మెటల్‌ అలర్జీ.. తప్పించుకునేదెలా?

నాకు మెటల్‌ అలర్జీ ఉంది. చెవులకు ఏవి పెట్టుకున్నా దద్దుర్లు వచ్చేస్తాయి. సమస్య నుంచి తప్పించుకునే మార్గముందా?

Published : 15 Jun 2021 00:21 IST

నాకు మెటల్‌ అలర్జీ ఉంది. చెవులకు ఏవి పెట్టుకున్నా దద్దుర్లు వచ్చేస్తాయి. సమస్య నుంచి తప్పించుకునే మార్గముందా?

- ఓ సోదరి

ఇది సాధారణ సమస్యే. దీన్ని కాంటాక్ట్‌ డెర్మటైటిస్‌ అని కూడా అంటాం. నికెల్‌ అనే లోహం దీనికి ప్రధాన కారణం. దీంతో తయారు చేసిన ఆభరణాలు, యాక్సెసరీల వల్ల దద్దుర్లు, దురద వస్తుంటాయి. ఇది కొంతమందిలో వెంటనే, మరికొంత మందిలో కొన్నేళ్ల తర్వాతా వస్తుంటుంది. ఒక్కోసారి కేవలం పెట్టుకున్న ప్రాంతానికే పరిమితం కాకుండా శరీరమంతా వ్యాపించే అవకాశమూ ఉంటుంది. ఎక్కువ దురద ఉండి, శరీర ఛాయలోనూ మార్పు వచ్చే అవకాశముంటుంది. ఒకసారి వచ్చినపుడు అశ్రద్ధ చేసి వాడుతుంటే పొక్కుల్లా వచ్చి నీరు కారుతుంటాయి. దీని కారణంగా సెకండరీ ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశమూ ఉంటుంది. ఆ ప్రదేశం వేడిగా మారడం, చీము కారడం, నొప్పి వంటివి దీని లక్షణాలు. ఇలాంటప్పుడు వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి.
ఇది ఎందుకు వస్తుందో చెప్పడం కాస్త కష్టమే. ఒక్కోసారి వంశపారంపర్యంగానూ వస్తుంటుంది. ఎలర్జీ వచ్చే వాటికి దూరంగా ఉండాలి. ఆభరణాల విషయానికొస్తే హైపో అలర్జిక్‌ జ్యూయలరీ అని దొరుకుతుంది. వాటిని పెట్టుకోవచ్చు. నికెల్‌ లేని యాక్సెసరీలూ ఉంటాయి. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌, టైటానియం, 18 క్యారెట్‌ ఎల్లో గోల్డ్‌, స్టెర్లిన్‌ సిల్వర్‌లను ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చు. వీటివల్ల అలర్జీ సమస్య చాలా తక్కువ. దాదాపుగా ఉండదనీ చెప్పొచ్చు. వాచ్‌ల విషయంలోనూ లెదర్‌, వస్త్రంతో చేసిన బ్యాండ్‌లున్న వాటిని ఎంచుకోవాలి. జిప్‌లనూ ప్లాస్టిక్‌ వాటిని ఎంచుకోవాలి. దురద కనిపిస్తే కార్టికో స్టెరాయిడ్‌ క్రీమ్‌ రాసుకోవాలి. అయినా తగ్గకపోతే యాంటీ హిస్టమిన్స్‌ వాడాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్