మా ఆస్తి.. చిన్న కొడుక్కి రాసింది!

మావారు రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి. సర్వీసులో ఉన్నప్పుడు 2003లో అపార్ట్‌మెంట్‌ కొన్నారు. బిల్డర్‌కు డబ్బు చెల్లించిన రశీదులన్నీ మావారి పేర ఉన్నాయి. లోనుకు దరఖాస్తు చేసుకోగా మంజూరైనా తీసుకోలేదు. అపార్ట్‌మెంట్‌  విషయం కలెక్టర్‌కి వార్షిక ఆస్తి వివరాలు తెలిపే స్టేట్‌మెంట్‌లోనూ నమోదు చేశారు. 2004లో రిజిస్ట్రేషన్‌ సమయంలో మా అత్తగారు తన పేరిట రిజిస్ట్రేషన్‌ చేయమనడంతో

Published : 30 Aug 2022 00:39 IST

మావారు రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి. సర్వీసులో ఉన్నప్పుడు 2003లో అపార్ట్‌మెంట్‌ కొన్నారు. బిల్డర్‌కు డబ్బు చెల్లించిన రశీదులన్నీ మావారి పేర ఉన్నాయి. లోనుకు దరఖాస్తు చేసుకోగా మంజూరైనా తీసుకోలేదు. అపార్ట్‌మెంట్‌  విషయం కలెక్టర్‌కి వార్షిక ఆస్తి వివరాలు తెలిపే స్టేట్‌మెంట్‌లోనూ నమోదు చేశారు. 2004లో రిజిస్ట్రేషన్‌ సమయంలో మా అత్తగారు తన పేరిట రిజిస్ట్రేషన్‌ చేయమనడంతో కాదనలేక చేశారు. అందులో ‘మదర్‌ ఆఫ్‌’ అని మా వారి పేరుంది. కానీ మా చిన్న మరిది పేరున ఆ అపార్ట్‌మెంట్‌ను రెండేళ్ల కిందట గిఫ్ట్‌ డీడ్‌గా ఆవిడ రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఈ విషయమై అడగ్గా.. ‘బినామీగా రిజిస్ట్రేషన్‌ చేయించావని కేసు పెడ్తా’నంటున్నారు. మేం కొన్నప్పట్నుంచీ అందులోనే ఉంటున్నాం. బిల్లులు, పన్నులు మేమే చెల్లిస్తున్నాం. గతంలోనే రూ.100 స్టాంపు పేపరు మీద ఆ ఇంటి సర్వహక్కులూ మాకే చెందుతాయని, మావారి సంపాదనతో కొన్నారని మా అత్తగారు రాసిచ్చారు. అపార్ట్‌మెంట్‌ మా పేర తిరిగి ఎలా మార్చుకోవాలి?

- ఓ సోదరి

మీ మరిది తన పేరు మీద చేయించుకున్న గిఫ్ట్‌ డీడ్‌ చెల్లదని ‘క్యాన్సిలేషన్‌ గిఫ్ట్‌ డీడ్‌’ కోసం దావా వేయండి. హిందూ వారసత్వ చట్టం- సెక్షన్‌ 14 ప్రకారం ఏదైనా ఆస్తి స్త్రీల పేరు మీద ఉంటే.. అది వారికి పెళ్లికి ముందు వచ్చినా, పెళ్లి తర్వాత వచ్చినా, వారసత్వంగా, భర్త ద్వారా, భాగస్వామ్యంద్వారా, కొనుగోలు, గిఫ్ట్‌.. ఎలా వచ్చినా అది ఆమెకు ‘అబ్‌సొల్యూట్‌ ప్రాపర్టీ’ అవుతుంది. తన ఇష్టం వచ్చిన వారికివ్వొచ్చు. మీ అత్తగారి చేతే గిఫ్ట్‌ డీడ్‌ క్యాన్సిలేషన్‌ చేయించొచ్చు. లేకపోతే మీవారు ఇంటి కోసం చేసిన అప్పుల కాగితాలు, ఇంటి పన్ను రశీదులు, కరెంటు బిల్లులు అన్నీ మీ అత్తగారి పేరుమీద కట్టినవి, కలెక్టర్‌కు సమర్పించిన ఆస్తి వివరాల పత్రాలు సాక్ష్యాలుగా చూపి మీ మరిది మీద దావా వేయండి. ఆవిడ రాసిన బాండ్‌ పేపర్‌ సాక్ష్యంగా చూపండి. కేసు గెలవాలంటే కొంచెం కష్టపడాలి. ఎందుకంటే పన్నులూ, బిల్లులూ మీరు కట్టినా అవి మీ అత్తగారి పేరు మీద కట్టి ఉంటారు. కాబట్టి మీవని నిరూపించుకోవడానికి ఉపయోగపడకపోవచ్చు. మీ అత్తగారు రాసిచ్చిన కాగితం స్టాంపు డ్యూటీ కడితే ఉపయోగపడొచ్చు. ముందుగా గిఫ్ట్‌ డీడ్‌ సంపాదించండి. మీ అత్తగారి ద్వారానే క్యాన్సిలేషన్‌ కేసు వేయిస్తే తప్పక గెలుస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్