మొదటి భార్య... మా పెళ్లి చెల్లదంటోంది!

మాది ప్రేమ వివాహం. ఆయనకు అప్పటికే పెళ్లై పిల్లలున్నారు. పరస్పర అంగీకారంతో ఆమెతో విడాకులు తీసుకున్నాక నన్ను గుళ్లో పెళ్లి చేసుకున్నారు.

Updated : 23 Aug 2021 10:40 IST

మాది ప్రేమ వివాహం. ఆయనకు అప్పటికే పెళ్లై పిల్లలున్నారు. పరస్పర అంగీకారంతో ఆమెతో విడాకులు తీసుకున్నాక నన్ను గుళ్లో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆయన మొదటి భార్య మా పెళ్లి చెల్లదని కోర్టుకు వెళతానంటోంది. మాకో పాప. మా పెళ్లి చెల్లదంటే మా భవిష్యత్తు ఏమవుతుందో తెలియడం లేదు.

- ఓ సోదరి, హైదరాబాద్‌

పెళ్లై ఇద్దరు పిల్లలున్న వ్యక్తితో ప్రేమ వివాహం అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఆ వ్యక్తి మొదటి భార్యతో విడాకులు ఏ విధంగా తీసుకున్నాడు? మీ పెళ్లి ఎలా జరిగింది? అనే సమాధానాలను బట్టి అది చెల్లుతుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. అంటే విడాకులు కోర్టు ద్వారా జరిగి, వివాహం గుళ్లో అయినా...హిందూ సంప్రదాయ పద్ధతుల్లో చేసుకుంటే దానికి చట్టబద్ధత ఉంటుంది. అందుకు తగిన సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు మీది రెండో పెళ్లైనా మీ పిల్లలకి వచ్చిన నష్టమేమీ లేదు. మీవారి మొదటి భార్య కోర్టుకు వెళ్లి మీ పెళ్లి చెల్లదని రుజువు చేయడానికి ప్రయత్నిస్తే... మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారన్న విషయం కూడా నిరూపణ అవుతుంది. దీనివల్ల ఆవిడకు వచ్చే లాభమేమీ ఉండదు. అయితే మీరు మాత్రం మీ పెళ్లి శాస్త్ర ప్రకారం జరిగిందని సాక్ష్యాలు చూపించాలి. ఇవన్నీ పక్కన పెడితే భార్యాభర్తలుగా మీరిద్దరూ కలిసి జీవించడం వల్ల ఓ పాప పుట్టింది కాబట్టి మిమ్మల్ని పోషించాల్సిన బాధ్యత అతడిదే. అంతేకాదు...ఉద్యోగ విరమణ తర్వాత వచ్చే ప్రయోజనాలు ఎవరి పేరుని నామినీగా పెడితే వారికే చెందుతాయి. ఒకవేళ మీ భర్త మిమ్మల్ని చూడని పక్షంలో అతడి స్వార్జితపు ఆస్తికి పాపని వారసురాలిగా ప్రకటించేలా ప్రయత్నించండి. మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి అందులో ముగ్గురికీ సమానమైన హక్కులు లభిస్తాయి. అతడు ఇచ్చే గిఫ్ట్‌ లేదా విల్లు వల్ల  భవిష్యత్తులో ఆస్తి వివాదాలు రాకుండా ఉంటాయి. ఇప్పటికైనా మీరు మీ పెళ్లిని రిజిస్టర్‌ చేయించుకోండి. అయితే ఆవిడ నుంచి చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నాకే రెండో పెళ్లి రిజిస్టర్‌ చేసుకోవడానికి వీలు అవుతుంది. భవిష్యత్తులో అతడు మిమ్మల్ని చూడని పక్షంలో మీరు మెయింటెనెన్స్‌, కాంపన్సేషన్‌ లాంటి కేసులు వేసుకోవడానికి మీరిద్దరూ కలిసి జీవించారన్న సాక్ష్యాలు చాలు. అతను ఇచ్చే ప్రతిరూపాయికీ ఒక డాక్యుమెంట్‌ ఉండేట్లు చూసుకోండి. మీరు అతడి ఫస్ట్‌వైఫ్‌ గురించి భయపడే బదులు మీ భవిష్యత్తుకి అతడు ఎలాంటి పునాదులు వేయాలో ఆలోచించండి. జాగ్రత్తగా వ్యవహరించి అడుగులు వేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్