కాంక్షి.. రాజకీయ ‘నేత్రి’

‘ఆడవాళ్లకు రాజకీయాలెందుకు’ అని చిన్నచూపు చూసే మగవాళ్లున్నట్లే, ‘అమ్మో రాజకీయాలా’ అని భయపడి వెనకడుగు వేసే మహిళలూ ఉన్నారు. ఇందుకు కారణం... ఒక్కసారి ఈ రంగంలోకి అడుగుపెడితే, ఆమె స్త్రీత్వాన్ని లక్ష్యంగా చేసుకుని...వివక్ష చూపించేవారు కొందరైతే, తనని నిలువరించడానికి ఆమె వ్యక్తిత్వాన్నే హననం చేయాలనుకునేవారు ఇంకొందరు. ఈ పరిస్థితిని మార్చి వారిని రాజకీయాల్లో రాణించేలా చేయాలనుకున్నారు భోపాల్‌కి చెందిన కాంక్షి అగర్వాల్‌.

Published : 22 Apr 2024 02:01 IST

‘ఆడవాళ్లకు రాజకీయాలెందుకు’ అని చిన్నచూపు చూసే మగవాళ్లున్నట్లే, ‘అమ్మో రాజకీయాలా’ అని భయపడి వెనకడుగు వేసే మహిళలూ ఉన్నారు. ఇందుకు కారణం... ఒక్కసారి ఈ రంగంలోకి అడుగుపెడితే, ఆమె స్త్రీత్వాన్ని లక్ష్యంగా చేసుకుని...వివక్ష చూపించేవారు కొందరైతే, తనని నిలువరించడానికి ఆమె వ్యక్తిత్వాన్నే హననం చేయాలనుకునేవారు ఇంకొందరు. ఈ పరిస్థితిని మార్చి వారిని రాజకీయాల్లో రాణించేలా చేయాలనుకున్నారు భోపాల్‌కి చెందిన కాంక్షి అగర్వాల్‌. ఇందుకోసమే మొదటిసారి మహిళలకోసం ‘నేత్రి’ని స్థాపించారు...

‘ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల్లో మహిళలకు ప్రయోజనం కలిగేవి ఉండాలంటే వారి ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండాలి. మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం మహిళల శానిటరీ న్యాప్‌కిన్లపై 18 శాతం జీఎస్‌టీ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు కారణాలను అన్వేషిస్తుంటే... జీఎస్‌టీ శ్లాబులను నిర్ణయించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కౌన్సిల్‌లో ఒక్క మహిళ కూడా లేరని తెలిసి ఆశ్చర్యపోయా. ఒకవేళ అందులో స్త్రీలు ఉంటే ఈ నిర్ణయాన్ని అడ్డుకునేవారు. లేదంటే కనీసం ప్రశ్నించేవారు. ఇదే కాదు... ఏ చట్టం చేసినా ఆడవారి ప్రాధాన్యం ఉన్నప్పుడే దేశం అభివృద్ధిపథంలో పయనిస్తుంది. ఇందుకోసం తప్పనిసరిగా రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగితేనే అసమానతలు తగ్గేది’ అంటారు కాంక్షి. ఈమెది మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌. అక్కడే ఎంటెక్‌ పూర్తి చేశారు. ఆపై ముంబయిలోని టాటా సోషల్‌ సైన్సెస్‌ నుంచి ‘అర్బన్‌ పాలసీ అండ్‌ గవర్నెన్స్‌’లో మాస్టర్స్‌ చేశారు. అదే సమయంలో ‘లెజిస్లేటివ్‌ ఎయిడ్‌ టు మెంబర్‌ ఆఫ్‌ పార్లమెంట్‌ (ఎల్‌ఏఎమ్‌పి)’ ఫెలొషిప్‌ రూపంలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి పనిచేసే అవకాశం లభించింది. అప్పుడక్కడ మహిళల సంఖ్య తక్కువగా ఉండటం చూసి రాజకీయాల్లో వారి సంఖ్య పెరిగేలా కృషి చేయాలనుకున్నారు. ఆ ప్రయత్నంలోనే ఐఐఎం బెంగళూరు సోషల్‌ లాంచ్‌ ప్యాడ్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా ‘నేత్రీ ఫౌండేషన్‌’ పేరుతో ఇంక్యుబేషన్‌ సెంటర్‌ని ఏర్పాటు చేశారు.

గ్రామాలే ప్రాతిపదికగా...

మహిళలు.. ఎన్నికల్లో పోటీ చేయడానికీ, రాజకీయ నిపుణులుగా, రాజకీయ సంస్థల వ్యవస్థాపకులుగా మారడానికీ కృషి చేస్తుంది నేత్రి. ఇందుకోసం ప్రత్యేక కోర్సులను నిర్వహించడంతో పాటు, ఆయా పార్టీల తరఫున రాజకీయ అభ్యర్థులకూ, ఔత్సాహికులకూ అవసరమైన శిక్షణ, నైపుణ్యాలను అందచేస్తుందీ సంస్థ. గ్రామ పంచాయతీ స్థాయి నుంచి ఒక్కో మెట్టూ ఎక్కుతూ పాలిటిక్స్‌లో ఎలా రాణించాలి? ఎన్నికల వ్యవస్థ ఎలా ఉంటుందనే విషయాలెన్నో నేర్పిస్తారు. ఇందుకు బూత్‌ మేనేజ్‌మెంట్‌, నియోజక వర్గాల నిర్వహణ, నామినేషన్లు వేయడం, ఆర్గనైజింగ్‌ స్కిల్స్‌, సోషల్‌ మీడియా ఖాతాల నిర్వహణ వంటి విషయాలపై క్షేత్రస్థాయిలో వారికి అవగాహన కల్పిస్తారు. కార్యనిర్వాహక వ్యవస్థ, శానససభల పనితీరు, ప్రభుత్వ పాలసీల అమలు గురించీ శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ప్రముఖ రాజకీయ పార్టీలు, పబ్లిక్‌ పాలసీ నిపుణులు, న్యాయకోవిదులతో కలిసి చర్చావేదికలు నిర్వహించడం, తరగతులు చెప్పించడం వంటివెన్నో చేస్తారు. భోపాల్‌తో పాటు బరేలీ, రాయ్‌బరేలీ, అమేథీ.. వంటి ప్రాంతాల్లోని మహిళలతో కలిసి పనిచేశారు. ప్రస్తుతం బిహార్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లోనూ సేవలందిస్తున్నారు.
కాంక్షి... జెండర్‌ యాక్టివిస్ట్‌ మాత్రమే కాదు. టెక్నాలజీ, సోషల్‌, జెండర్‌, పాలిటిక్స్‌పై పనిచేస్తున్న పాలసీ రిసెర్చర్‌ కూడా. ప్రతిష్ఠాత్మక ఫెలోషిప్‌లెన్నో అందుకున్నారు. తన కృషికిగానూ ఐక్యరాజ్యసమితి అందించే ‘కరమ్‌వీర్‌ చక్ర అవార్డు’నీ రెండుసార్లు అందుకున్నారు. ఇక, భవిష్యత్తులో ఆమె సారథ్యంలోనైనా మహిళా సాధికారత సాధ్యమవుతుందని ఆశిద్దాం!


మాకన్నీ గుర్తే!

పెళ్లి రోజు, పుట్టిన రోజులాంటి ముఖ్యమైన రోజులనూ మర్చిపోయే మగవారుంటారు. కానీ మనం మాత్రం కొన్ని ఏళ్ల క్రితం జరిగిన సంఘటన అయినా సరే... మాటలు, సమయంతో సహా గుర్తుపెట్టుకుంటాం కదా! ఏ విషయమైనా ఆడవాళ్లు, మగవారికంటే ఎక్కువ కచ్చితత్వంతో గుర్తుంచుకోగలరట. అందుకు కారణం వాళ్ల మెదడులో హిప్పోక్యాంపస్‌ పెద్దగా ఉండడంతోపాటు వారిలోని హార్మోన్లు మతిమరుపు రాకుండా మెదడులో రక్షణ కవచంలా ఉంటాయట.  అందుకే భార్య ఏదైనా విషయంలో ప్రశ్నిస్తుందంటే సమాధానం చెప్పే ముందు ఓసారి ఆలోచించుకోవాలి. లేకుంటే భర్తలు దొరికిపోవడం ఖాయం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్