట్లో ఆడవాళ్లని ఒంటరిగా వదిలి..   ఊళ్లో మగవాళ్లంతా నగరానికి వలస వెళ్లిపోయారు కూలి పనులకి! కారణం... ఒకప్పుడు సాగుతో పచ్చగా ఉన్న ఆ ప్రాంతం ఎడారైంది మరి.

Updated : 22 Mar 2024 13:13 IST

నేడు ప్రపంచ జల దినోత్సవం...

ఇంట్లో ఆడవాళ్లని ఒంటరిగా వదిలి..   ఊళ్లో మగవాళ్లంతా నగరానికి వలస వెళ్లిపోయారు కూలి పనులకి! కారణం... ఒకప్పుడు సాగుతో పచ్చగా ఉన్న ఆ ప్రాంతం ఎడారైంది మరి. అందుకే ఆ ఊరి తలరాతని మార్చడానికి వేలమంది మహిళలు ఒక్కటై తరాల క్రితం ఇంకిపోయిన నదిని బతికించుకున్నారు. వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపుకొన్నారు. మంచి నీటికి... మహిళా సాధికారతకి అవినాభావ సంబంధం ఉందని చెప్పే ఉదాహరణ ఇది. కానీ మార్చుకోవాల్సిన నీటి వెతలు చాలానే ఉన్నాయి... 

మిళనాడులోని వెల్లూరులో నాగానది ఉండేదని తల్లులు చెబితే పిల్లలు వినడమే కానీ, ఆ నది నిండుగా ప్రవహించడాన్ని చూసినవాళ్లు తక్కువే. నాగానది ఉనికి కోల్పోయినట్టే... ఆ ఊళ్లో సాగూ లేకుండా పోయింది. దాంతో మగవాళ్లు దొరికిన కూలిపనులు చేయడానికి వలస వెళ్లిపోయారు. ఇక ఇల్లు, పిల్లల బాధ్యత ఆడవాళ్లదే అయ్యింది. మైళ్ల దూరం నడిచి వెళ్లి... గుక్కెడు నీళ్లు తెచ్చుకుని వంటకీ, ఇంటికీ సర్దుబాటు చేసుకోవడం గొప్పైంది. అలాంటి పరిస్థితుల్లో వెల్లూరులో మొదలైన మహిళల సంకల్పం వాళ్ల తలరాతలని మార్చింది. అది చుట్టుపక్కల జిల్లాలకూ వ్యాపించింది. 20 వేలమంది మహిళలు పలుగూ పారా పట్టి బావులూ, కుంటలూ తవ్వారు. చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. ప్రతి వాన చుక్కనీ బంగారంలా ఒడిసిపట్టి, నాగానదిని బతికించుకొన్నారు. ఫలితంగా 5వేల గ్రామాలు పచ్చగా మారాయి. ఇలాంటిదే బుందేల్‌ఖండ్‌లోని ఆరుజిల్లాల ఆడవాళ్ల నీటి కథ. అక్కడి మహిళలు జల్‌సహేలీలుగా మారి నీటిపై విజయం సాధించారు. అందుకు గుర్తుగా నీలి రంగు చీరలు ధరించి ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌ వెనకబడిన ప్రాంతం. వేసవి వస్తే ఆడవాళ్లు 50 డిగ్రీల ఎండలో గుక్కెడు నీళ్ల కోసం మైళ్ల దూరం నడుచుకుంటూ వెళ్లాలి. ఖాళీ బిందెలతో ఇంటికి తిరిగి వచ్చే సందర్భాలే ఎక్కువ. చలికాలంలోనూ ఐదారు కిలోమీటర్లు వెళ్లి... ఐదారుగంటలు వెచ్చించి రెండు బిందెలు తెచ్చుకొనేంత గడ్డు పరిస్థితులు. ఆ నీటి కష్టాలపై ఆడవాళ్లే 2011 నుంచి పోరాటం మొదలుపెట్టారు. పానీ పంచాయతీలు ప్రారంభించి 1100 మంది జల్‌సహేలీలు చెక్‌డ్యాంలు నిర్మించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టుకున్నారు. వీళ్లని ముందుకు నడిపించిన వాళ్లలో 19 ఏళ్ల బబితా రాజ్‌పుత్‌ ఒకరు. ఎన్నో వందల గ్రామాలని నీటి పొదుపు దిశగా నడిపించిన ఆమె ప్రెసిడెంట్‌ అవార్డునీ అందుకుంది. వీళ్లకే మాత్రం తీసిపోని విధంగా ఆదిలాబాద్‌ జిల్లాలోని ముకరా గ్రామంలో ఇంకుడు గుంతలు తవ్వించి నీటిపొదుపులో తోటివారికి స్ఫూర్తిగా నిలిచారు సర్పంచ్‌ మీనాక్షి. వీళ్లేకాదు మరెందరో మహిళలు నీటి సమస్యలు తీర్చడానికి కృషి చేస్తున్నారు. ఎందుకంటే...

గుక్కెడు నీళ్ల కోసం

నీటి ఎద్దడంటే ఒకరకంగా మహిళల కష్టాలకి ప్రత్యామ్నాయ పదమే. ఎందుకంటే యునిసెఫ్‌ నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మందిలో ఏడుగురు మహిళలు నీటి వెతలని ఎదుర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా రోజులో మూడున్నర గంటలు నీళ్లు తీసుకురావడానికే కేటాయిస్తారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతంలో 22 లీటర్ల నీటిని సగటున ఐదు కిలోమీటర్ల దూరం మోసి తీసుకొస్తున్నారు. ఆ సమయంలో ఆమె గర్భిణిగా ఉన్నా ఈ కష్టాలు తప్పడం లేదు. ఒక గర్భిణి పదికిలోలకు మించి బరువు ఎత్తకూడదు. కానీ ఒక్కో మహిళ నెత్తిమీద సగటున పద్దెనిమిది కిలోల బరువు మోస్తోంది. ఈ కారణంగా 70 శాతం మహిళల్లో వెన్నెముక దెబ్బతిని అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. నెత్తిమీద చల్లని నీళ్ల కుండ ఉన్నా మండుటెండల్లో వీటిని తీసుకురావడం వల్ల డీహైడ్రేషన్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో మరెంతోమంది అడవి మృగాల బారిన పడటం, అత్యాచారాలకు గురికావడం అనేదీ సహజంగానే మారింది. పదిహేనేళ్లు నిండిన పిల్లలపైనా ఈ నీటి కష్టాలు పడుతున్నాయి. నీటిని తీసుకురావడం కోసం బడికి దూరమవుతున్నారు. అలాగని ఈ దొరికేదంతా మంచినీరేనా అంటే కాదు. ఉన్న నీటిలో కాస్తంత తేట నీటిని తెచ్చుకోవడానికి అందరికంటే ముందువెళ్లాలనే ఒత్తిడిలో... నిద్రలేమి సమస్యలూ, కుంగుబాటుకి గురవుతున్న మహిళల సంఖ్య పెరుగుతోందట. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే మహిళలతోపాటు ప్రతిఒక్కరూ జల నేస్తాలుగా మారాల్సిందే!


మనవంతుగా ఇలా చేయొచ్చు...

‘మన ఇంట్లో ఉపయోగించే కుళాయిలకి... ఎయిరేటర్లు (గాలితో కలిపి నీటిని వెదజల్లుతాయి) బిగించడం వల్ల పాత్రలు తోమేందుకు 450 లీటర్లకు బదులుగా 90 లీటర్లు మాత్రమే ఖర్చవుతుంది. ఇక వేసవి అనగానే షవర్‌ స్నానాలని గుర్తు చేసుకోకండి. ఈ షవర్‌ స్నానం చర్మంలోని తేమను లాగేసి పొడిబారేట్టు చేస్తుంది. బకెట్‌ స్నానంతో నీళ్లు ఆదా అవుతాయి. ఆర్‌ఓ ఫిల్టర్‌ వాడుతుంటే దాని నుంచి నిరుపయోగంగా వచ్చే నీటినీ వృథా చేయొద్దు. వాటిని ఇంటి శుభ్రతకి వాడొచ్చు. వాషింగ్‌ మెషిన్‌ ఫుల్‌లోడ్‌తో ఉంటే తప్ప వినియోగించొద్దు. ఈ విధానంలో నేను రోజుకి 600 లీటర్ల నీటిని పొదుపు చేస్తున్నా’ అంటూ బెంగళూరుకు చెందిన డాక్టర్‌ దివ్యశర్మ సోషల్‌ మీడియాలో చెప్పిన సలహాలు వైరల్‌గా మారాయి. లక్షలమందికి చేరువయ్యాయి.


నీళ్లకు చక్రాలొస్తే!

ఆడవాళ్ల కష్టాలు ఆడవాళ్లకే బాగా అర్థమవుతాయి! సింథియా కొయోనిగ్‌ ఆవిష్కరించిన ‘వాటర్‌ వీల్‌’ ఇందుకు చక్కని ఉదాహరణ. ఉద్యోగరీత్యా ఆసియా, ఆఫ్రికాల్లోని దేశాల్లో పనిచేసినప్పుడు... నెత్తిమీద నీళ్ల కుండలు పెట్టుకుని, చంకన పిల్లల్ని ఎత్తుకొని కొండలు ఎక్కి దిగుతూ మైళ్లకొద్దీ నడుస్తున్న మహిళల్ని చూసి చలించిపోయింది.

ఇందుకు పరిష్కారంగా తేలిగ్గా దొర్లించుకుని వెళ్లే నీళ్ల చక్రాలని ఆవిష్కరించింది. భారత్‌ కేంద్రంగా ప్రారంభమైన ‘వెల్లో’ ప్రస్తుతం అనేక దేశాలకు ఈ చక్రాలని పంపిస్తోంది.

వేసవిలో నీటి కొరత నేపథ్యంలో- నీటిని పొదుపు చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్