షుగర్‌ పెరగకుండా.. బిడ్డకు ఆహారం ఎలా?

నా వయసు 35. ఐవీఎఫ్‌ ద్వారా గర్భం దాల్చా. మూడో నెల. ముందు నుంచీ పీసీఓఎస్‌ సమస్యలు ఉన్నాయి. ఫాస్టింగ్‌ షుగర్‌ పెరిగింది. చక్కెర స్థాయుల్ని నియంత్రణలో పెట్టుకోవాలంటున్నారు డాక్టర్లు.

Published : 13 Oct 2022 00:23 IST

నా వయసు 35. ఐవీఎఫ్‌ ద్వారా గర్భం దాల్చా. మూడో నెల. ముందు నుంచీ పీసీఓఎస్‌ సమస్యలు ఉన్నాయి. ఫాస్టింగ్‌ షుగర్‌ పెరిగింది. చక్కెర స్థాయుల్ని నియంత్రణలో పెట్టుకోవాలంటున్నారు డాక్టర్లు. ట్రీట్‌మెంట్‌ కోసం చాలా సమయం, డబ్బు వెచ్చించా. నేను ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

- ఓ సోదరి

ప్రెగ్నెన్సీలో అధిక బరువు, హార్మోన్లలో హెచ్చుతగ్గులు, కుటుంబ నేపథ్యం, శారీరక శ్రమ లేకపోవడం, అధిక వయసులో గర్భం దాల్చడం.. వీటివల్ల ఫాస్టింగ్‌ షుగర్‌ పెరుగుతుంది. అయినా సరైన ఆహార ప్రణాళికతో ఇన్సులిన్‌ లేకుండా, తక్కువ మొత్తంలో ఇన్సులెన్‌ ఇచ్చి చక్కెర స్థాయుల్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. బిడ్డ ఎదుగుదలకు అవసరమైన పోషకాల్నీ అందించవచ్చు. మీది సాధారణ బరువైతే ప్రెగ్నెన్సీలో 10-12 కిలోల వరకూ, అధిక బరువైతే 5-7 కిలోల వరకూ పెరగాలి. దాన్నిబట్టి ఆహార మోతాదుని నిర్ణయించుకోవాలి. ఆహారంలో మైదా, బ్రెడ్‌, పాలిష్డ్‌ రైస్‌లకు బదులుగా నిదానంగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్స్‌ ఉండే జొన్న రవ్వ, సజ్జ రవ్వ, ఓట్స్‌, దంపుడు బియ్యం తీసుకోవాలి. మేలైన మాంసకృత్తులు తీసుకోవాలి. సాధారణ రోజుల్లో మీ శరీర బరువులో కేజీకి గ్రాము చొప్పున ప్రొటీన్‌ అవసరం. ప్రెగ్నెన్సీలో వీటికి అదనంగా 15 గ్రాములు అందాలి. ఇనుము, కాల్షియం, విటమిన్‌-సి, బి కాంప్లెక్స్‌, ఫోలిక్‌ యాసిడ్‌, మేలైన కొవ్వులు.. అందాలి. ఆహారం కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తీసుకోవాలి. ప్రతి పూటా కూరగాయలూ, ఆకుకూరలూ, సలాడ్లూ తప్పనిసరి. టోన్డ్‌, డబుల్‌ టోన్డ్‌ పాలు, పెరుగు తీసుకోవాలి. విటమిన్లు, పీచు సమృద్ధిగా, చక్కెర స్థాయులు తక్కువగా ఉండే ఆపిల్‌, బత్తాయి, జామ, పుచ్చకాయ, పచ్చి అంజీరా, కర్బూజా తీసుకోవచ్చు. వీటిని భోజనం తర్వాత కాకుండా వ్యవధి ఇచ్చి మధ్యలో ఎప్పుడైనా తీసుకోవాలి. మాంసాహారులు గుడ్డు, చేపలూ, 100గ్రా. చికెన్‌ తీసుకోవచ్చు.  శాకాహారులైతే 30గ్రా. సోయా నగ్గెట్స్‌ లేదా పొట్టుతో ఉన్న పప్పు దినుసులు 100గ్రా. తీసుకోవాలి. శారీరక శ్రమ కొనసాగించండి. తిన్న అరగంటకు 10-15 నిమిషాలు నడవండి. ఈ డైట్‌ పాటిస్తూ, ఎప్పటికప్పుడు చక్కెర స్థాయులు పరీక్షించుకోండి. తల్లి బరువునీ, స్కానింగ్‌ ద్వారా బిడ్డ బరువు, ఎదుగుదలనీ గమనిస్తూ ఆహారంలో మార్పులు చేసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్