సవతి పిల్లలతో గొడవలు రాకూడదంటే!

మా పెళ్లయ్యాక చాలాకాలం పిల్లలు లేరు. అప్పుడాయన నాకు తెలియకుండా మరో పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం. తర్వాత నాకూ ఓ పాప, బాబు పుట్టారు. ఇప్పుడు వారంతా పెద్దవాళ్లయ్యారు. జరిగిందేదో జరిగిపోయిందని

Published : 22 Jul 2021 01:39 IST

మా పెళ్లయ్యాక చాలాకాలం పిల్లలు లేరు. అప్పుడాయన నాకు తెలియకుండా మరో పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం. తర్వాత నాకూ ఓ పాప, బాబు పుట్టారు. ఇప్పుడు వారంతా పెద్దవాళ్లయ్యారు. జరిగిందేదో జరిగిపోయిందని మేం సర్దుకుపోయాం. ఎవరి జీవితాలు వాళ్లవి. అయినా భవిష్యత్తులో పిల్లల మధ్య ఆస్తుల గొడవలు రాకుండా చట్టపరంగా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి.

- ఓ సోదరి, హైదరాబాద్‌

భార్య/ భర్త బతికి ఉండగా, విడాకులు తీసుకోకుండా మరో పెళ్లి చేసుకోవడం చెల్లదు. మీ భర్త మీకు తెలియకుండా చేసుకున్న పెళ్లి కూడా చట్టబద్ధం కాదు. కానీ పిల్లలు మాత్రం ఆయన వారసులే అవుతారు. ఆస్తి ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది? స్వార్జితమా? పిత్రార్జితమా... అనే దానిపై వారసుల హక్కులు ఆధారపడి ఉంటాయి. మీ వారి స్వార్జితమైతే తనకిష్టం వచ్చిన వారికి ఆస్తిని పంచొచ్చు/ ఇవ్వొచ్చు. ఆయన వీలునామా రాయకుండా చనిపోతే పిల్లలకు అది పిత్రార్జితం అవుతుంది. దాంట్లో మళ్లీ మీ వారు పిత్రార్జితంగా అనుభవిస్తున్న ఆస్తి ఉంటే... అది కూడా భాగాలు పంచుకోకపోతే దానిని అందరితో పాటు (తన అన్నదమ్ములతో పాటు) భాగం పంచుకోవాల్సి ఉంటుంది. 2005లో వచ్చిన సవరణ చట్టం ప్రకారం కొడుకులతో పాటు కూతుళ్లు కూడా పుట్టుకతోనే పిత్రార్జితపు ఆస్తికి భాగస్వాములవుతారు. పిత్రార్జితపు ఆస్తిలో కొడుకులు బతికి ఉంటే కోడళ్లు భాగస్వాములు కారు. కాబట్టి మీ వారి స్వార్జితానికి ఓ వీలునామా రాసిపెట్టమనండి. అందరికీ సమంగా పంచితే న్యాయంగానూ ఉంటుంది. ఒకవేళ పిత్రార్జితపు ఆస్తిభాగం పంచుకోకపోతే దానికి మీ వారితో పాటు వారి పిల్లలు కూడా భాగస్వాములు అవుతారు. మీకు వీలయితే అందరూ కూర్చుని ఉన్న ఆస్తులన్నీ విభజించుకుంటే ఒక భాగస్వామ్య పత్రంగా ఫ్యామిలీ సెటిల్‌మెంట్‌ డీడ్‌గానీ రిజిస్టర్‌ చేసుకుంటే భవిష్యత్తులో ఏ సమస్యా రాదు. ఎవరికి ఏది చెందాలన్నా మీ భర్త చేతిలోనే ఉంది. అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు కాబట్టి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్