గతాన్ని చెరిపేస్తారా...

బహుళ అంతస్థుల భవనాలు కట్టి అభివృద్ధిలో మేమే ముందున్నామంటున్నారు. అదే వారసత్వ కట్టడాల విషయానికి వస్తే సరైన రక్షణ లేక శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. మీరా అయ్యర్‌కు అది నచ్చలేదు. బీటలు వారుతున్న పురాతన సంపదను కాపాడి, భవిష్యత్‌ తరాలకు అందివ్వాలనే ఉద్దేశంతో 17 ఏళ్లుగా శ్రమిస్తోంది.

Published : 26 May 2024 01:04 IST

బహుళ అంతస్థుల భవనాలు కట్టి అభివృద్ధిలో మేమే ముందున్నామంటున్నారు. అదే వారసత్వ కట్టడాల విషయానికి వస్తే సరైన రక్షణ లేక శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. మీరా అయ్యర్‌కు అది నచ్చలేదు. బీటలు వారుతున్న పురాతన సంపదను కాపాడి, భవిష్యత్‌ తరాలకు అందివ్వాలనే ఉద్దేశంతో 17 ఏళ్లుగా శ్రమిస్తోంది. ఆ ప్రయాణం ఆమె మాటల్లోనే...

స్వాతంత్రోద్యమ సమయంలో గాంధీజీ దేశపర్యటనలో భాగంగా వచ్చి విశ్రాంతి తీసుకున్న భవనం మన తాతలు కట్టించిందే, మనకు మైలు దూరంలో ఉన్న ఆస్పత్రి ప్లేగు వ్యాధి సమయంలో ఎన్ని చావులను చూసిందో.. అంటూ పెద్దవాళ్లు చెప్పిన కథలను వింటూ పెరిగాను నేను. కానీ ఇప్పుడవన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. అభివృద్ధి పేరుతో వాటిని కూల్చి వాటి స్థానంలో వేరే భవనాలు నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలా చేస్తే మన తర్వాతి తరాలకు చరిత్ర తెలిసే అవకాశం ఉండదు. అందుకే వాటిని రక్షించాలి అనుకున్నా. దేవనహళ్లి కోట సందర్శనతో నా ప్రయాణం ప్రారంభమైంది. ఆ కోటకు వెళ్లినప్పుడు అక్కడ దాని చరిత్రకు సంబంధించిన ఆధారాలేవీ లేవు సరికదా.. అసాంఘిక కార్యాకలాపాలకు అడ్డాగా మారింది. దీనికి పూర్వవైభవాన్ని తేవాలనుకున్నా. పర్యటకుల సందర్శనకు అనుకూలంగా మార్చాలనుకున్నా. ముందుగా కోటకు సంబంధించిన వివరాలు, ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ ఆర్టికల్స్‌ రాశాను. కానీ ఎవరూ పట్టించుకోలేదు. అప్పుడే ఇంటాచ్‌ (ఇండియన్‌ నేషనల్‌ ట్రస్ట్‌ ఫర్‌ ఆర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ హెరిటేజ్‌)గురించి తెలుసుకున్నా. పురాతన కట్టడాలు, కళలు, సంస్కృతి, సంప్రదాయలను రక్షించే స్వచ్ఛంద సంస్థ ఇది. అందులో వాలంటీర్‌గా చేరాను.

బెంగళూరు వారసత్వ సంపద అనగానే మైసూర్‌ ఒక్కటే అందరికీ గుర్తొచ్చేది. కానీ దక్షిణ భాగంలో ఉన్న పురాతన దేవాలయాలు, పాఠశాలలు, చర్చ్‌లు, కోటలు తెలిసిన వాళ్లు చాలా అరుదు. అందుకే వీటిపైనే దృష్టిసారించాం. ఇప్పటిదాకా 9 పాఠశాలలు, మూడు దేవాలయాలు, చర్చ్‌లకు పూర్వవైభవం కల్పించా. వీటితోపాటు బంగళాలు, గెస్ట్‌హౌస్‌లు, ఆశ్రమాలు కూడాను. ఇందంతా అంత సులభంగా జరగలేదు. కొన్నిసార్లు ప్రభుత్వ అధికారులే అడ్డుపడి పని చేయనిచ్చేవారు కాదు. తర్వాత నా సేవలను గుర్తించి పురావస్తుశాఖతో కలిసి పనిచేసే అవకాశం కల్పించారు. వారసత్వ సంపదను కాపాడటంలో యునెస్కోకు చాలానే నివేదికలు సమర్పించాం. హోయసల దేవాలయ పునఃనిర్మాణంలో ఆర్కియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాతో కలిసి పనిచేయడం మరచిపోలేను. వారసత్వం ఒక ఆస్తి, అభివృద్ధికి ఆటంకం కాదన్న సందేశాన్ని ప్రజలు, ప్రభుత్వానికి చేరవేయడమే నా లక్ష్యం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్