ఆఫీసయ్యాక మాట్లాడదు..!

‘క్వైట్‌ క్విట్టింగ్‌’.. అంటే ఉద్యోగులు ప్రాథమిక బాధ్యతల్ని నిర్వరిస్తారు. దానికి మించి మాత్రం చేయరు. ఆఫీసు వేళలు ముగిశాకా ఉండటం, సమయానికి ముందే చేరుకోవడం ఉండవు. అత్యవసరం కాని మీటింగ్‌లకూ దూరంగా ఉంటారు. మీరూ దీన్నే ఎదుర్కొంటున్నట్టున్నారు. అప్పజెప్పిన పని చేస్తున్నారు. అంతకు మించి చేయాలనుకోవడం లేదు.

Published : 05 Oct 2022 00:41 IST

నా సహోద్యోగితో చిరాగ్గా ఉంది. మేం ఓ ప్రైవేటు బ్యాంకులో ముఖ్యమైన అకౌంట్స్‌ అన్నీ కలిసే చూస్తాం. అయితే ఆఫీసు వేళలు దాటాక, సెలవుల్లో మాట్లాడదు. మెసేజ్‌, ఈమెయిల్‌కీ స్పందించదు. నాకేమో క్లయింట్లతో ఒత్తిడి. కొన్ని సందేహాలకు తనతో మాట్లాడటం తప్పనిసరి. తనమో ఇలా.. విసుగొస్తోంది. నేనేం చేయాలి?

- సృజన

‘క్వైట్‌ క్విట్టింగ్‌’.. అంటే ఉద్యోగులు ప్రాథమిక బాధ్యతల్ని నిర్వరిస్తారు. దానికి మించి మాత్రం చేయరు. ఆఫీసు వేళలు ముగిశాకా ఉండటం, సమయానికి ముందే చేరుకోవడం ఉండవు. అత్యవసరం కాని మీటింగ్‌లకూ దూరంగా ఉంటారు. మీరూ దీన్నే ఎదుర్కొంటున్నట్టున్నారు. అప్పజెప్పిన పని చేస్తున్నారు. అంతకు మించి చేయాలనుకోవడం లేదు. సమస్యేం కాదు అనిపిస్తోంది కదూ! కానీ సంస్థలు అలా ఆలోచించవు. ఉద్యోగ వివరాలు, కాంట్రాక్టుల్లో ప్రస్తావించకపోయినా పని అవసరానికి తగ్గట్టుగా వేళలతో సంబంధం లేకుండా బాధ్యతగా ఉండాలనుకుంటాయి. దీంతో ఈ క్వైట్‌ క్విట్టింగ్‌ ట్రెండ్‌ వాళ్లకీ ఇబ్బందిగా మారింది. వాళ్లు ఉద్యోగాలు మానేస్తే సరే! కానీ విధుల్లో ఉంటూ ఇదే చేస్తామంటూ కూర్చోవడం, అత్యవసరమైనా ఇదే ధోరణి కొనసాగించడం చేస్తుంటారు. వీళ్ల వల్ల ఇతరులకు అదనపు భారం. నాయకత్వ స్థానాల్లో ఉన్న వాళ్లూ తక్కువ మంది ఉంటే సమస్య అని ఆలోచిస్తున్నారు తప్ప.. వాళ్లతో మాట్లాడి వాళ్ల ఆసక్తులు, ప్రాధమ్యాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. ముందు మీరు మీ సహోద్యోగి పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చాలాసార్లు పైవాళ్లకి ‘చేయలేకపోతున్నాం’ అని చెప్పినా ‘చూద్దాం, పరిష్కారాల కోసం ప్రయత్నిద్దాం’ అంటారే కానీ చేతల్లోకొచ్చేసరికి షరామామూలే! అందుకే చాలామంది ‘స్పందించకుండా ఉంటే సరి’ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇంకో విధంగా చెప్పాలంటే వ్యక్తిగత జీవితానికీ ప్రాధాన్యం ఇస్తుండొచ్చు. అలాగని వాళ్లు పనికి విలువ ఇవ్వనట్లు, సరిగా చేయట్లేదనీ కాదు. పూర్తి జీవితం ‘పనికే’ అన్నదానికి దూరంగా ఉంటున్నారంతే. కొవిడ్‌లో జీవితం విలువ చాలామందికి అర్థమైంది. అందుకే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటుండొచ్చు. లేదూ ఈ ఉద్యోగం నచ్చక, వేరే ప్రయత్నాల్లో ఉండి, జీతం కోసం ఇలా కొనసాగుతుండొచ్చు. ఇవన్నీ ఊహలే. అసలు కారణమేంటో తననే అడిగి కనుక్కోండి. దాని ప్రకారం నిర్ణయం తీసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్