నా ఇంట్లో నాకు స్వేచ్ఛ దొరుకుతుందా?

పెళ్లయ్యి ఇరవై ఏళ్లు అవుతోంది. మా ఆడపడుచు భర్త చనిపోవడంతో మా ఇంట్లోనే ఉంటోంది. ప్రతి పనిలోనూ తనదే పై చేయి అంటుంది. నేను చేసిన పనుల్నే తిరిగి చేస్తుంది. ఏ పనీ నాకు చేతకాదంటూ ఎత్తిపొడుస్తోంది

Published : 13 Jul 2021 02:14 IST

పెళ్లయ్యి ఇరవై ఏళ్లు అవుతోంది. మా ఆడపడుచు భర్త చనిపోవడంతో మా ఇంట్లోనే ఉంటోంది. ప్రతి పనిలోనూ తనదే పై చేయి అంటుంది. నేను చేసిన పనుల్నే తిరిగి చేస్తుంది. ఏ పనీ నాకు చేతకాదంటూ ఎత్తిపొడుస్తోంది. నా భర్త ఆమెని పల్లెత్తు మాట అనడు. ఇదంతా నాకు ఇబ్బందిగా ఉంది. ఒక్కోసారి ఈ బాధలు తట్టుకోలేక ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నాయి. బయటికి వెళ్లిపోదామనుకున్నా... నా కూతురు భవిష్యత్తు కోసమే కలిసి ఉంటున్నా. నా ఇంట్లో నాకు స్వేచ్ఛ లభించేందుకు చట్టం ఏమైనా సాయం చేస్తుందా? 

 - ఓ సోదరి, నిజామాబాద్‌

ముందు మీరు ఆత్మహత్య ఆలోచనలు వదిలిపెట్టండి. ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉంటుంది. మీ విషయంలో న్యాయపరంగా ముందుకు వెళ్లడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. అయితే అవి మీ వైవాహిక బంధానికి ప్రతిబంధకాలు కాకూడదు. అందుకే ఆచితూచి అడుగు వేయండి. చెల్లెలు... భర్తని పోగొట్టుకుని ఇంట్లో ఉంటోంది అనే జాలితో మీ భర్త ఆమె మాట నెగ్గనిస్తున్నాడేమో! తల్లి ఎలానూ చెల్లి మాటకే విలువిస్తుంది కాబట్టి ఏ విషయంలోనూ వాళ్లకెదురు చెప్పకుండా, మీకు మద్దతు ఇవ్వకుండా అతడు గడిపేస్తూ ఉండి ఉండొచ్చు. ముందు మీ సమస్య ఆయనకు చెప్పి, మీ మానసిక క్షోభకు పరిష్కారం  సూచించమనండి. తనకి విలువ ఇచ్చి అడిగినందుకు మీ వారిలో మార్పు కనిపిస్తే సరే. లేకపోతే విషయాన్ని పెద్ద మనుషుల దృష్టికి తీసుకెళ్లండి. వారు మీ అత్త, ఆడపడుచులకు కావలసిన వాళ్లు అయి ఉంటే... పరువు పోతుందన్న భయంతో వారు దురుసుతనం తగ్గించుకునే అవకాశం ఉంది. ఇవేమీ ఫలించకపోతే గృహహింస కేసు పెట్టొచ్చు. దాని ద్వారా ఆడపడుచు మీద ప్రొటెక్షన్‌ ఆర్డర్‌ పొందండి. ఆమె ఒక్కదాని మీదా కేసు పెడితే మీ అత్త, భర్తలు మీకు వ్యతిరేకం కావొచ్చు. అలాగయితే అందరినీ చేర్చాల్సి వస్తుంది. గృహహింస నిరోధక చట్టంలో విడాకుల ప్రస్తావన లేదు. కానీ మీ పోషణ, నిర్వహణ ఖర్చుల కోసం భత్యం, ఇంట్లో ఉండటానికి భాగం, పాప చదువులకు అయ్యే ఖర్చు అన్నీ అడగొచ్చు. కానీ మీ ఆడపడుచు తనే అధికారం చేతుల్లోకి తీసుకునే ఛాన్స్‌ ఉంది కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్