షార్క్‌ల రక్షణ కోసం....

ఆస్ట్రేలియాలోని కొన్ని దీవులు స్నోర్‌కెల్లింగ్‌ బోట్‌ట్రిప్స్‌కి ప్రాచుర్యం పొందాయి. స్నోర్‌కెల్లింగ్‌ అంటే ఆక్సిజన్‌ ట్యూబ్‌ సాయంతో సముద్రంలోకి నేరుగా వెళ్లి అక్కడి జలచరాల అందాల్ని చూడటం. సింగపూర్‌కి చెందిన టీచర్‌ కేథీఝూ అలానే జలచరాలని చూసేందుకు ఆస్ట్రేలియా వెళ్లిందోసారి.

Updated : 28 May 2024 02:04 IST

స్ట్రేలియాలోని కొన్ని దీవులు స్నోర్‌కెల్లింగ్‌ బోట్‌ట్రిప్స్‌కి ప్రాచుర్యం పొందాయి. స్నోర్‌కెల్లింగ్‌ అంటే ఆక్సిజన్‌ ట్యూబ్‌ సాయంతో సముద్రంలోకి నేరుగా వెళ్లి అక్కడి జలచరాల అందాల్ని చూడటం. సింగపూర్‌కి చెందిన టీచర్‌ కేథీఝూ అలానే జలచరాలని చూసేందుకు ఆస్ట్రేలియా వెళ్లిందోసారి. అక్కడి భారీ షార్క్‌లని దగ్గరగా చూసింది. మొదట భయంతో బిగుసుకుపోయినా, షార్క్‌చేపలోని ఆ హుందాతనం, సొగసు తన మనసుని కట్టిపడేశాయి. తిరిగి సింగపూర్‌ వెళ్లినా ఆ షార్క్‌ల అందాన్ని మరిచిపోలేకపోయిందామె. వాటి గురించి ఆలోచిస్తున్న సమయంలో ఇండోనేషియాలోని టాంజింగ్‌ లువార్‌ చేపల మార్కెట్‌ గురించి తెలిసింది. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ఇక్కడ షార్క్‌ చేపల్ని చంపి వాటి మాంసాన్నీ, కోర దంతాలనీ, ఫిన్‌ అనే ప్రత్యేకభాగాన్నీ అమ్ముతారు. ఈ ఫిన్‌తో చేసిన సూప్‌ ఆరోగ్యానికి మంచిదని ఒక నమ్మకం. దాంతో ఈ చేపల ఫిన్‌కి చాలా డిమాండ్‌. వెంటనే అక్కడకు బయలుదేరి వెళ్లింది కేథీ. అక్కడి వేటగాళ్లను ఈ షార్క్‌ల వేట మానేయమని నచ్చచెప్పింది. కానీ వాళ్లు అదే మా జీవనాధారం అనడంతో, దాంతో ఆ డబ్బులేవో తనే ఇస్తా అనీ... వేట బదులు పర్యటకులకు షార్క్‌ అందాలు చూపిస్తూ స్నోర్‌కెల్లింగ్‌ బోట్‌ ట్రిప్స్‌ నడపమని వాళ్లకు నచ్చచెప్పింది. ఆ పర్యటకులనూ తనే తీసుకొస్తా అంది. అలా కేథీ అంతవరకూ తను చేస్తున్న టీచర్‌ ఉద్యోగాన్ని వదిలేసి, ‘డోర్సల్‌ ఎఫెక్ట్‌’ అనే సోషల్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ సంస్థని ప్రారంభించింది. అంతవరకూ గూగుల్‌లో కూడా లేని ట్రిప్స్‌ కోసం పర్యటకులు ఆసక్తి చూపించారు. నెమ్మదిగా ఆదాయం కూడా పెరిగింది. ఆ పెరిగిన ఆదాయాన్ని గతంలో షార్క్‌ల వేటగాళ్లుగా పేరుపడ్డ వాళ్లకు ఇచ్చేది. అలా వాటి వేటను ఆపగలిగింది. నవోమీ క్లార్క్‌షేన్‌ అనే శాస్త్రవేత్తతో కలిసి షార్క్‌లపైనా పరిశోధనా మొదలుపెట్టింది. అప్పుడే వాళ్లకి రింకోబాటస్‌ కూకీ అనే షార్క్‌ జాడ దొరికింది. అప్పటికి ఈ జాతి అంతరించిపోయిందని అంతా అనుకున్నారు. ఇదో అద్భుతంగా భావించింది కేథీ. అలాగే తన విద్యార్థులకూ జలచరాలని కాపాడమని ప్రోత్సహిస్తోందీమె.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్