ఆ సాయం పేరు... సుమలత!

పశువుకింత గ్రాసం...  సాటి మనిషికింత సాయం... అదే సుమలతకు తెలిసిన జీవిత సత్యం. తన దగ్గర లక్షలు లేకపోయినా... తోటిమనిషికింత సాయం చేయాలనుకున్నారామె. చిరుద్యోగం చేస్తూనే సేవాపథంలో సాగిపోతున్నారు పల్నాడుకి చెందిన చిగుళ్ల సుమలత.

Updated : 02 Apr 2024 13:29 IST

పశువుకింత గ్రాసం...  సాటి మనిషికింత సాయం... అదే సుమలతకు తెలిసిన జీవిత సత్యం. తన దగ్గర లక్షలు లేకపోయినా... తోటిమనిషికింత సాయం చేయాలనుకున్నారామె. చిరుద్యోగం చేస్తూనే సేవాపథంలో సాగిపోతున్నారు పల్నాడుకి చెందిన చిగుళ్ల సుమలత.

మాది పల్నాడు జిల్లాలోని చాగంటివారిపల్లె. నాన్న కోటేశ్వరావు రైతు. అమ్మ నాగేశ్వరమ్మ. పెద్దగా ఆదాయం లేకున్నా నన్నూ, చెల్లినీ కష్టపడి చదివించారు. స్కూల్లో ఉన్నప్పుడు... అసోంని వరదలు అతలాకుతలం చేశాయనీ, అక్కడి వారికి సాయం చేయాలని మా మాస్టారు చెప్పారు. అప్పుడు నావంతు సాయంతోపాటూ స్నేహితుల నుంచీ డబ్బు సేకరించి పంపించా. ఆ సంఘటన నన్ను బాగా ప్రభావితం చేసింది. తీరిక సమయాల్లో అంధులు పరీక్షలు రాసేటప్పుడు తోడుగా ఉండి రాయడం, చదువులో వెనకబడిన పిల్లలకు ట్యూషన్లు చెప్పడం, రక్త దానం చేయడం, పేదలకు పోషకాహారం అందించడం లాంటి పనులు చేసేదాన్ని. 2020లో ‘నవ యువతరం’ ఎన్జీవోని స్థాపించి ఈ కార్యక్రమాలను మరింత విస్తృతం చేశాను. ఎమ్మే ఇంగ్లిష్‌ పూర్తిచేసి.. యువతకు ఆన్‌లైన్‌లో ఇంగ్లిష్‌ పాఠాలు చెబుతూ, ఆ వచ్చిన డబ్బుతో సేవా కార్యక్రమాలు చేస్తున్నా. నా పెళ్లి గురించి బంధువులు తొందరపెట్టినా మా కుటుంబసభ్యుల సహకారంతో సేవ చేస్తున్నా. అసోం వెళ్లి అక్కడ యువతకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌, వైద్య శిబిరాలు నిర్వహించా. ఇందుకు గాను 2022లో ‘బెస్ట్‌ ఎన్జీవో పురస్కారం’ అందుకున్నా. కొవిడ్‌ సమయంలోనూ తోటి వాలంటీర్ల సాయంతో అవసరంలో ఉన్నవారికి నిత్యావసరాలు, మందులు పంపిణీ చేసేవాళ్లం. హైదరాబాద్‌ నారాయణగూడలో స్కిల్‌ టెక్నాలజీస్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్లో ట్రైనర్‌గా పనిచేస్తూ... గ్రామీణ అమ్మాయిల బతుకుతెరువుకు కావాల్సిన నైపుణ్యాలు అందిస్తున్నా. పాటలు పాడటం, నాట్యం అన్నా ఇష్టమే. పాటల్లో జాతీయస్థాయిలో ఇచ్చే విశిష్ట వనిత పురస్కారం సాధించా. మీ గ్రామానికి మంచి పేరు తీసుకొస్తున్నావంటూ జిల్లా అధికారులిచ్చే ప్రశంసలు, ప్రజల అభినందనలే నాలో ముందుకెళ్లే స్ఫూర్తిని నింపుతున్నాయి.

వేల్పూరి వీరగంగాధరశర్మ, పిడుగురాళ్ల

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్