శ్వేత సౌధానికి... మన పాఠాలు!

ఉదయం మేల్కొన్నప్పట్నుంచీ తిరిగి నిద్రపోయే వరకూ మన రోజువారీ కార్యకలాపాలన్నింటిలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ భాగమైపోయింది. అభివృద్ధి చెందుతున్నాం అని ఆనందించేలోగా డీప్‌ఫేక్‌, సమాచారంలో నాణ్యత లోపాలు వంటివెన్నో భయపెడుతున్నాయి. అందుకే దీన్ని సురక్షితంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకున్నారు ఆరతి ప్రభాకర్‌. ఇక, షింజిని కుందు... ఈ టెక్నాలజీతో కంటిని మాయచేసి తప్పించుకునే రోగాల అంతూ రాబడుతున్నారు.

Updated : 08 May 2024 15:28 IST

ఉదయం మేల్కొన్నప్పట్నుంచీ తిరిగి నిద్రపోయే వరకూ మన రోజువారీ కార్యకలాపాలన్నింటిలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ భాగమైపోయింది. అభివృద్ధి చెందుతున్నాం అని ఆనందించేలోగా డీప్‌ఫేక్‌, సమాచారంలో నాణ్యత లోపాలు వంటివెన్నో భయపెడుతున్నాయి. అందుకే దీన్ని సురక్షితంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకున్నారు ఆరతి ప్రభాకర్‌. ఇక, షింజిని కుందు... ఈ టెక్నాలజీతో కంటిని మాయచేసి తప్పించుకునే రోగాల అంతూ రాబడుతున్నారు. అమెరికాలో దూసుకుపోతున్న ఈ భారత నారీమణులను మీరూ కలుసుకోండి.


బైడెన్‌కి ఏఐ సలహాలు...

అప్పుడు ఆరతి ప్రభాకర్‌కి అయిదేళ్లు ఉంటాయేమో! అమెరికాలో నాన్నతో కలిసి డిపార్ట్‌మెంట్‌ స్టోర్‌కి వెళ్లారు. దాని యజమాని ‘పాపా... నువ్వెక్కడి నుంచి వచ్చావ్‌’ అని అడిగారట. దానికి ఆరతి ‘నేను ఇండియన్‌ని’ అని చెబితే... ‘ఇదెక్కడి తెగ? నేనెప్పుడూ దీని గురించి వినలేదే’ అన్నారట. ఆరోజు తన గురించీ, పుట్టిన దేశం గురించీ చెప్పుకొచ్చిన ఆ చిన్నారి... ఆ దేశాధ్యక్షుడితోనే కలిసి పనిచేస్తుందని ఎవరైనా ఊహించగలరా? ఇదంతా సాధ్యం కావడానికి మాత్రం ‘మా అమ్మే కారణం’ అంటారు ఆరతి. పుట్టింది న్యూదిల్లీ. మూడేళ్ల వయసులో అమెరికా వెళ్లారు. అయితే తండ్రి ఉద్యోగరీత్యా కాదు. ఉన్నతచదువుల కోసం వాళ్లమ్మ అమెరికా వెళితే ఆ తరవాత నాన్నతో కలిసి ఈమె కూడా వెళ్లారు. తల్లిదండ్రులిద్దరూ పీహెచ్‌డీ చేశారు. చిన్నతనం నుంచీ వాళ్లమ్మ విషయమేదైనా ‘నువ్వు పెద్దయ్యి... పీహెచ్‌డీ పూర్తిచేసి గొప్ప అకడమీషియన్‌ అయ్యాక’... అంటూ ప్రారంభించేవారట. అలా చిన్నతనంలోనే పీహెచ్‌డీ చేయాలన్న ముద్ర తనపై పడిందంటారు ఆరతి. ఇంజినీరింగ్‌లో పీజీ పూర్తయ్యాక కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి అప్లైడ్‌ ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ పూర్తిచేసిన తొలి మహిళగా నిలిచారు. చదువు పూర్తవడంతోనే కాంగ్రెషనల్‌ ఫెలోషిప్‌ అందుకున్న ఆరతి... డిఫెన్స్‌ అడ్వాన్స్‌డ్‌ రిసెర్చ్‌ ప్రాజెక్ట్స్‌ ఏజెన్సీ (డీఏఆర్‌పీఏ), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్టాండర్డ్స్‌ అండ్‌ టెక్నాలజీల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ఆపై రెండు దశాబ్దాలు వెంచర్‌ క్యాపిటలిస్ట్‌గానూ రాణించారు. బైడెన్‌ పిలుపు మేరకు అధ్యకుడికి సైన్స్‌ అడ్వైజర్‌గా బాధ్యతలు చేపట్టారు. ‘వైట్‌హౌస్‌ ఆఫీస్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పాలసీ’కి డైరెక్టర్‌ కూడా. ఈక్రమంలోనే గతఏడాది బైడెన్‌కు చాట్‌జీపీటీ పనివిధానాన్ని పరిచయం చేశారు ఆరతి. ఎంత పెద్ద విషయాన్నైనా క్షణాల్లో కుదించి చెప్పడం, నచ్చిన రీతిలో మార్చి ఇవ్వడం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. అదే సమయంలో ఇదెంత వరకూ సురక్షితం అన్న ప్రశ్న ఆయనలో మెదిలింది. దీంతో ‘ఏఐని సురక్షిత, నమ్మకమైనదిగా తీర్చిదిద్ద’మని ఆమెకు బాధ్యతలు అప్పగించారు. వాటిని సమర్థంగా నిర్వర్తించే పనిలో ఉన్నారామె.


ఏఐతో రోగ నిర్ధారణ ..!

అనారోగ్యంతో వైద్యుని వద్దకు వెళుతుంటాం. వాళ్ల సూచనలమేరకు ఎంఆర్‌ఐ స్కాన్‌ వంటివి తీయిస్తుంటాం. అయితే కొన్ని వ్యాధుల్ని వాటిల్లోనూ పసిగట్టలేం. మరికొన్నిసార్లు నిర్ధారించడంలోనూ పొరపాట్లు జరగడానికి అవకాశమూ లేకపోలేదు అంటున్నారు షింజిని కుందు. అందుకే ఏఐతో ఎంతటి సూక్ష్మమైన రోగాన్నైనా కనిపెట్టే సాంకేతికతను రూపొందించారీమె. అమెరికాలో స్థిరపడిన కుటుంబంలో పుట్టారు షింజిని కుందు. స్టాన్‌ఫర్డ్‌ యూనివర్శిటీలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశారు. ఆపై వైద్యరంగంలోకి అనుకోకుండా అడుగుపెట్టారు. ఓసారి మెడికల్‌ ఇమేజింగ్‌ గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు అనారోగ్యాన్ని వేగంగా నిర్ధారించే విధానాలను తెలుసుకోవాలనుకున్నారు షింజిని. దీనిపై సమగ్రంగా అధ్యయనం చేయాలనే ఆసక్తితో పిట్స్‌బర్గ్‌ యూనివర్శిటీ నిర్వహించే మెడికల్‌ సైంటిస్ట్‌ ప్రోగ్రాంలో చేరారు. అందులో భాగంగానే గుర్తించలేని వ్యాధులను కనిపెట్టడానికి కృత్రిమ మేధ (ఏఐ)ను ఉపయోగించే విధానాల కోసం పరిశోధనలు చేశారు. .‘నా పరిశోధన అయిదారేళ్లకుపైగానే కొనసాగింది. అలా ‘ట్రాన్స్‌పోర్ట్‌-బేస్డ్‌ మోర్ఫోమెట్రీ (టీబీఎం)’ అనే నూతన ఏఐ టెక్నిక్‌ కనిపెట్టగలిగా. ఇది అవయవాల్లో లోపాల్ని గుర్తిస్తుంది. కొన్నిసార్లు ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌లను ఆధారంగానూ అనారోగ్యాన్ని నిర్ధారించలేం. అటువంటప్పుడు వ్యాధిని గుర్తించేందుకు ఈ కృత్రిమ మేధ ఉపయోగపడుతుంది’ అంటారు షింజిని. ప్రస్తుతం మేరీల్యాండ్‌లోని జాన్స్‌ హాప్‌కిన్స్‌ ఆసుపత్రిలో కంప్యూటర్‌ సైంటిస్ట్‌గా పనిచేస్తున్నారీమె. కంటికి కనిపించని సూక్ష్యవ్యాధులను గుర్తించడానికి కృత్రిమ మేధ వ్యవస్థను డిజైన్‌ చేయడంపై ఈమె మరిన్ని పరిశోధనలు జరుపుతున్నారు. పరిశోధనారంగంలో ఈమె చేపడుతున్న కృషికిగానూ ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30 జాబితాలో స్థానాన్ని దక్కించుకున్నారు. అలాగే ఎమ్‌ఐటీ టెక్నాలజీ రివ్యూ మ్యాగజైన్‌లో ప్రచురించిన 35మంది ఆవిష్కర్తల్లో అండర్‌ 30 లిస్ట్‌లో చోటు సంపాదించారు. అంతేకాదు, ‘యంగ్‌ గ్లోబల్‌ లీడర్‌’గా వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం నుంచి గుర్తింపు పొందిన ఈమెను ‘కార్నెగీ సైన్స్‌’ వంటి పలు అవార్డులూ వరించాయి.


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు,  సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్