అమ్మకి సివిల్స్‌ బహుమతి!

భార్యాభర్తలిద్దరూ కష్టపడితే కానీ పిల్లల కడుపు నింపలేని పరిస్థితి! అయినా కడుపున పుట్టిన వారి కోసం పెద్ద కలలే కన్నారా దంపతులు. పైసా పైసా కూడబెట్టి, ఒంటి మీదున్న కాస్త బంగారాన్నీ తాకట్టు పెట్టి చదివించారు. ఆ కష్టం తెలుసు కనుకే ఆ అమ్మాయీ బంగారాన్ని మించిన విజయాన్ని సాధించి, అమ్మానాన్నల కళ్లల్లో ఆనందాన్ని నింపింది. సివిల్స్‌ విజేత స్వాతి మోహన్‌ రాథోడ్‌ కథే ఇది!

Updated : 02 May 2024 13:31 IST

భార్యాభర్తలిద్దరూ కష్టపడితే కానీ పిల్లల కడుపు నింపలేని పరిస్థితి! అయినా కడుపున పుట్టిన వారి కోసం పెద్ద కలలే కన్నారా దంపతులు. పైసా పైసా కూడబెట్టి, ఒంటి మీదున్న కాస్త బంగారాన్నీ తాకట్టు పెట్టి చదివించారు. ఆ కష్టం తెలుసు కనుకే ఆ అమ్మాయీ బంగారాన్ని మించిన విజయాన్ని సాధించి, అమ్మానాన్నల కళ్లల్లో ఆనందాన్ని నింపింది. సివిల్స్‌ విజేత స్వాతి మోహన్‌ రాథోడ్‌ కథే ఇది!

‘మా పరిస్థితి మీకొద్దంటే బాగా చదువుకోవాలి’ చిన్నప్పట్నుంచీ అమ్మ చెప్పే ఈ మాటలు వింటూ పెరిగింది స్వాతి. తననీ, తన ముగ్గురు తోబుట్టువులనీ పెంచడానికి తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో కళ్లారా చూసిందామె. అమ్మానాన్నలిద్దరూ కూరగాయలు అమ్మితేగానీ ఇల్లు గడిచేది కాదు. అయినా తమ పరిస్థితి పిల్లలకు రావొద్దని వారిని బాగా చదివించాలనుకున్నారు. ముంబయిలోని ప్రభుత్వ పాఠశాలలోనే ఇంటర్‌ వరకూ చదివించారు. కానీ, ఆ మహానగరంలో ఖర్చులు భరించడం ఆ కుటుంబానికి భారంగా తోయడంతో సోలాపుర్‌కి మకాం మార్చారు. అక్కడే జాగ్రఫీలో డిగ్రీ, పీజీ పూర్తిచేసింది స్వాతి. నిజానికి ఆ సమయంలో పిల్లల పోషణ, వారి చదువులు ఆ కుటుంబానికి పెద్ద భారమే. అయినా వెనకాడలేదు వాళ్లమ్మ. తన మెడలోని బంగారాన్ని అమ్మి మరీ, స్వాతిని చదువుకునేలా ప్రోత్సహించింది.

అందుకే అమ్మ త్యాగానికి తగిన ఫలితం దక్కేలా చేయాలనుకుంది స్వాతి. సివిల్స్‌ కల నెరవేర్చుకుని ఆ విజయాన్ని ఆమెకు బహుమతిగా ఇవ్వాలనుకుంది. కష్టపడి చదివింది. కానీ వరుస వైఫల్యాలు వెక్కిరించాయి. ఒకటీ రెండూ కాదు ఏకంగా ఐదుసార్లు విఫలమైంది. ఈసారి ఎలాగైనా సాధించాలని పట్టుదలగా రేయింబవళ్లు కష్టపడింది. చివరికి తన శ్రమ ఫలించి, 492వ ర్యాంకు సాధించింది. ఫలితాలు చూడగానే స్వాతి కళ్లలో కన్నీళ్లాగలేదు. తల్లిదండ్రుల కష్టానికి తగిన ప్రయోజనం చేకూర్చానన్న ఆనందం ఆమెది. విధులను బాధ్యతగా నిర్వర్తించడమే కాదు, అమ్మానాన్నలను బాగా చూసుకోవడం, తనలాంటి ఆడపిల్లలకు సాయం చేయడం... తన ముందున్న లక్ష్యాలంటోంది. ‘కలలు ఎవరైనా కనొచ్చు. దానికి ధనిక, పేద తేడా లేదు. అయితే వాటిని సాధించుకోవడానికి ధైర్యంగా పోరాడగలగాలి. అదే మనల్ని విజేతల్ని చేస్తుంద’ంటోన్న స్వాతి ఎందరికో స్ఫూర్తిదాయకం కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్